వాషింగ్టన్: ఇరాన్ అత్యున్నత నేత ఆయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లతో నేరుగా సైనిక పోరాటం సాగిస్తున్న ఇరాన్.. విదేశాల్లో ఉన్న తన ‘స్లీపర్ సెల్స్’ను అప్రమత్తం చేస్తూ, రహస్య సంకేతాలు పంపినట్లు సంచలన సమాచారం బయటకు వచ్చింది. ‘ఆపరేషనల్ ట్రిగ్గర్’గా భావిస్తున్న ఒక ఎన్‌క్రిప్టెడ్ (రహస్య సంకేతాలతో కూడిన) సందేశాన్ని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి.
ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ మృతిచెందిన కొద్దిసేపటికే ఇరాన్ నుంచి ఒక ప్రత్యేక రేడియో స్టేషన్ ద్వారా ఈ సంకేతాలు వెలువడినట్లు ‘ఏబీసీ న్యూస్’ కథనం వెల్లడించింది. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడకుండా, పాతకాలపు రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా పంపిన ఈ సందేశం కేవలం సంబంధిత ‘కోడ్’ తెలిసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. విదేశాల్లో మాటువేసిన ఇరాన్ అనుకూల ఉగ్రవాద మూకలు, గూఢచారులకు తక్షణమే దాడులకు దిగాలని లేదా విధ్వంసక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశిస్తూ ఈ ‘ట్రిగ్గర్’ సందేశాన్ని పంపినట్లు అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు గమనించాయి.
అయితే ఈ దాడులు ఎక్కడ జరగవచ్చనే దానిపై నిర్దిష్ట సమాచారం లేనప్పటికీ, అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాల భద్రతా విభాగాలకు సూచనలు అందాయి. గత వారం రోజులుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భీకరమైన వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. మరోవైపు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయగా, ఆ సంస్థ ఇజ్రాయెల్ భూభాగంపై రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా గడ్డపైనే ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఉగ్రవాద వ్యతిరేక బృందాలను హై అలర్ట్‌లో ఉంచారు. ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, మయామి వంటి ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాల వద్ద గస్తీని పెంచారు. అమెరికా భూభాగంపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. "యుద్ధం అన్నాక ప్రాణనష్టం తప్పదు, మేము అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుఉ సిద్ధంగా ఉన్నాం’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
ఇది కూడా చదవండి: యూఏఈ కాన్సులేట్‌పై డ్రోన్ దాడి


