శాసనమండలి భవన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. చిత్రంలో భట్టి, బండా ప్రకాశ్, పొంగులేటి, కోమటిరెడ్డి, గుత్తా, శ్రీధర్‌బాబు
హాజరైన కౌన్సిల్ చైర్మన్ గుత్తా, స్పీకర్ ప్రసాద్ కుమార్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభగా కొనసాగిన నిజాం కాలం నాటి ఈ భవనాన్ని ప్రభుత్వం రూ.30 కోట్ల ఖర్చుతో పునరుద్ధరించింది. ప్రస్తుతం జూబ్లీహాల్‌లో కొనసాగుతున్న శాసనమండలిని ఈ పునరుద్ధరించిన భవనంలోకి తీసుకురానున్నారు.
ఆదివారం ఉదయం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటరాగా, పునరుద్ధరించిన మండలి భవనాన్ని రేవంత్ ప్రారంభించి లోపలికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్‌లోని సీట్లలో ఆసీనులైన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ తదితరులు కొద్దిసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


