వంట నూనెలు సలసల! | Essential commodities prices also increased with West Asia War | Sakshi
Sakshi News home page

వంట నూనెలు సలసల!

Mar 10 2026 2:33 AM | Updated on Mar 10 2026 2:33 AM

Essential commodities prices also increased with West Asia War

పప్పు దినుసులు, నూనె గింజల ధరలు కూడా

కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు! 

సామాన్యుడి ఇంటిని తాకిన పశ్చిమాసియా యుద్ధం సెగ

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం సెగ సామాన్యుడి ఇంటిని తాకుతోంది. ఇరాన్‌– ఇజ్రాయెల్‌– అమెరికా యుద్ధం మొదలైన తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను పెంచింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగిపోయాయి. ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే వంటనూనెలు, పప్పు దినుసు లు, నూనె గింజల ధరలు ఎగబాకాయి. కిరాణా దుకాణం నుంచి క్విక్‌ కామర్స్‌ ఆన్‌లైన్‌ మార్కెట్ల వరకు అన్ని చోట్ల ధరలు పెరిగాయి. వంట నూనెల ధరలు గతవారం రోజుల్లోనే లీటరుకు రూ. 15–25 వరకు పెరిగాయి. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఫిబ్రవరి చివరలో హైదరాబాద్‌లో లీటరు రూ.150కి అటు ఇటుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.170కి చేరింది. 

వేరుశనగ నూనె కూడా రూ. 180కి పైనే పలుకుతోంది. ఇక సామాన్యులకు అందుబాటులో ఉండే పామాయిల్‌ ధర లీటరుకు రూ.15 నుంచి రూ. 20 మేర పెరిగింది. మార్కెట్‌లో నిల్వలు ఉన్నప్పటికీ, ధరలు ఇంకా పెరుగుతాయనే సాకుతో కొన్నిచోట్ల నో స్టాక్‌ బోర్డులు పెట్టి మరీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బేగంబజార్, సికింద్రాబాద్‌ వంటి హోల్‌సేల్‌ మార్కెట్లలో కూడా హోల్‌సేల్‌ వ్యాపారులు నూనె ధరలను పెంచి విక్రయిస్తున్నారు. దాంతో రిటైల్‌ వ్యాపారులు కూడా ధరలను పెంచడంతో ఆ భారం సామాన్యుడిపై పడుతోంది.  

పెరిగిన పప్పుల ధరలు  
గల్ఫ్‌ దేశాల నుంచి రావలసిన పప్పు దినుసుల నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో పప్పు ధాన్యాల ధరలు భారీగా పెరిగాయి. కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ. 130–150 మధ్య పలుకుతోంది. వేరుశనగ దిగుబడి తగ్గడం వల్ల వీటి ధరలు కిలో రూ.180 నుంచి రూ.200కి చేరాయి. పెసర పప్పు, మినప్పప్పు ధరలు కూడా ఎగబాకాయి. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ ఉద్రిక్తతల వల్ల ఉత్పత్తి దేశాలతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారుల మధ్య సప్లై చైన్‌ లింక్‌ తెగిపోవడంతో ధరలను పెంచి విక్రయిస్తున్నట్లు వాణిజ్య వర్గాలు చెపుతున్నాయి.  

వంట సామగ్రి ధరలు పెరిగాయ్‌  
ఏం యుద్ధమో ఏమో. వంట నూనెలతోపాటు పప్పులు, మిర్చి, వేరుశనగ వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్‌ రేట్లు పెంచారు. ఈ ధరలతో హోటల్‌ నడుపుడు ఎట్లనో తెలుస్తలేదు. ధరలు పెరిగితే మేం కూడా టిఫిన్లు, చపాతి, భోజనాల ధరలు పెంచక తప్పదు. ధరలు పెరగకుండా సర్కార్‌ ప్రయత్నించాలి. 
–శేషమ్మ, హోటల్‌ నిర్వాహకురాలు, నాగర్‌ కర్నూల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement