న్యూఢ్లిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ స్పెషల్ సెల్‌లో స్వాత్ (SWAT) కమెండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27) భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఘజియాబాద్‌లోని ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఆమె కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త అంకుర్ చౌదరి.. కాజల్‌పై డంబెల్‌తో దాడి చేసి, ఆమె తలను తలుపు ఫ్రేమ్‌కు బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడని తర్వాత అంకుర్ స్వయంగా తన బావ నిఖిల్‌కు ఫోన్ చేసి, ‘నీ అక్కను చంపేశాను, వచ్చి శవాన్ని తీసుకెళ్లు’ అని చెప్పడం కలకలం రేపుతోంది.
కాజల్, అంకుర్ 2022లో డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కాజల్ 2023లో ఢిల్లీ పోలీసు విభాగంలో కమెండోగా ఎంపికయ్యింది. రక్షణ మంత్రిత్వ శాఖలో అంకుర్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించాడు. అయితే పెళ్లయిన 15 రోజుల నుండే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కారు ఇవ్వాలని, నగదు తేవాలని అంకుర్ కుటుంబం కాజల్‌ను శారీరకంగా, మానసికగా హింసించినట్లు సమాచారం.
కాజల్ తండ్రి రాకేష్ తన కుమార్తె మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాజల్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ అని, అంకుర్ కేవలం తన కూతురుని మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డను కూడా చంపి, రెండు హత్యలు చేశాడని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. గణౌర్‌లో అత్తమామల వేధింపులు భరించలేక వారు ఢిల్లీలోని మోహన్ గార్డెన్‌కు మారినప్పటికీ, అంకుర్ తన ప్రవర్తన మార్చుకోలేదన్నారు. నిరంతరం డబ్బు కోసం వేధిస్తూనే ఉండేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జనవరి 22న జరిగిన ఈ దాడి ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తొలుత హత్యాయత్నం కేసుగా నమోదు చేసినప్పటికీ, కాజల్ మరణించడంతో దానిని హత్య కేసుగా (సెక్షన్ 302 కింద) మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు అంకుర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, ఆ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: వందే భారత్ మెనూలో అదిరిపోయే మార్పులు


