రిటైర్డ్‌ జడ్జి.. డిజిటల్‌ అరెస్ట్‌ | Retired judge Loses Rs 1. 66 Crore To Digital Arrest Scam | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ జడ్జి.. డిజిటల్‌ అరెస్ట్‌

Mar 9 2026 6:00 AM | Updated on Mar 9 2026 6:00 AM

Retired judge Loses Rs 1. 66 Crore To Digital Arrest Scam

మనీలాండరింగ్‌ కేసు పేరుతో బెదిరింపులు రూ.1.66 కోట్ల దోపిడీ

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరస్తులు తెలివిమీరిపోయారు. విద్యార్థులు, గృహిణులు, నిరుద్యోగులే కాదు ఉన్నత విద్యావంతులను కూడా అలవోకగా మోసం చేస్తున్నారు. కేటుగాళ్లు తాజాగా డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో ఓ జడ్జీనే మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేటుగాళ్లు ఆయన నుంచి రూ.1.66 కోట్లను దోచుకున్నారు. ఈమేరకు మల్కాజ్‌గిరి పోలీసు కమిషనరేట్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడ్‌మెట్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి (73)కి ఫిబ్రవరి 23న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను సీనియర్‌ సీబీఐ అధికారి దీపక్‌ కుమార్‌ అని పరిచయం చేసుకున్న కేటుగాడు.. మీరు ఆధార్‌తో అనుసంధానమైన రెండు మొబైల్‌ నంబర్‌లను మహిళలకు అభ్యంతరకరమైన కాల్స్‌ చేయడానికి ఉపయోగిస్తున్నారని రిటైర్డ్‌ జడ్జికి చెప్పాడు.

ఈమేరకు బెంగళూరులోని ఇందిరానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదే సమయంలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌరవ్‌ సారథిగా పరిచయం చేసుకున్న మరో మోసగాడు కాన్ఫరెన్స్‌ కాల్‌లో చేరి.. మానవ అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్నావని చెప్పాడు. ఈమేరకు సుప్రీంకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిందన్నాడు. కుటుంబం లేదా స్నేహితులతో సహా ఎవరితోనూ ఈ విషయాన్ని చర్చించవద్దని మోసగాళ్లు హెచ్చరించారు. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా, దొంగతనం కేసులున్నాయంటూ బ్యాంకు ఖాతాల వివరాలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

విచారణ తర్వాత డబ్బు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో అరెస్ట్, ప్రతిష్టకు నష్టం వాటిల్లుతుందని భయపడిన రిటైర్డ్‌ జడ్జి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 మధ్య నాలుగు లావాదేవీల్లో తన మూడు బ్యాంకు ఖాతాల నుంచి రూ.1.66 కోట్లను మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. నిందితులు హామీ ఇచ్చిన విధంగా తన డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement