‘రాజధాని’ విషయం మర్చిపోయిన రాష్ట్ర పోర్టల్
ఇంకా రాజేంద్రనగర్ సైబరాబాద్ కమిషనరేట్‌లోనే
జోన్ల పేర్లు మార్చడంలోనూ నిర్లక్ష్య ధోరణి
బదిలీ అయిన వాళ్లూ అక్కడే...ఇన్‌చార్జ్‌లు ఇంకా కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు...ఈ పేరు చెప్పగానే టెక్నాలజీ గుర్తుకువస్తుంది. దీని వినియోగానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న రాష్ట్రం అనేక ప్రాంతాలకు మార్గదర్శకమైంది. కేసు నమోదు నుంచి దర్యాప్తు, అభియోగపత్రాల దాఖలు వరకు ఆన్‌లైన్ విధానం కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాథమిక అంశమైన అధికారిక వెబ్‌సైట్ నిర్వహణలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పునర్వ్యవస్థీకరణను పట్టించుకోకుండా, అధికారుల బదిలీలపై దృష్టి పెట్టకుండా, అదనపు బాధ్యతలు తప్పినా ఇన్‌చార్జ్‌లను కొనసాగిస్తూ దీని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజధానిలోని కమిషనరేట్లలో జరిగిన మార్పుచేర్పులను పట్టించుకోవట్లేదు. కొన్ని బదిలీ, బాధ్యతల స్వీకరణ జరిగి ఇప్పటికి నెలన్నర అవుతున్నా అధికారిక వెబ్‌సైట్ (tspolice.gov.in)లో మాత్రం మార్పుచేర్పులు లేవు. ఇలాంటి చిత్రాలు మరెన్నో రాష్ట్ర పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
వాటిలో కొన్ని ఇవి...
జనవరి 17న జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి ఎస్.చైతన్యకుమార్ నగర డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ డీసీపీగా వచ్చారు. అంత వరకు ఈ పోస్టుకు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అంతర్థానమైపోయిన సౌత్ ఈస్ట్ జోన్‌ను కొనసాగిస్తున్న పోలీసు వెబ్‌సైట్ దీనికి చైతన్యకుమార్ డీసీపీగా ఉన్నట్లు చూపిస్తోంది.నగర పోలీసు విభాగంలో పరిపాలన డీసీపీగా కె.వెంకట లక్ష్మి నియమితులయ్యారు. అయినా ఇప్పటికీ తఫ్ఫీర్ ఇక్బాల్‌ను వెబ్‌సైట్ ఇన్‌చార్జ్‌గా కొనసాగిస్తోంది. ఈయన నగరంలో సౌత్ రేంజ్ అదనపు సీపీగా నియమితులైనా... ఇంకా సంయుక్త సీపీ శాంతిభద్రతలుగానే చూపిస్తోంది.
గతంలో నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌కు డీసీపీగా పని చేసిన అపూర్వ రావు కొన్నాళ్ల ఇంటెలిజెన్స్‌కు బదిలీ అయ్యారు. అధికారిక వెబ్‌సైట్ మాత్రం ఈ విషయం పట్టించుకోలేదు.
రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు హైదరాబాద్‌లో కలిశాయి. అలాగే నగరంలో ఉన్న జోన్ల పేర్లు ఈస్ట్, వెస్ట్, సెంట్రల్... నుంచి సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్... ఇలా మారాయి. ఈ అంశమూ వెబ్‌సైట్ నిర్వాహకులకు పూర్తిగా పట్టలేదు. రక్షితా మూర్తిని సికింద్రాబాద్ డీసీపీ అంటూ అప్‌డేట్ వెర్షన్ నమోదు చేసినా.. కె.శిల్పవల్లిని మాత్రం ఇప్పటికీ సెంట్రల్ జోన్ డీసీపీగానే వెబ్‌సైట్ సంబోధిస్తోంది. రాజేంద్రనగర్‌ను సైబరాబాద్‌తో చూపిస్తున్న సైట్... అక్కడ ఉన్న డీసీపీ శ్రీనివాస్‌కు బదులు యోగేష్ గౌతం అంటూ కొనసాగిస్తోంది.
రాచకొండ కమిషనరేట్ పేరు మల్కాజ్‌గిరిగా మారింది. అవినాష్ మహంతిని దీనికి కమిషనర్‌గా చూపిస్తున్న వెబ్‌సైట్... మహేశ్వరం జోన్‌ను మాత్రం రాచకొండగానే కొనసాగిస్తోంది. మరికొందరు డీసీపీ పోస్టులూ రాచకొండలో ఉన్నట్లే పేర్కొంటోంది. నగర సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా కె.శ్యామ్ సుందర్ వచి్చనా... ఇప్పటికీ అపూర్వ రావే ఇన్‌చార్జ్ అని వెబ్‌సైట్ చెప్తోంది.
హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీగా పని చేసిన చింతమనేని శ్రీనివాస్ చాలా రోజుల క్రితమే సైబరాబాద్‌లో కొత్తగా ఏర్పడిన శేరిలింగంపల్లి డీసీపీగా వెళ్లారు. విభజన తర్వాత జూబ్లీహిల్స్‌గా మారిన ఈ జోన్‌కు రమణారెడ్డి డీసీపీగా వచ్చారు. ఈ అంశాలు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ కాలేదు.
పాతబస్తీలోని సౌత్ జోన్ చారి్మనార్ జోన్‌గా మారిపోయింది. అయితే పోలీసు వెబ్‌సైట్‌లో మాత్రం ఇంకా పాత పేరే కొనసాగుతోంది.


