లొంగిపో.. బిడ్డా | Maoist Bhagya Undergrounf For 24 years | Sakshi
Sakshi News home page

లొంగిపో.. బిడ్డా

Mar 9 2026 8:14 AM | Updated on Mar 9 2026 8:28 AM

Maoist Bhagya Undergrounf For 24 years

24 ఏళ్లుగా అజ్ఞాతంలో మావోయిస్టు భాగ్య

కూతురి కోసం తల్లి ఎదురుచూపులు  

  

మిరుదొడ్డి (దుబ్బాక): సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భాగ్య 16 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లింది. 24 ఏళ్లుగా అజ్ఞాతంలోకి ఉంది. తెలంగాణలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతు­న్నారని, అందులో భాగ్య కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు నిన్నటి దాకా వినిపించాయి. అయితే ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే. వారిలో మావోయిస్టు భాగ్య లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మావో­యిస్టు భాగ్య అలియాస్‌ కల్పన, అలియాస్‌ రూపీ అలియాస్‌ మాధవి జీవించే ఉందని, పోలీసులు చెబుతుండగా, ఆమె పేరున రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఉద్యమంలోకి వెళ్లాక ఆమె ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పనిచేస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. 

ఎప్పుడు సావొత్తదో తెల్వదు 
పానం శాతగాకుంటైంది. రందితోని ఎముకల గూడయ్యాను. ఎప్పుడు సావొత్త­దో తెల్వదు. 24 యేండ్ల సంది నీ కోసం కన్నులు కాయలు కాచేలా ఎదురు సూత్తున్న. 9 సంవత్సరాల కిందట మీ నాయిన నర్సయ్య చనిపోయినా నువ్వు రాలేదు. ఇప్పుడు నేను సచ్చిపోతే నువ్వు వస్తవో రావో తెల్వదు. నేను బతికుండగా నువ్వు ఎన్‌కౌంటరై సచ్చిపోయి వస్తవో, లొంగిపోయి పానాలతో తిరిగి వస్తవో తెల్వలేదు బిడ్డా. నువ్వు యాడున్నా పోలీసులకు లొంగిపోయి రా బిడ్డా. కడ సూపుకన్నా నోచుకుంటాను. – రంగనబోయిన ఎల్లవ్వ, మావోయిస్టు భాగ్య తల్లి

Advertisement
 
Advertisement
Advertisement