పోలీసింగ్‌ మారాలి : సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Says Policing must change in Telangana | Sakshi
Sakshi News home page

పోలీసింగ్‌ మారాలి : సీఎం రేవంత్‌

Mar 10 2026 1:40 AM | Updated on Mar 10 2026 1:40 AM

CM Revanth Reddy Says Policing must change in Telangana

పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డీజీపీ శివధర్‌రెడ్డి

భవిష్యత్‌ సవాళ్లకు తగ్గట్లుగా మార్చుకోవాలి: సీఎం రేవంత్‌

పోలీసులు ఆటోమోడ్‌లోకి వెళితే సమాజానికి ప్రమాదం... ఆపదొస్తే ప్రజలు చూసేది పోలీసుల వైపే.. 

పోలీస్‌ అధికారులను నేను ఏ,బీ,సీ కేటగిరీలుగా చేసుకున్నా.. 

ఎలాంటి పైరవీలకు తావులేకుండా పోస్టింగ్‌లు ఇస్తున్నాం.. 

తెలంగాణ పోలీస్‌ ఆఫీసర్స్‌ రిట్రీట్‌– 2026లో ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌: కాలక్రమేణా నేర స్వభావం మారుతోందని, సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ సరఫరా వంటి భవిష్యత్‌ సవాళ్లకు తగ్గట్టుగా పోలీసింగ్‌లోనూ మార్పులు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీసుల వైపేనని, ఏళ్లుగా ప్రజల్లో పోలీసులు పెంచుకున్న విశ్వాసం అలాంటిదన్నారు. అయితే, పోలీస్‌ శాఖలో ఉద్యోగులు ఆటో మోడ్‌కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరమని సీఎం హెచ్చరించారు. 

మారుతున్న సాంకేతికత, నేరాలకు తగ్గట్టుగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్‌గ్రేడ్‌ కావాలని చెప్పారు. వచ్చే 25 ఏళ్లకు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. సోమవారం తెలంగాణ పోలీస్‌ అకాడమీలో నిర్వహించిన తెలంగాణ పోలీస్‌ ఆఫీసర్స్‌ రిట్రీట్‌– 2026 కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులనుద్దేశించి రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే...  

శాంతిభద్రతలు బలంగా ఉండాలి.. 
అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు బలంగా ఉండాలి. శాంతిభద్రతలు బాగున్న రాష్ట్రాల్లోనే పరిశ్రమలు వస్తాయి.. తద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. తెలంగాణలోనూ శాంతిభద్రతలు బాగున్నాయి కాబట్టే ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. దేశం వందేళ్ల స్వాతంత్య్రదిన వేడుకల నాటికి తెలంగాణ సాంకేతికంగా, అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి. అందుకు కొత్త విధానాలు తెస్తున్నాం. దేశంలో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారింది. ట్రాఫిక్‌ సమస్యలతో బెంగుళూరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమతమవుతున్నాయి. అలాంటి మెట్రోపాలిటన్‌ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌ నగరాన్ని కేవలం 24 గంటల్లో 2 సెం.మీ.వర్షపాతానికి తట్టుకునేలా అన్ని వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ, కోవిడ్‌ తర్వాత రెండు మూడు గంటల్లో 40 సెం.మీ.వర్షం వచ్చింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గుట్టుగా అన్ని వ్యవస్థలు మార్చుకోవాలి.  

సమస్యను అర్థం చేసుకోవాలి..  
పోలీసు విధుల్లో నిరంతరం సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉటుంది. ఎన్నో సమస్యలు పరిష్కరించాలి. అయితే సమస్య పరిష్కారంలో వేగంగా పరిగెత్తితే అది మరింత గందరగోళానికి దారి తీస్తుంది. సమస్యలను అర్థం చేసుకుంటే 50 శాతం పరిష్కారం దొరుకుతుంది. సమస్యను అర్థం చేసుకునేందుకు కింది స్థాయి సిబ్బందికి తగిన సమయం ఇవ్వండి. అధికారుల విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా వాళ్లకు డ్యూటీలు ఇస్తే మరింత రాణించే అవకాశం ఉంటుంది. 

జనాభా ప్రాతిపదికన క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్టుగా పోలీసులపై పనిభారం, ఒత్తిడి తగ్గించేలా సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలి. ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ వంటి సంస్థలు తమ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నాయి. కూబింగ్‌ పోయింది కాబట్టి గ్రేహౌండ్స్‌లో ఉన్న సిబ్బందిని మరోచోట వాడుకోవాలి. విచారణలో సేకరిస్తున్న సమాచారాన్ని ఐసీసీసీలో ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయండి. 

పోలీసులను ఏ, బీ, సీగా వర్గీకరించుకున్నా.. 
పోలీసు అధికారుల పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. దాని ఆధారంగా వాళ్లను నేను ఏ, బీ, సీ కేటగిరీల్లో వర్గీకరించుకుని పెట్టుకున్నా. దానికి అనుగుణంగానే నేను వారికి పోస్టింగ్స్‌ ఇస్తున్నా. ఈ విషయంలో నేను కరెక్ట్‌ లేదా తప్పు కావొచ్చు. ఈ రెండేళ్లలో ఎలాంటి ఫైరవీలు లేకుండా 90 శాతం మందికి ఇలానే పోస్టింగ్‌లు ఇచ్చాం. టీవీల్లో వచ్చే వరకు కూడా ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ వచ్చిందో తెలియలేదు. 

పోలీసింగ్‌లో మార్పులు, నూతన చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత, ఇతర అంశాలపై చర్చించేందుకు ఏటా డిసెంబర్‌లో పోలీస్‌ ఆఫీసర్స్‌ రిట్రీట్‌ నిర్వహించాలి. బడ్జెట్‌ ప్రవేశపెట్టకముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించుకోవచ్చు. సైబర్‌ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్‌మెంట్, ఇతర సమస్యల పరిష్కారానికి మీరు కొన్ని ప్రతిపాదనలు అందించారు. వీటిపై విశ్లేíÙంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల కమిటీ నియమిస్తాం.   

అందరికీ పోస్టింగ్‌లు వచ్చాయి: డీజీపీ శివధర్‌రెడ్డి  
2001–02లో అప్పటి డీజీపీ హెచ్‌జే దొర ఆఫీసర్స్‌ రిట్రీట్‌ ను ప్రారంభించారని, 24 ఏళ్ల తర్వాత ఆ సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించినట్టు డీజీపీ బి.శివధర్‌రెడ్డి తెలిపారు. గతంలో రెండు మూడేళ్లపాటు కూడా ఐపీఎస్‌ అధికారులు పోస్టింగ్‌లు లేకుండా చీఫ్‌ ఆఫీస్‌లో ఉండేవారని, అయితే గత రెండేళ్లలో ఏ ఒక్క అధికారి ఖాళీగా ఉండకుండా అందరికీ పోస్టింగ్‌లు ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు అని చెప్పారు. 

భవనాలు, రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ, పోలీసులు, రవాణాశాఖ అధికారులు కలిసి పనిచేస్తే ట్రాఫిక్‌ పరమైన సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. కార్యక్రమంలో భాగంగా టీజీ పోలీస్‌ అకాడమీ మ్యానువల్‌ను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్ట్రెంథెనింగ్‌ యూనిట్‌ ఏర్పాటుపై టీజీపీఏ, యూనిసెఫ్‌ల మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్, టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్, ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement