దేశవ్యాప్తంగా వరుసగా ఇండిగో విమానాల రద్దు, ప్రయాణీకుల అగచాట్లతో విమానయానరంగంలో గతంలో ఎన్నడూ చూడని తీవ్ర సంక్షోభం నెలకొంది. గత కొన్ని రోజులుగా వందలాది విమానాలు రద్దవ్వడంతో ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి పిల్లాపాపలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అటు విమానాలుటికెట్ల రద్దు, ఇటు సమయానికి రైళ్లు దొరక్క నానా కష్టాలపడుతున్నారు. దీనికి తోడు భరించ లేని ఆర్థిక భారం.
చేతగానితనం, నిర్లక్ష్యంతోనే ముప్పు
ఇండిగో విమాన సర్వీసుల రద్దు, టికెట్ ధరల భారీ పెరుగుదలపై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత గందరగోళానికి కారణమైన ఇండిగోను అదుపు చేయలేక పోవడపై ప్రయాణికులు మండిపడ్డారు. మరోవైపు మంత్రి అసమర్థత వల్లే ఈ సంక్షోభం నెలకొందని, విమానయాన సంస్థను నియంత్రించలేకపోతున్నారని ప్రతిపక్షాలు, విమాన పైలట్ల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇండిగో అంతర్గత సమస్యలపై మంత్రి స్పందించడంలో విఫలమయ్యారని, రెండు నెలల ముందే పైలట్ల సంఘం హెచ్చరించినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు గట్టిగానే వినిపించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కుదిపేసిన ఇండిగో సంక్షోభంపై వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దయ్యాయని విమర్శించారు. ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి రామ్మోహన్ నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
కేంద్రమంత్రి వైఫల్యమా? ఇండిగో వైఫల్యమా? అనేదానిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎయిర్‌లైన్స్ లోపాలను సరిదిద్దడానికి, నియంత్రించడానికి ఏర్పాటు చేసింది డీజీసీఏ (DGCA). మరి పైలట్ల పని గంటలు, విశ్రాంతిపై కచ్చితమైన మార్గనిర్దేశాలను ఇచ్చినప్పటికీ ఇండిగో ఎందుకు అమలు చేయలేదు. తీవ్ర సంక్షోభం వచ్చేదాకా ఎందుకు నియామకాలు చేపట్టలేదు. ఏ పైలట్ ఎన్ని గంటలు fly చేస్తున్నాడు అనే సమాచారం రియల్ టైంలో విమానశాఖ వద్ద ఉంటుంది. దీంతోపాటు ఏయే సంస్థ దగ్గర ఎంత మంది పైలట్స్ ఉన్నారో రెగ్యులేటరీ దగ్గర పూర్తి డేటా ఉంటుంది. ఇండిగోలో పైలట్ల కొరతనుగుర్తించడంలో అటు విమాన యాన శాఖ, ఇటు డీజీసీఏ వైఫల్యం, ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముందస్తు సమీక్షలు చేయని నిర్లక్ష్యం, పరిస్థితిని అంచనావేయడంలో ఘోర వైఫల్యమే ఇంతటి సంక్షోభానికి దారి తీసిందంటున్నారు. రామ్మోహన్ నాయుడు చేతగానితనంతోనే దేశ పరువు ప్రపంచస్థాయిలో దిగజారిందని పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రి రామ్మోహన్ నాయుడుకి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ తన శాఖపై పెట్టి ఉంటే ప్రయాణీకులకు ఇన్ని కష్టాలొచ్చేవి కావని మరికొంతమంది మండిపడుతున్నారు.
కబుర్లే గానీ, పనితనం లేదు
‘‘కుర్రాడికి కాళ్ళు ఎక్కడా భూమి మీద నిలవటం లేదు, ఇటువంటి స్ట్రోక్ అవసరం ఎంతైనా ఉంది. అడ్మినిస్ట్రేషన్ చెయ్యటం స్పీచులు ఇచ్చినంత ఈజీ కాదు, మా బెజవాడ ఎయిర్‌పోర్ట్‌లో అతని పనితనం చూశాం, అప్పుడే అనుకున్నాను ఈ కుర్రాడు కబుర్లు బాగా చెబుతాడు కానీ పనిమంతుడు కాడు అని జీవితంలో ఎయిర్‌ఫోర్ట్‌లో మొహం చూడని వాళ్ళు అతన్ని తిడుతున్నారు అని పోస్టులు చూసాను, జీవితంలో విమానాశ్రాయం మొహం చూడని వాళ్ళు కూడా అతన్ని గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు’’ అని మూడు రోజులు నుంచి విమానాలు దొరక్క, ట్రెయిన్స్ దొరక్క భోపాల్ లో ఇరుక్కు పోయిన ప్రయాణికుడి ఆవేదన ఇది.
రీఫండ్‌లు ఇస్తారు సరే, మా కష్టాల మాటేమిటి? మా ఆర్థిక నష్టాన్ని ఎవరు భరిస్తారు? మానసిక క్షోభకు ఎవరు విలువ కడతారు అంటూ బాధిత ప్రయాణీకుల ప్రశ్నలకు రామ్మోహనాయుడి దగ్గర సమాధానం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే చర్యలు తీసుకుంటున్నాం.. సమీక్షిస్తున్నాం అని కేంద్ర మంత్రి ఊదర గొడుతున్నప్పటికీ, ఇప్పటికీ ఇండిగో విమానాల రద్దుకు ఫుల్ స్టాప్ పడలేదు. ఇంకా కొంతమంది రీఫండ్‌లు, లగేజీలు పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఇండిగో క్రమంలో స్థిరీకరణలోకి వస్తున్నాయంటూ ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. విమానయాన రంగాన్ని సంరక్షిస్తాం, ప్రయాణీకుల భద్రతను కాపాడతాం అంటూ,ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్న వైనాన్ని మనం చూడవచ్చు. అంతేకాదు ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో వందలామంది ప్రయాణీకుల సజీవ దహనమైన ఎయిరిండియా విషాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరిన్ని ఘోరాలు జరగముందే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


