ఈ క్షిపణులను ఇరాన్‌ ధనాధనా వేసిందనుకో.. | Why Iran Underground Missile Arsenal Is Alarming The US And Israel, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

ఈ క్షిపణులను ఇరాన్‌ ధనాధనా వేసిందనుకో..

Mar 10 2026 4:20 PM | Updated on Mar 10 2026 5:51 PM

 Iran’s Missile Arsenal Raises Global Concerns

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాను యుద్ధ భయాలు వీడడం లేదు. అయితే, ఇప్పుడు ఇరాన్ వద్ద ఉన్న ఓ శక్తిమంతమైన ఆయుధం పలు దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఆ ఆయుధాన్ని నాశనం చేసేందుకే.. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భూతల దాడులకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ప్రపంచాన్ని కలవరపరుస్తున్న ఆ ఆయుధం ఏమిటి? ఇరాన్ దాచిన ఆ ఆయుధాన్ని వెలికి తీయడం అమెరికా, ఇజ్రాయెల్ బలగాలకు సాధ్యమవుతుందా?

భూ గర్భంలో దాచిన ఇరాన్‌
ఆ ఆయుధాన్ని ఇరాన్‌ భూ గర్భంలో దాచింది. ఇరాన్ వద్ద ఉన్న ఆ శక్తిమంతమైన క్షిపణి గురించి, దాని విధ్వంసక సామర్థ్యం, పరిధి ఏమిటన‍్న విషయాలపై పాశ్చాత్య, పశ్చిమాసియా దేశాల నెటిజన్లు సెర్చింజన్లను జల్లెడపడుతున్నారు. ఇరాన్ వద్ద గగనతల దాడులకు కేవలం రెండు సుఖోయ్-14 యుద్ధ విమానాలుండగా.. వాటిని నాశనం చేసినట్లు ఖతార్ ఇప్పటికే ప్రకటించింది. అయితే.. మిగ్-29 విమానాలు 24 దాకా ఉన్నాయి. 

పాత తరం ఫాంటమ్ జెట్లు 60 వరకు, ఎఫ్-14 యుద్ధ విమానాలు 40 దాకా ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఇరాన్ తన యుద్ధ విమానాలతో దాడులు జరిపిన దాఖలాలు పెద్దగా లేవు. ఇరాన్ వద్ద భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. వీటిని కూడా ఇరాన్ ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వినియోగించలేదు. అందుకే, అమెరికా వైమానిక దళం ఇరాన్ గగనతలంపై ఆచితూచి ముందుకు సాగుతోంది. ఇరాన్ వద్ద భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.

క్షిపణులపైనే ఆధారపడి యుద్ధ తంత్రం 
యుద్ధంలో ఇరాన్‌ క్షిపణులనే నమ్ముకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరించే దేశాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ దగ్గర 3,000కు పైగా పెద్ద క్షిపణులున్నాయి. వీటిల్లో 27 రకాల బాలిస్టిక్ క్షిపణులను ఆ దేశం ఇప్పటి వరకు వినియోగించినట్లు అంచనా. క్రూయిజ్ క్షిపణులను పెద్దగా వినియోగించిన దాఖలాలు లేవు. షహబ్-1 వంటి క్షిపణుల పరిధి 300 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అయితే.. 3,000 నుంచి 4,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే ఖైమ్ వంటి క్షిపణులను ఇరాన్ ఇంకా తన అమ్ముల పొది నుంచి తీయలేదని తెలుస్తోంది. 2,500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న క్రూయిజ్ క్షిపణులు ఇప్పుడు ఇరాన్ శత్రుదేశాల పాలిట ముప్పుగా ఉన్నాయి.

వీటిని పావ్, ఖుద్స్, రాద్ నగరాలను లక్ష్యంగా చేసుకునేలా ప్రయోగించే ప్రమాదాలు లేకపోలేదు. అయితే.. ఇరాన్ వద్ద ఉన్న భారీ బాలిస్టిక్ క్షిపణులు ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. వీటిని ప్రయోగించిన తర్వాత లక్ష్యాన్ని లేదా దిశను మార్చడం సాధ్యం కాదు. హైపర్ సోనిక్ వేగం కారణంగా నిలువరించడం అసాధ్యమేనని తెలుస్తోంది. దిశ, లక్ష్యాన్ని మార్చగలిగే క్రూయిజ్ క్షిపణులను ఇప్పటికీ ఇరాన్ వాడకపోవడంతో.. ఏ క్షణమైనా యుద్ధం మరింతగా ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇరాన్ క్షిపణుల నిల్వపై అమెరికా దృష్టి
అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ భూగర్భంలో ఉన్న క్షిపణుల నిల్వపై దృష్టి సారించాయి. అందుకే.. ఇరుదేశాల సైన్యం భూతల దాడులకు సిద్ధమవుతున్నాయి. సరిహద్దుల నుంచి భూతల దాడులను ప్రారంభించకుండా.. క్షిపణుల స్థావరాలుగా భావించే ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా తమ సైన్యాన్ని దింపి, గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇరాన్ తన అమ్ములపొదిలోని క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించకముందే.. వాటిని గుర్తించి, ధ్వంసం చేయాలని అమెరికా అడుగులు వేస్తోంది.  - సాక్షి వెబ్‌డెస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement