బెతుల్: మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు హర్ష్.. ‘కోల్డ్రిఫ్’ (Coldrif) దగ్గు మందు సేవించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఈ సిరప్ తాగిన తర్వాత హర్ష్ కోమాలోకి వెళ్లగా, అప్పటి నుండి నాగ్‌పూర్ ఎయిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి తుదిశ్వాస విడిచినట్లు వైద్యలు తెలిపారు. సోమవారం నాగ్‌పూర్‌లో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు బెతుల్ జిల్లా వైద్యాధికారి మనోజ్ హుర్మాడే వెల్లడించారు.
చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ కోల్డ్రిఫ్ సిరప్‌పై జరిగిన విచారణలో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. చెన్నైలోని ప్రభుత్వ ఔషధ పరీక్షల ప్రయోగశాలలో నిర్వహించిన విశ్లేషణలో ఈ మందులో ‘డైథైలిన్ గ్లైకాల్’ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం, కాంచీపురానికి చెందిన ‘స్రేసన్ ఫార్మాస్యూటికల్స్’ తయారు చేసిన ఈ సిరప్‌లో ఏకంగా 48.8 శాతం మేర ఈ కల్తీ రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీసే అత్యంత ప్రమాదకరమైన పదార్థం.
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా, బెతుల్ జిల్లాల్లో ఈ కల్తీ దగ్గు మందు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ సిరప్ తాగిన చిన్నారుల్లో వాంతులు, జ్వరం, మూత్ర విసర్జన చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. హర్ష్ మరణంతో కలిపి ఈ తరహా ఘటనల్లో మరణించిన చిన్నారుల సంఖ్య 24కు చేరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. పలువురు చిన్నారులు ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సమగ్ర విచారణ చేపట్టింది. ఈ ప్రాణాంతక సిరప్‌ను సిఫార్సు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రభుత్వ వైద్యునితో పాటు, తయారీ సంస్థ యజమానిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సిరప్ విక్రయాలపై నిషేధం విధించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా 700కు పైగా దగ్గు మందు తయారీ సంస్థలపై ప్రభుత్వం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: బొగ్గు కుంభకోణం: 10 చోట్ల ఈడీ మెరుపు దాడులు


