'సన్‌' డే ఒకలా.. మండే మరోలా.. | Huge fluctuations in temperature records in Telangana | Sakshi
Sakshi News home page

'సన్‌' డే ఒకలా.. మండే మరోలా..

Mar 10 2026 2:09 AM | Updated on Mar 10 2026 2:09 AM

Huge fluctuations in temperature records in Telangana

ఉష్ణోగ్రతల్లో భారీగా హెచ్చుతగ్గులు..

వాతావరణంలో వేగంగా మార్పులు 

వారం తర్వాత వడగండ్ల వర్షాలకు అవకాశం.. 

క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి.. నెలాఖరులో పెరుగుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతల నమోదులో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఒకరోజు అధికంగా, మరో రోజు సాధారణ స్థితి నుంచి అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. వేసవి సీజన్‌ ప్రారంభంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఒకేసారి సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు పెరగడం... మరుసటి రోజు సాధారణం కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. గత మూడు రోజుల ఉష్ణోగ్రతల నమోదు చూస్తే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి.  

శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా... చాలా ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  
⇒ ఆదివారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... సోమవారం భద్రాచలం, హనుమకొండ, నల్లగొండ, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.  

⇒ కనిష్ట ఉష్ణోగ్రతలు  చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్‌ తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసంతో నమోదు కావడం గత ఆరేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  
⇒ సోమవారం ప్రధాన ప్రాంతాల్లో... గరిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 39 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 16.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.  

మూడు రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు 
రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బిహార్‌ నుంచి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా మరాత్వాడ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో దక్షిణ, తూర్పు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఉత్తర ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. 

ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మార్చి చివరి వారం నుంచి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని, ఏప్రిల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావొచ్చని హెచ్చరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement