తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు ప్రతిసారి వివాదాస్పదంగా మారుతుంది. ప్రభుత్వ టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం.. దాన్ని సవాల్ చేస్తూ ఎవరో ఒకరు కోర్టుమెట్లు ఎక్కడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా అఖండ 2 సినిమా టికెట్ల రేట్ల పెంపుపై కూడా ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ సందర్భంగా హైకోర్టు.. ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో సినిమా టికెట్ల రేట్లను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇకపై టికెట్ ధరలకు పెంచమని సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరూ తమ వద్దకు రావొద్దని కోరారు.. హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరిమన్నారని మంత్రి ప్రశ్నించారు. తక్కువ ధరలు ఉంటేనే ఫ్యామిలీ మొత్తం వచ్చి సినిమా చూస్తుందని, అందుకే ఇకపై తెలంగాణలో రేట్లను పెంచబోమని మరోసారి మంత్రి స్పష్టం చేశారు.
కాగా, అఖండ 2 మూవీ టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్స్ షోలకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వ్యూలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ కొట్టి వేసింది. దీంతో రాష్ట వ్యాప్తంగా అఖండ 2 టికెట్ల రేట్లు యాథావిధిగా కొనసాగనున్నాయి.


