న్యూఢిల్లీ: హౌరా(పశ్చిమ బెంగాల్) గౌహతి(అస్సాం) మధ్య నూతనంగా ప్రారంభమైన వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లో మాంసాహార భోజనాన్ని అందించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. గతంలో ఈ రైలులో కేవలం శాకాహార భోజనం మాత్రమే అందుబాటులో ఉండటంతో, ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అలాగే ఈ రైలులో ఆహార ఎంపికలపై రాజకీయంగానూ చర్చలు జరిగాయి.
దేశంలోనే మొట్టమొదటిది ఈ స్లీపర్ వెర్షన్ వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026,జనవరి 17, ప్రారంభించారు. ఈ రైలు జనవరి 22న కామాఖ్య నుండి, మర్నాడు హౌరా నుండి తన రాకపోకల కార్యకలాపాలను ప్రారంభించింది. కాగా పశ్చిమ బెంగాల్- అస్సాం రాష్ట్రాలను అనుసంధానించే ఈ సుదీర్ఘ రాత్రి ప్రయాణ రైలులో కేవలం శాకాహారం మాత్రమే అందించడం సరికాదని ప్రయాణికులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రైలులో ప్రయాణించేవారు తమ రోజువారీ ఆహారంలో మాంసం, చేపలకు ప్రాధాన్యత ఇస్తారని ప్రయాణికులు తెలిపారు.
అందుకే ‘వందేభారత్ స్లీపర్’ మెనూలో నాన్-వెజ్ ఆప్షన్లను కూడా చేర్చాలని పలువరు ప్రయాణికులు రైల్వే శాఖను కోరారు. రాత్రిపూట ప్రయాణించే రైలు కావడంతో ఆహార ఎంపికల్లో వైవిధ్యం ఉండాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. ప్రయాణికుల వినతిని స్వీకరించిన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చలు జరిపారు. అనంతరం వందే భారత్ స్లీపర్ క్యాటరింగ్ సర్వీసుల్లో మాంసాహారాన్ని తప్పనిసరిగా చేరుస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. వారం రోజుల్లో ఈ రైల్లో నాన్ వెజ్ అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. కామాఖ్య నుండి బయలుదేరే ఈ రైలులో అటే అస్సామీ వంటకాలు, హౌరా నుండి బయలుదేరే ఈ రైలులో బెంగాలీ వంటకాలు ప్రయాణికులకు అందించనున్నారు.
ఇది కూడా చదవండి: మైకుల్లో కాదు ‘మెటా’లో..


