చమురు నిల్వలే లక్ష్యం! | Israeli attacks on Iranian oil reserves | Sakshi
Sakshi News home page

చమురు నిల్వలే లక్ష్యం!

Mar 10 2026 3:16 AM | Updated on Mar 10 2026 3:16 AM

Israeli attacks on Iranian oil reserves

ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో టెహ్రాన్‌ నగరంపై దట్టంగా అలుముకున్న పొగ, మంటలు

ఇరాన్‌లో 30 కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడులు  క్షిపణి, అణు కేంద్రాలపైనా బాంబుల వర్షం

తీవ్రస్థాయిలో ప్రతి చర్యలకు దిగిన ఇరాన్‌ 

గల్ఫ్‌ దేశాల్లోని చమురు కేంద్రాలపై దాడులు 

మంటల్లో యూఏఈ, బహ్రెయిన్‌ క్షేత్రాలు 

ఖమేనీ వారసునిగా కుమారుడు మొజ్తబా 

సుప్రీం నేతగా ఎన్నుకున్న మత పెద్దల కమిటీ 

భారతీయులెవరూ మరణించలేదు: సౌదీ 

ఇజ్రాయెల్‌లో ఓ భారతీయునికి గాయాలు

దుబాయ్‌: పశ్చిమాసియాలో పోరు బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇరాన్‌ చమురు నిల్వలపై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్‌ మరింతగా పెంచింది. ఆదివారం 4 కేంద్రాలపై దాడులు చేయగా సోమవారం ఏకంగా 30 చమురు నిల్వ డిపోలపై బాంబుల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా భారీగా మంటలు చెలరేగి భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ క్షిపణి, అణు కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్, అమెరికా తీవ్రస్థాయిలో దాడులను కొనసాగించాయి. దాంతో నతాంజ్, ఇస్ఫహాన్‌ అణు కేంద్రాలు, పరిసర ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. ఇస్ఫహాన్‌లోని రివల్యూషనరీ గార్డ్‌ కమాండ్‌ కేంద్రాలు, దాని అనుబంధ సంస్థ బసీజ్‌ ఫోర్స్‌ ప్రధాన కార్యాలయం భారీగా దెబ్బతిన్నాయి.

రాకెట్‌ ఇంజిన్ల తయారీ కేంద్రంతో పాటు క్షిపణి ప్రయోగ కేంద్రాలను కూడా నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై కూడా రోజంతా ఎడతెరిపి లేకుండా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్‌ కూడా గల్ఫ్‌ దేశాల్లోని చమురు నిల్వలనే లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్‌ దాడుల్లో యూఏఈలో ఒక చమురు కేంద్రానికి భారీగా నిప్పంటుకుంది. బహ్రెయిన్‌లోని ఏకైక చమురు రిఫైనరీ కూడా మంటల్లో చిక్కింది. సౌదీ అరేబియాలో అతి పెద్దదైన షైబా చమురు క్షేత్రంపైనా పలు డ్రోన్‌ దాడులు జరిగాయి. వాటిని అడ్డుకున్నట్టు సౌదీ ప్రకటించింది. అయినా షైబా వైపు దశలవారీగా డ్రోన్లు దూసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఇరాన్‌ తీరు బాధ్యతారహితమంటూ మండిపడింది.

అరబ్‌ దేశాలపై ఇలాగే దాడులు కొనసాగిస్తే అంతిమంగా అందరికంటే భారీగా నష్టపోయేది ఆ దేశమేనంటూ తీవ్రంగా హెచ్చరించింది. అటు ఇజ్రాయెల్‌పైకి కూడా ఇరాన్‌ భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్‌ అవీవ్, జెరూసలేంతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. దాడుల్లో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఆదివారం తమపై ఇరాన్‌ జరిపిన దాడుల్లో మరణించిన ఇద్దరిలో ఒక భారతీయుడు ఉన్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదని సౌదీ అరేబియా పేర్కొంది. 

బహ్రెయిన్‌లో 32 మందికి గాయాలు 
యూఏఈ, బహ్రెయిన్, కువైట్, దోహా, ఖతర్‌ తదితర గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్‌ డ్రోన్‌ దాడులు భారీ స్థాయిలో కొనసాగాయి. బహ్రెయిన్‌లో ఓ పౌర ఆవాస ప్రాంతం కుప్పకూలడంతో 32 మంది గాయపడ్డారు. వారిలో పలువురు చిన్నారులున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూఏఈపై కూడా 15 బాలిస్టిక్‌ మిసైళ్లు, 18 డ్రోన్లతో ఇరాన్‌ దాడి చేసింది. తమ దేశంపైకి దూసుకొచ్చిన 17 క్షిపణులు, ఆరు డ్రోన్లను అడ్డుకున్నట్టు ఖతర్‌ పేర్కొంది. పర్షియన్‌ గల్ఫ్‌ తీర సమీపంలో అమెరికా యుద్ధ నౌకలతో పాటు చమురు నౌకలను కూడా లక్ష్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తమ దేశ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్‌ ఖండాంతర క్షిపణిని నాటో డిఫెన్స్‌ వ్యవస్థలు అడ్డుకుని కూల్చేసినట్టు టర్కీ ప్రకటించింది. బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్‌ను నిర్వీర్యం చేసినట్టు ఇరాక్‌ వెల్లడించింది. మరోవైపు లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 486కు చేరినట్టు లెబనాన్‌ పేర్కొంది. 

ఎన్నికపై నిరసనలు! 
సుప్రీం నేత పదవిని వారసత్వంగా మొజ్తబాకు కట్టబెట్టడంపై ఇరాన్‌లో పలువురు రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1979లో వారసత్వ పోకడలపై పోరాడి రాచరికాన్ని కూలదోసి, ఇప్పుడు మళ్లీ అదే దారిలో వెళ్లడం ఏ మేరకు సరైందని వాళ్లు ప్రశి్నస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తోంది. 

ఇరాన్‌కు మా దన్ను: పుతిన్‌ 
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇరాన్‌కు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తామని రష్యా ప్రకటించింది. నూతన సుప్రీం నేతగా ఎన్నికైన మొజ్తబాకు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇరాన్‌కు అన్నివిధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. గల్ఫ్‌ దేశాల్లో పౌరులపై ఇరాన్‌ దాడులను జపాన్, ఈజిప్ట్‌ ఖండించాయి.  

మొజ్తబాకే ఓటు
అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఫిబ్రవరి 28న తొలి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం తెలిసిందే. ఆయన వారసుడు ఎవరన్న సస్పెన్షన్‌కు ఇరాన్‌ సోమవారం తెర దించింది. ఊహించినట్టుగానే ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా హొసేనీ ఖమేనీనే సుప్రీం నేతగా ప్రకటించింది. 88 మంది మత పెద్దలతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌’ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. ఖమేనీపై జరిగిన దాడిలో 56 ఏళ్ల మొజ్తబా కూడా గాయపడ్డట్టు వార్తలు రావడం తెలిసిందే.

ఖమేనీతో పోలిస్తే మొజ్తబా మరింత కరడుగట్టిన మతవాదిగా, అమెరికా విద్వేషిగా పేరుబడ్డారు. దీనికి తోడు తండ్రితో పాటు మొజ్తబా తల్లి, భార్య, చిన్న కుమారుడు కూడా ఇజ్రాయెల్‌ దాడిలో మరణించారు. దాంతో ఆయన ప్రతీకారంతో రగిలిపోతున్నారు. దాంతో మొజ్తబా సారథ్యంలో ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతిదాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని భావిస్తున్నారు. మరోవైపు, ఖమేనీ వారసునిగా ఎవరిని ఎన్నుకున్నా మట్టుబెట్టి తీరతామని ఇజ్రాయెల్‌ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పోరు మరింత ముమ్మరం కావడమే తప్ప నెమ్మదించే పరిస్థితులు కని్పంచడం లేదు.

ఎరిత్రియా దాకా వెళ్లి తిరిగొచ్చిన ఇండిగో విమానం 
న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు బయల్దేరిన ఇండిగో విమానం పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎరిత్రియా నుంచే వెనక్కు తిరిగొచ్చింది. ఈ ఉదంతం సోమవారం చోటుచేసుకుంది. విమానం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి మాంచెస్టర్‌ బయల్దేరింది. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం అనంతరం, ఎరిత్రియా గగనతలంలోకి ప్రవేశించనుందనగా ఉన్నట్టుండి వెనుదిరిగి ఢిల్లీ చేరుకుంది.

ఇందుకు దారితీసిన కారణాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఎరిత్రియా హఠాత్తుగా గగనతలాన్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుందని ఇండిగో వర్గాలు అంటున్నాయి. యూరప్‌ రూట్లలో నడిపేందుకు నార్వేకు చెందిన నోర్సే అట్లాంటిక్‌ ఎయిర్‌వేస్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 787 విమానాలను ఇండిగో లీజుకు తీసుకుంది. ఇక్కడే ఎరిత్రియా ఎయిర్‌ ట్రాఫిక్‌ విభాగం అయోమయానికి లోనై అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ప్రయాణాన్ని తిరిగి కొనసాగించేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.

చమురు ధరలు దిగొస్తాయి: ట్రంప్‌
పశ్చిమాసియా పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు విపరీతంగా రెక్కలొచ్చాయి. అయితే రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు చూసి భయపడాల్సిన పనేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ‘‘చమురు నిల్వలకు కొరతేమీ లేదు. వాటి ధరలు త్వరలోనే దిగొస్తాయి’’ అని ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. వెనెజువెలా చమురు సాయంతో పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పారు. ఇరాన్‌ క్షిపణి పాటవాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు అతి దగ్గర్లో ఉన్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు.

మరో అమెరికా సైనికుని మృతి
మార్చి 1న కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడుల్లో గాయపడ్డ మరో సైనికుడు తాజాగా మృతి చెందాడు. అమెరికా సైన్యం సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దాంతో ఇప్పటిదాకా మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 8కి పెరిగింది.

ఇజ్రాయెల్‌లో గాయపడ్డ భారతీయుడు
ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడుల్లో ఒక భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం క్షిపణి దాడుల సందర్భంగా టెల్‌ అవీవ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్టు ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు. ‘‘మెడకు తీవ్ర గాయంతో విషమ పరిస్థితుల్లో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ఆపరేషన్‌ అనంతరం కోలుకుంటున్నాడు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది’’ అని వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement