ఏం కొడుకువిరా నువ్వు.. | Elderly woman abandoned by son, Heartbreaking video viral | Sakshi
Sakshi News home page

వాడ్ని ఊరికే వ‌ద‌ల‌కండి..

Feb 7 2026 6:12 PM | Updated on Feb 7 2026 6:22 PM

Elderly woman abandoned by son, Heartbreaking video viral

త‌ల్లిని బ‌స్టాండ్‌లో వ‌దిలేసిన కొడుకు

మండిపడుతున్న నెటిజ‌నులు

''నా కొడుకు బారి నుంచి నన్ను కాపాడండి'' అని వ‌న దేవ‌త‌లు సమ్మక్క–సారలమ్మలను వేడుకున్నాడో భ‌క్తుడు. త‌న వేద‌నను వంద‌ రూపాయ‌ల నోటుపై రాసి హుండీలో వేశాడు. మ‌రికొంత మంది భ‌క్తుల నుంచి కూడా ఇలాంటి వేడుకోళ్లు వ‌చ్చాయి. ముదిమి వ‌య‌సులో ముస‌లి త‌ల్లిదండ్రుల‌ను వేద‌న‌కు గురిచేస్తున్న విదారక‌ ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో బాగా పెరిగిపోయాయి. క‌డుపున పుట్టిన పిల్ల‌ల‌ను పెంచి, ప్ర‌యోజ‌కుల‌ను చేసిన అమ్మ‌నాన్న‌ల‌కు చివ‌రి రోజుల్లో చీద‌రింపులే ఎదుర‌వుతున్నాయి. జీవిత చ‌ర‌మాంకంలో త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా నిల‌బ‌డాల్సిన పిల్ల‌లు వ‌దిలించుకోవాల‌ని చూస్తున్నారు. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సౌర్ ప‌ట్ట‌ణంలోని బ‌స్టాండ్‌లో 80 ఏళ్ల వృద్ధురాలు దిక్కుతోచ‌ని స్థితిలో ఒంట‌రిగా ఏడుస్తూ క‌నిపించింది. దీంతో ప్ర‌యాణికుడొక‌రు ఏమైంద‌ని ఆరా తీశాడు. త‌నను కొడుకు, కోడ‌లు వ‌దిలేసి వెళ్లిపోయార‌ని పెద్దావిడ వాపోయింది. త‌న కుమారుడు ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నాడ‌ని, అత‌డి పేరు సురేష్ శర్మ అని తెలిపింది. త‌నను కొడుకు- కోడ‌లు స‌రిగ్గా చూడ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ మారింది. అమ్మ‌ను వ‌దిలేసి వెళ్లిన కొడుకుపై నెటిజ‌నులు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు.

నెటిజ‌న్ల స్పంద‌న‌
పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం త‌ల్లిదండ్రులు త‌మ జీవితాల‌ను ధారపోస్తార‌ని, అలాంటి వారిని చివ‌రి రోజుల్లో చూసుకోవ‌డం వార‌సుల బాధ్య‌త‌ మాత్ర‌మే కాదు.. గౌర‌వం కూడా అని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశారు. తన కొడుకు పుట్టినప్పటి నుంచి అతడికి వాళ్ల‌మ్మ‌ పెట్టిన డబ్బు, ఆహారం, భద్రత, ఆశ్రయం, సంరక్షణకు మూల్యం వ‌సూలు చేయ‌డానికి కేసు పెట్టాల‌ని మ‌రొక‌రు సూచించారు. ఓరి దేవుడా! వృద్ధురాలు అలా ఏడుస్తుండటం తాను చూడలేకపోతున్నానని, ఇది చాలా హృదయ విదారకంగా ఉందని ఇంకొక‌రు ఆవేద‌న చెందారు. మ‌న స‌మాజంలో మానవత్వం ఇంత దిగజారిపోతుందని ఊహించలేకపోతున్నానని మరొకరు అన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు చూసిన‌ప్పుడు ఎక్కువ కాలం బ‌త‌కం కూడా శాపంగా కింద భావించాల్సి వ‌స్తోంద‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు.

చ‌ద‌వండి: 100 రూపాయ‌ల నోటుపై రాసి.. కాపాడాల‌ని వేడుకోలు

వీడియోలోని వృద్ధురాలికి ఎవ‌రైనా స‌హాయం చేశారా? ఆమె ఇప్పుడు ఎక్క‌డ ఉంద‌నే వివ‌రాలు తెలియ‌రాలేదు. త‌ల్లిని వ‌దిలేసి వెళ్లిన కొడుకును క‌చ్చితంగా శిక్షించాల‌ని నెటిజ‌నులు డిమాండ్ చేస్తున్నారు. స‌మాజంలో క‌నుమ‌రుగవుతున్న మాన‌వీయ‌ విలువ‌ల‌కు ఈ ఉదంతం అద్దం ప‌డుతోంద‌ని ఆలోచ‌నాప‌రులు నిట్టూరుస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement