breaking news
Meteorological Department (IMD)
-
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఉదయానికల్లా ఇది వాయవ్య దిశలో కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది.ఇది సముద్ర మట్టం నుంచి 9.6 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. అల్పపీడనం, వాయగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తర ప్రాంత జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. సోమవారం ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశంఉందని, ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండడంతోపాటు రాష్ట్రమంతటా ఆకాశం మేఘావృతమవ్వడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 30.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.15 శాతం అధిక వర్షపాతంనైరుతి సీజన్ వర్షాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.81 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 54.98 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 15 శాతం అధికంగా వర్షాలు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 5 జిల్లాల్లో అత్యధికంగా, 9 జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిశాయి. 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఒక్కరోజు రాష్ట్రంలో సగటున 1.51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈ నెల 18 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో పెందుర్తిలో 87.5 మి.మీ, వేపగుంటలో 74 మి.మీ, జియ్యమ్మవలసలో 67మి.మీ, కురుపాంలో 60మి.మీ వర్షపాతం నమోదైంది. -
వాన జోరు.. వరద హోరు
సాక్షి, నెట్వర్క్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం, ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుకుగా మారడంతో రాష్ట్రంలో వానలు ఊపందుకున్నాయి. రెండు, మూడ్రోజులుగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లు నిండిపోయాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మరోవైపు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. పంట చేలు ముంపునకు గురయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీ వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగాయి. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో బుధవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు రెండు గేట్లు, స్వర్ణ ప్రాజెక్టు ఒక గేటు, కుమురంభీం ప్రాజెక్టు ఏడు, వట్టివాగు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం మత్తడివాగు గేటు ఎత్తారు. ఆసిఫాబాద్ మండలం తూంపెల్లి వాగు, నంబాల వాగు పొంగడంతో 13 గ్రామాలకు రాకపోకల్లో అంతరాయం కలిగింది. అలాగే కెరమెరి మండలం అనార్పల్లి వాగు, బూరుగూడ పెంచికల్‌పేట ఎర్రవాగు లోలెవల్ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నెన్నెల మండలం లంబాడి తండా ఎర్రవాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. భీమిని మండలం రాజారాం, కర్జీ భీంపూర్‌లో రోడ్డు కొట్టుకుపోయింది. కోటపల్లి మండలాల్లో వరద నీరు పంట చేన్లకు చేరింది. మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో రోడ్లపై వరద చేరింది. కలెక్టరుŠల్ ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షానికి మూడు వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబూబ్‌నగర్ జిల్లాల్లో.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పరిగి, వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బుధవారం రాత్రి వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. సరళాసాగర్, రామన్‌పాడు, పోపల్దిన్నె రిజర్వాయర్లకు భారీగా వరద కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 350 చెరువులు అలుగు పారుతున్నాయి. వనపర్తి జిల్లా ఊకచెట్టు వాగులో నీటి ఉధృతి పెరిగి ఆత్మకూర్–మదనాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి అతలా కుతలం సంగారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. న్యాల్కల్ మండల పరిధిలోని రేజింతల్ గ్రామ శివారులో వరద బ్రిడ్జిపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పంట పొలాలు వరదనీటితో నిండిపోయాయి. ప్రధానంగా పత్తి పంటతోపాటు చెరుకు, మినుము, సోయా, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలో.. సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మునగాల మండలంలోని మొద్దులచెరువు, కలకోవ ఊరచెరువు, రేపాల, నర్సింహులగూడెం, ముకుందాపురం తిప్పాయికుంట, ఆకుపాముల నాగులకుంట చెరువులు అలుగు పోస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ నిండు కుండలా మారింది. ఆయకట్టు పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సాగర్ ఎడమ కాల్వకు బుధవారం నీటి విడుదలను నిలిపివేశారు. కోదాడలో బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం రాత్రి గుడిబండ రోడ్డులో ఉన్న తులసీనగర్ టౌన్íÙప్లోకి వర్షపునీరు చేరడంతో ఇళ్లలోని వారిని మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీతో బయటకు తీసుకొచ్చారు. షిర్డీసాయినగర్‌కు వరద ముప్పు దృష్ట్యా అక్కడ ఉన్న ముస్లిం మైనార్టీ బాలికల పాఠశాల విద్యార్థులను మధ్యాహ్నమే ఖాళీ చేయించి ఇంటికి పంపారు. పలు కాలనీల్లో ఇళ్లు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మూసీ వంతెనలు పరిశీలించిన అధికారులు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో మూసీ పరవళ్లు తొక్కుతోంది. వలిగొండ మండలం బీమలింగం, భూదాన్ పోచంపల్లి మండలం జూలరు–రుద్రవెల్లి వద్ద లో లెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారులు మూసీ వంతెనలను పరిశీలించారు. భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో మూసీ ఆధారిత చెరువులు అలుగులు పోస్తున్నాయి. వరంగల్ లోతట్టు కాలనీల్లో వరద వరంగల్ నగరంలో మంగళవారం ఉదయం నుంచే వర్షం తగ్గుముఖం పట్టినా పలు లోతట్టు కాలనీల్లో ప్రవహిస్తున్న వరదనీరు ఉధృతి బుధవారం కూడా తగ్గలేదు. ఎస్ఆర్ఆర్ తోట, శివనగర్, మైసయ్య నగర్, శాకరాశికుంట, నాగేంద్రనగర్, కాశికుంట కాలనీలు నీటిలో ఉన్నాయి. 12 మెరీల నుంచి బొందివాగు వరకు రహదారిపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. శివనగర్‌లో బల్దియా ఏర్పాటు పునరావాస కేంద్రంలో నిర్వాసితులు తలదాచుకుంటున్నారు. -
నేడు అక్కడక్కడా అతిభారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. ఆదివారానికి దక్షిణ ఒడిశా మీదుగా కదులుతూ తీరం దాటనుంది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణ వరకూ తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉంది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వర్షాల ప్రభావం ఈనెల 17 వరకు ఉంటుందని.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 18న కూడా కొనసాగే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఈనెల మూడో వారంలో కోస్తాంధ్ర తీరాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఆ తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ప్రకాశం జిల్లా మద్దిపాడులో అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లా కోటనందూరులో 7.6, సామర్లకోటలో 7.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కరిముక్కిపుట్టిలో 6.8, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగుల వద్ద ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారముందన్నారు. -
72 గంటలు హై అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు రోజుల పాటు అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆన్‌డ్యూటీలో ఉండాలన్నారు. హైదరాబాద్‌తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వరద ముంపు పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి శాంతిభద్రతల విభాగం పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ం నిర్వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాజ్‌వేలు, వంతెనలపై రాకపోకలు ఆపండి ‘లోతట్టు కాజ్‌వేలు, ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల వంతెనలపై నుంచి రాకపోకలు లేకుండా చూడాలి. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు తరచూ వాగుల్లో చిక్కుకుపోతున్నారు. వారిని అప్రమత్తం చేయాలి. ఎక్కడైనా ప్రమాదవశాత్తు చిక్కుకుంటే వారిని తక్షణమే బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. గతంలో ఖమ్మంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడింది. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మన దగ్గర 24 గంటల్లో 2 సెం.మీ వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణాలు నిర్మాణం అయ్యాయి. కాబట్టి ఒకటీ రెండు గంటల్లోనే 20, 30 సెంటీమీటర్ల వర్షం (క్లౌడ్ బరస్ట్) పడితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి. అత్యధిక స్థాయిలో వర్షాలు పడే జిల్లాలు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలి. ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నీటి విడుదలపై అలర్ట్ చేయాలి.. ‘అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్లు ఉండేలా చూసుకోవాలి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అవసరమైన మందులు ఉంచాలి. గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లోపై నీటిపారుదల శాఖ పూర్తి అవగాహనతో ఉండాలి. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై పూర్తి సమాచారం లోతట్టు ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలి. చెరువులు, కుంటలు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని రేవంత్ ఆదేశించారు. జిల్లాలు కమాండ్ కంట్రోల్‌తో టచ్‌లో ఉండాలి.. ‘భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అన్ని జిల్లాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేయాలి. వారికి ఎప్పటికప్పుడు అలర్ట్ సమాచారం ఇవ్వాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్తో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అందరూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దు. సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి..’ అని సీఎం సూచించారు. అన్ని విభాగాలూ సమన్వయంతో పని చేయాలి ‘హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలూ అందుబాటులో ఉండాలి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సమన్వయంతో పని చేయాలి. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది.. ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలి. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు(సోమవారం) కూడా తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. పార్వతీపురం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.కాగా, హైదరాబాద్ మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న (శనివారం) రాత్రి 8:30 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది.ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షం కురిసింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్–విజయవాడ హైవేపై పెద్దఅంబర్‌పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది.ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగంబజార్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా, ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
ఉరిమిన వరుణుడు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి 8:30 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షం కురిసింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్–విజయవాడ హైవేపై పెద్దఅంబర్‌పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగంబజార్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా, ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
13న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 13 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో శనివారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఆదివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ అల్పపీడనం తర్వాత ఈ నెల మూడో వారంలో మరో అల్పపీడనం ఉత్తరాంధ్రకు సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, గడిచిన 24 గంటల్లో దేవరాపల్లిలో 55 మి.మీ. వజ్రకరూర్‌లో 53, రోలుగుంటలో 45, బీకే సముద్రంలో 42, పమిడిలో 40, పుంగనూరులో 37 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు రండి
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం మొదలైంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ సిరిసిల్ల, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.కాగా, నగరంలో నిన్న (గురువారం) రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్‌నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. -
వారం తర్వాతే వానలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షపాతం గణాంకాలు క్రమంగా పడిపోతున్నాయి. పదిరోజుల క్రితం కురిసిన వర్షాలు ఉత్సాహపర్చినప్పటికీ... ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 10 శాతం లోటు వర్షపాతం ఉంది. గత ఐదేళ్ల వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే... ఆగస్టు నాటికి రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ ప్రస్తుతం నైరుతి సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వర్షపాతం లోటులోనే ఉంది. గత వారం వరకు సాధారణ స్థితికి వచ్చిన గణాంకాలు మళ్లీ పడిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కానీ వరుస వర్షాలకు అవకాశం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో వారం వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవన సీజన్లో ఇప్పటివరకు బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం, వాయుగుండం, తుఫాను లాంటివి ఏర్పడలేదు. సాధారణంగా నైరుతి సీజన్లో రాష్ట్రంలో వర్షాలు కురవాలంటే బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులే కీలకం. కానీ ఇప్పటివరకు బంగాళాఖాతంలో తుఫానులాంటివి ఏర్పడకపోవడంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. ఈనెల 10వ తేదీ తర్వాత రుతుపవనాల గమనం అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నైరుతి రుతుపవన సీజన్లో ఆదివారం నాటికి రాష్ట్రంలో 37.80 సెం.మీ. సగటు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 34.30 సెం.మీ. నమోదైంది. అంటే సాధారణం కంటే 10 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదుకాగా, 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ⇒ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, జనగామ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ⇒ మండలాల వారీగా వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే... ఆరు మండలాల్లో మాత్రమే అత్యధిక వర్షాలు కురిశాయి. 73 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా.. 315 మండలాల్లో సాధారణ వర్షపాతం, 227 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
ఈ నెలలో వర్షాలు సాధారణమే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నెలలో తీవ్ర లోటువర్షపాతం నమోదు కాగా... జూలైలో కాస్త ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వర్షపాతం గణాంకాలు సాధారణ స్థితికి చేరాయి. ప్రస్తుతం నాలుగైదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర సగటు గణాంకాలు లోటు దిశగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ఆగస్టు నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆగస్టు నెల వర్షపాతం అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. ఈ నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, 94 శాతం నుంచి 106 శాతం మధ్యలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదైతేనే రైతాంగానికి లాభం చేకూరుతుందని వ్యవసాయ శాఖ చెబుతుండగా.. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. మండుతున్న ఎండలు... రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి పూట తీవ్ర ఉక్కపోతతో కూడిన వాతావరణం... రాత్రిపూట సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో భాగంగా ద్వితీయార్ధం ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా... ప్రస్తుతం అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, రాత్రిపూట మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని సూచించింది. నైరుతి సీజన్లో ఆగస్టు 1 వరకు 36.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 34.24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మూడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా... 24 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 6 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
నేడు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. ఇది ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా కదులుతూ ఆదివారానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా పాడేరులో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో 2.4 సెంటీమీటర్లు, అన్నమయ్య జిల్లా గాలివీడులో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
లోటు నుంచి సాధారణం దిశగా..
సాక్షి, హైదరాబాద్: నైరుతి వర్షాలు జోరందుకున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానలు రైతాంగానికి ఊరటనిస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి దాదాపు నెలన్నర పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా..ఇప్పుడిప్పుడే కురుస్తున్న వానలు సాగు పనులకు కాస్త ఊతమిస్తున్నాయి. వర్షపాత గణాంకాలు లోటు నుంచి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 31.48 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, శుక్రవారం నాటికి 30.48 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతాన్ని పరిశీలిస్తే.. 3 శాతం లోటు ఉంది. శనివారం ఉదయంకల్లా గణాంకాలు లోటు నుంచి సాధారణాన్ని చేరుకుంటాయని, నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆశాజనకంగా వర్షపాత గణాంకాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 12 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా... 12 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 40 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 34 శాతం, రంగారెడ్డి జిల్లాలో 24 శాతం, నారాయణపేటలో 14 శాతం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 13 శాతం అధిక వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, వనపర్తి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో కూడా సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. ⇒ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఇంకా వర్షపాతం గణాంకాలు లోటులోనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతానికి కాస్త సమీపానికి వచ్చాయి.తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలువాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని పశ్చిమబెంగాల్ తీరం, బంగ్లాదేశ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్టు వివరించింది దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల తేలికపాటి వర్షాలు, ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. -
మరో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి.. వాయవ్య బంగాళాఖాతం వైపుగా కదులుతూ శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ జార్ఖండ్, ఉత్తర ఒడిశా వైపు వెళ్లనుంది. దీని ప్రభావం రాష్ట్రంపై దాదాపు తగ్గిపోయింది. శనివారం రాత్రితో వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. నేడు, రేపు కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులకు హెచ్చరిక తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు. అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ను సంప్రదించాలి. వర్షపాతం తీరిది 24 గంటల వ్యవధిలో (గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగంలో 6.6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కరిముక్కిపుట్టిలో, పార్వతీపురం మన్యం జిల్లా గొయిడిలో 5.8, అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరంలో 4.6, శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలం మదనపురంలో 4.4, అల్లూరి జిల్లా జి.మాడుగులలో 4.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర బంగాళాఖాతంలో గురువారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్రకు సమీపంలో కొనసాగుతూ శుక్రవారం సాయంత్రానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం నెమ్మదిగా పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఆదివారం నాటికి పశ్చిమబెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరాలవైపు వెళ్లనుంది. అక్కడే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పుంజుకోనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదమున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో పాలకొండలో 69 మి.మీ, సీతంపేటలో 60, ముంచంగిపుట్టులో 53, చింతపల్లిలో 49, బూర్జలో 46 మి.మీ వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రానికి రెండ్రోజులు ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.53 సెం. మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలో గురువారం ఉదయం ఉపరితల ఆవర్తనం విలీనమైంది. దీంతో వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30–40 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈ మేరకు రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3–6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం నల్లగొండలో 28.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి: సీఎం భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం... గురువారం సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు నమోదైన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరద ఉధృతి ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షసూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని.. ప్రతి విభాగం అధికారితో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలని చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని.. జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలన్నారు -
అల్పపీడనం.. ఆలస్యం
సాక్షి, విశాఖపట్నం, సాక్షి అమరావతి: ఉష్ణ మండల తుపాను కారణంగా.. ఉత్తర కోస్తాకు సమీపంలో బుధవారం ఏర్పడాల్సిన అల్పపీడనం కాస్తా ఆలస్యమైంది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా.. గురువారం ఉత్తర బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం నాటికి ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం రెండూ ఉత్తర కోస్తాకు సమీపంలోనే కొనసాగుతూ.. క్రమంగా ఒడిశా వైపుగా కదలనున్నాయి. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అదేవిధంగా.. రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వానలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖార్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపథ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని సూచించారు. తీరం వెంబడి గంటకు 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో కంచిలిలో 71 మి.మీ., నరసన్నపేటలో 65, కోటబొమ్మాళిలో 55, మందసలో 50, కవిటి రాజపురంలో 48, ఇచ్ఛాపురంలో 43, వజ్రపుకొత్తూరులో 42, పలాసలో 40, సీతంపేటలో 39 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రమంతా కుండపోత
సాక్షి,నెట్వర్క్: రాష్ట్రాన్ని కుండపోత వాన ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కురిసిన ఏకధాటి వానతో దారులన్నీ ఏరులయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. బుధవారం ఉదయం నుంచి కుండపోత వానతో కరీంనగర్ తీవ్రంగా ప్రభావితమైంది. ఆకాశానికి చిల్లులు పడినట్టు ఉదయం 6 గంటల నుంచే వాన విరుచుకుపడటంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ వరదతో అతలాకుతలమైంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ ప్రాంగణాలు, ప్రధాన జంక్షన్లు, రహదారులు నీటమునిగాయి. కరీంనగర్ పట్టణంలో 9.3, మానకొండూరులో 7.5 సెం.మీ, గంగిపెల్లి 7.5 సెం.మీ, చింతకుంట 6.3 సెం.మీ, జగిత్యాల జిల్లా ధర్మపురి (నేరెళ్ల) 9.1 సెం.మీ, బీర్పూర్ 5.4 సెం,మీ, ఎండపల్లి 7.3 సెం.మీ, గుళ్లకోట 7.3 సెం.మీ, చొప్పున వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరువాన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో పలుచోట్ల వాగుల ప్రవాహం, లో లెవల్ చప్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుండగా, దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతమ్మ నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం నీట మునిగాయి. కిన్నెరసాని, వైరా రిజర్వాయర్లలో సైతం నీటి మట్టం పెరిగి వైరా రిజర్వాయర్ అలుగు పోస్తోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ప్రవాహం పెరగడంతో 15 గేట్లు ఎత్తి 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్లోని సీతారామ కాలువ వద్ద నలుగురు బాలురు ఈతకు వెళ్లగా ప్రవాహంలో బొర్రా శివ(16) గల్లంతయ్యాడు. కారేపల్లి మండల వ్యవసాయ అధికారి గాదెపాడు రైల్వేఅండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వరదలో కారు చిక్కుకుపోయింది. దీంతో స్థానికులు గుర్తించి తాళ్ల సాయంతో గంటపాటు శ్రమించి బయటకు తీశారు. ⇒ కుమురంభీం జిల్లావ్యాప్తంగా బుధవారం వర్షం దంచికొట్టింది. భారీ వరదతో చింతలమానెపల్లి, అహేరి మధ్య రవాణా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. ⇒ మంచిర్యాల జిల్లాలో ఎర్రవాగు ఉప్పొంగింది. కన్నెపల్లి మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రైతు బోరుకుంట రాజం తన భార్య, మరో ఇద్దరు కూలీలతో కలిసి మంగళవారం తిమ్మాపూర్‌లోని పత్తి చేనుకు వెళ్లాడు. పని ముగించుకుని వస్తుండగా అప్పటికే కురిసిన భారీ వర్షానికి ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ట్రాక్టర్‌పై వాగు దాటుతుండగా ప్రవాహం పెరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న వారంతా దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ఏజెన్సీలో ఉప్పొంగిన వాగులు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని జంపన్నవాగు ఉప్పొంగింది. కొండాయి వద్ద తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం పస్రా– తాడ్వాయి మధ్యలోని జలగలంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం పరిశీలించారు. మంగపేట మండల కేంద్రంలోని గిరిజన పెట్రోల్ బంక వద్ద ప్రధాన రోడ్డుపై నిర్మించిన కల్వర్టు సగం వరకు కోతకు గురై కొట్టుకు పోవడంతో ప్రమాదకరంగా మారింది. గార్ల సమీపంలోని పాకాల ఏరు బుధవారం చెక్‌డ్యాం పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రమైన గార్ల నుండి రాంపురం, మద్దివంచ పంచాయతీలకు చెందిన 12 గ్రామాలు, తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ⇒ ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధి అల్లిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి గుమ్మడి కృష్ణవేణికి పురిటినొప్పులు రావడంతో నర్సాపూర్ వాగు వరదలో నుంచి వైద్య సిబ్బంది గ్రామస్తుల సహాయంలో బుధవారం వాగు దాటించారు. ⇒ ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన తోటపల్లి వేణు(20) భద్రాచలంలో ఉంటున్న తమ్ముడికి బైక్ ఇవ్వడానికి వెళుతుండగా, మార్గమధ్యలో పెద్ద గొళ్లగూడెం వద్ద పిడుగు పడి చనిపోయాడు. ⇒ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలకేంద్రానికి చెందిన ఆగబోయిన నరేష్(30) రాళ్ల ఒర్రెవాగులో బుధవారం చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. రానున్న రెండ్రోజులు వానలేవానలు రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు ఏడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్లకు పైబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతిభారీ, ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వివరించింది. ⇒ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ మహబుబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ... ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ⇒ నైరుతి సీజన్లో ఇప్పటివరకు 29.78 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... బుధవారం నాటికి 26.79 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 10 శాతం లోటు వర్షపాతం ఉంది. నెలాఖరు కల్లా వర్షపాతం నమోదు గణాంకాలు మరింత మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాష్ట్రంలో సగటు వర్షపాతం 2.83 సెం.మీ.గా నమోదైంది. -
రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. దీంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా దక్షిణకోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
మరో రెండు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం/వాకాడు: మరో 2 రోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రానున్న రోజుల్లో బలపడి.. 24వ తేదీ సాయంత్రానికల్లా.. అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇది 25 వతేదీ రాత్రి లేదా 26న ఉదయానికి మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు విస్తారంగా పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా.. దక్షిణ కోస్తాలో రానున్న రెండు రోజుల్లో అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ తేలికపాటి వర్షాలు.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలల తాకిడికి బోట్లు బోల్తా ఉపరితల ఆవర్తనం, ధ్రోణి ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువుగా ఉంది. అలల తాకిడి కారణంగా సముద్రంలో చేపల వేట చేస్తున్న మత్స్యకారుల బోట్లు బోల్తాపడుతున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాళెం, దుగ్గరాజప ట్నం, అంజలాపురం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, పంబలి, ఓడపాళెం, మొనపాళెం, చినతోట, వైట్‌కుప్పం, పూడికుప్పం, పూడిరాయిదొరువు, నవాబుపేట మత్స్యకార గ్రామాల సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఆదివారం ఆడికృత్తిక పర్వదినం కావడంతో భక్తులు భారీగా సముద్ర తీరాలకు వచ్చారు. అలల తాకిడికి స్నానాలు సజావుగా చేయలేకపోయారు. కొందరు అలల ఉధృతికి చెల్లాచెదురుగా ఎగిరి ఒడ్డుకు నెట్టుకొచ్చారు. -
మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి,విశాఖపట్నం/సాక్షి, అమరావతి: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఆలస్యంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపుగా వంగి ఉంది. దీనికి అనుబంధంగా దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకూ తూర్పు పశ్చిమ గాలుల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయి.పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందనీ.. తీరం వెంబడి గరిష్టంగా 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో నంద్యాల జిల్లా పెరుసోమలలో 7.8, అల్లూరి జిల్లా లంబసింగిలో 5.7, ఏలూరు జిల్లా మిర్జాపురంలో 5.3, కోనసీమ జిల్లా రామచంద్రపురం లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసినా..మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. శనివారం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 37 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మరో రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం గ్రేటర్ హైదరాబాద్ సమీప జిల్లాల్లో జోరు వాన నమోదైంది. హైదరాబాద్, జనగామ, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, అదిలాబాద్ జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి. గత మూడు వారాలుగా వర్షాల జాడలేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 26.23 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 20.43 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. -
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, తార్నాక, సీతాఫల్మండి, చిలకలగూడ, సికింద్రాబాద్, మారేడుపల్లి, బోయిన్పల్లి, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్,జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. తెలంగాణలో 9 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్లొండ, రంగారెడ్డి, యాద్రాది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు మినహా అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ అయ్యింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనీ బీరంగూడ, ఆర్సీ పురం, మియాపూర్, సెరిలింగంపల్లి, చంద్రాయణగుట్ట, హయత్‌నగర్, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.కాగా, శుక్రవారం ఏకధాటిగా నాలుగు గంటల పాటు కురిసిన వానతో నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ప్యాట్నీ సింధీ కాలనీలో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్లను తొలగిస్తున్నారు. నాలా రిటైనింగ్ వాల్ కట్టకపోవడంతోనే ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. -
మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు సైతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. బికనీర్, సికార్, వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు వాయుగుండం కొనసాగుతోంది.ఇది క్రమంగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి సమాంతరంగా ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య తెలంగాణలో భారీ వర్షం..: శుక్రవారం రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిశా యి. ప్రధానంగా మధ్య తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. రా ష్ట్రంలో వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచి్చంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.జీహెచ్ఎంసీ సమీప జిల్లాల్లో భారీ వర్షం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు వర్షాలకు అనుకూలంగా మారాయి. దీంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు రోజులకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశాం. – డాక్టర్ కే.నాగరత్న డైరెక్టర్, ఐఎండీ–హైదరాబాద్ -
Heavy Rains: హైదరాబాద్ అతలాకుతలం.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం నుంచి దంచి కొట్టిన భారీ వర్షం.. నగరాన్ని అతలాకుతలం చేసేసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పలువురు వరద నీటిలో చిక్కుకున్నారు. కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను మళ్లిచారు. పలుచోట్ల ఫ్లై ఓవర్లు వాహనాలతో నిండిపోయాయి. భారీ వర్షం కారణంగా ఐటీ సెక్టార్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.నగరంలో రెండు గంటలపాటు వర్షానికి ఐటీ ఏరియా అతలాకుతలమైంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, రాయదుర్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని.. యాద్రాది, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్..హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యంది. భారీ వర్షానికి సికిందరాబాద్‌లో ‘పైగా’ కాలనీ నీటమునిగింది. కాలనీలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. కొన్ని పరిశ్రమలు, షోరూమ్ ఉద్యోగులు వరద నీటిలో చిక్కుకున్నారు. అత్యధికంగా మారేడ్‌పల్లిలో 11.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. బాలానగర్ 11, ఉప్పల్‌లో 10.5, మల్కాజ్‌గిరిలో 9.7, ఇబ్రహీంపట్నంలో 9.6, బండ్లగూడలో 9.5, ముషీరాబాద్‌లో 8.9, అంబర్‌పేట్‌లో 8.4, దుండిగల్ 8.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలువర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని రేవంత్ సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. -
ఏపీకి బిగ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.రుతు పవన గాలులు కొనసాగనున్నాయని.. 40-50 కిమీ వేగంతో గాలుల వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.మరోవైపు, తెలంగాణలొ గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని తెలిపింది. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శుక్ర, శని, ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గురువారం తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు..శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. -
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నేడు, రేపు (శుక్ర,శని) భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.కోస్తా జిల్లాల్లో ఐదు రోజులపాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదయినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.రుతుపవనాలు ప్రవేశించి.. దాదాపు నెలన్నర అవుతున్నా.. లోటు వర్షపాతమే కొనసాగుతోంది. మండు వేసవిని తలపించేలా భానుడు భగభగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో.. బ్రేక్మాన్సూన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎండలు.. లోటు వర్షపాతం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.వారి అంచనాల ప్రకారం గురువారం నుంచి రాష్ట్రంలో వర్షాలు క్రమక్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
రాష్ట్రానికి ‘మళ్లీ’ వర్షసూచన!
సాక్షి, విశాఖపట్నం: రుతుపవనాలు ప్రవేశించి.. దాదాపు నెలన్నర అవుతున్నా.. లోటు వర్షపాతమే కొనసాగుతోంది. మండు వేసవిని తలపించేలా భానుడు భగభగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో.. బ్రేక్మాన్సూన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎండలు.. లోటు వర్షపాతం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వారి అంచనాల ప్రకారం గురువారం నుంచి రాష్ట్రంలో వర్షాలు క్రమక్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
వాయుగండం
సాక్షి, హైదరాబాద్: ‘ముందస్తు’గా మురిపించిన వర్షాలు కీలక సమయంలో ముఖం చాటేయటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్ లో సమృద్ధిగా వానలు కురవాల్సిన సమయంలో.. మొగులు కోసం రైతన్న దిగులుగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాల కదలికలు మందగించడం, నిలకడలేని తీవ్రగాలుల ప్రభావంతో వర్షాలు జాడ లేకుండా పోయాయి. ఇదే సమయంలో తెలంగాణ ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో ఈ సీజన్లో వర్షాలు జోరుగా ఉంటాయని అంచనా వేశారు. ఈ అంచనాలు తలకిందులు కావటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. నైరుతి రుతుపవనాల సీజన్లోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో సగటున 24.34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 17.59 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సీజన్లో కేవలం జూన్, జూలై నెలల్లోనే ఎక్కువ వర్షాలు కురుస్తుంటాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరుసగా రెండు నెలలపాటు లోటు వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం అని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ⇒ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగతా 32 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. ⇒ ఏడు జిల్లాల్లో 20 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. ⇒ 24 జిల్లాల్లో వర్షపాతం భారీ లోటు నమోదైంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగుడెం, హబుబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నారాయణపేట జిల్లాల్లో 20 నుంచి 60 శాతం లోటు ఉంది. ⇒ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏకంగా 62 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. వేసవి ఎండలు తక్కువగా ఉండడంవల్లే.. రాష్ట్రంలో సాధారణంగా వేసవి సీజన్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది వేసవిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 20 సంవత్సరాల్లో మే నెలలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఈ సారి నమోదు కావడం గమనార్హం. ఎండల తీవ్రత తక్కువగా ఉంటే వర్షాలు సైతం తక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మే నెలలో వర్షాలు అధికంగా కురవడం కూడా ప్రస్తుత వర్షాభావ పరిస్థితులకు మరో కారణమని అంటున్నారు. రాష్ట్రంలో వానలు బాగా కురవాలంటే బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు కీలకమని నిపుణులు చెబుతున్నారు. గాలుల తీవ్రతతో వానలకు ఆటంకం నైరుతి సీజన్లో గాలుల తీవ్రత విపరీతంగా ఉంది. నిలకడలేని గాలుల కారణంగా వర్షాలు కురవడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం లాంటివి ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉండేవి. కానీ ఈ సీజన్లో ఇప్పటివరకు అలాంటివేవీ నమోదు కాలేదు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం లాంటివి కనీసం రెండుమూడు రోజుల పాటు కొనసాగితే వర్షాలు సమృద్ధిగా కురిసేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వానలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ... తెలంగాణలో మాత్రం తక్కువగా ఉన్నాయి. మరో వారం తర్వాత పరిస్థితులు మారుతాయని అంచనా వేస్తున్నాం. – జీఎన్ఆర్ఎస్ శ్రీనివాసరావు, వాతావరణ శాస్త్రవేత్త, హైదరాబాద్ వాతావరణ కేంద్రం -
తెలంగాణకు అలర్ట్.. రెండురోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. వర్షాలు లేక రైతాంగం ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎండలు, ఉక్కపోతతో సామాన్య ప్రజానీకం సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో.. రేపు(గురువారం) నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. అలాగే.. ఎల్లుండి మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్ష పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో పడొచ్చని హెచ్చరించింది.రాజధాని హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం లేదంటే రాత్రి తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 340 మండలాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జిల్లాలుఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లిభూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెంనల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండరంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ఈదురుగాలులు: గంటకు 30–40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.⚠️ హెచ్చరికలు:పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని సూచనచెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు -
హిమాచల్‌లో వర్షాలతో నష్టం
న్యూఢిల్లీ: గడిచిన రెండు వారాలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర నష్టం సంభవించింది. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 43 మంది మృతి చెందగా 37 మంది కనిపించకుండా పోయారు. ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా, 31 మంది గల్లంతయ్యారు. జూన్ 20వ తేదీ నుంచి హిమాచల్‌లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. వచ్చే మంగళవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని భిమ్‌టల్‌లో గురువారం ఉప్పొంగుతున్న జలాశయంలో మునిగి నేవీకి చెందిన ఇద్దరు సిబ్బంది చనిపోయారు. పఠాన్ కోట్కు చెందిన ప్రిన్స్ యాదవ్(22), బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సాహిల్ కుమార్(23)గా వీరిని గుర్తించారు. నైనిటాల్ నుంచి సరదాగా గడిపేందుకు వచ్చిన 8 మంది ఐఏఎఫ్ సిబ్బందిలో వీరున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులను మూసివేశారు. చార్ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. యమునోత్రికి వెళ్లే జాతీయ రహదారిపై ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడి ఈ రహదారిపైనున్న సిలాయి మలుపు వద్ద 12 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో, 9 మంది నిర్మాణ కార్మికులు కొట్టుకుపోయారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మండ్లా, సియోని, బాలాఘాట్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జబల్పూర్–మండ్లా జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదేవిధంగా, రాజస్తాన్‌లోని జైసల్మీర్ జిల్లా పొఖ్రాన్‌లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. -
ఈ నెలంతా వానలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానలు జోరందుకున్నాయి. గత నెలలో వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకోగా, ఈ నెలలో మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా ఉండనున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో ప్రస్తుతం వానలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై నెలలో వర్షాలు సాధారణం కంటే అధికంగా కురిసే అవకాశమున్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ మేరకు జూలై నెల వర్షాల అంచనాలను బుధవారం విడుదల చేసింది. ఈ నెలలో 22.74 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే... సాధారణం కంటే కనీసం 6 శాతం అధిక వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నెలలో రెండోతేదీ నాటికి సాధారణ వర్షపాతంలో 10 శాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో న్యూట్రల్ ఎల్‌నినో–దక్షిణ ఓసిలేషన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సీజన్ ముగిసే వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల్లో వర్షపాతం తక్కువగా నమోదు కావొచ్చని, కానీ తెలంగాణలో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వివరించింది.జూన్ నెలలో వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో నైరుతి సీజన్ ప్రారంభ నెలలో వర్షాలు అధికంగా కురుస్తాయి. గత ఐదేళ్లుగా వర్షపాత నమోదును పరిశీలిస్తే సాధారణం కంటే కనీసం 20 శాతం అధిక వర్షాలు నమోదవుతున్నాయి. కానీ ఈ ఏడాది జూన్ నెలలో తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నెలలో 13.03 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. కానీ నెల ముగిసే వరకు 10.42 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 20 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. గతేడాది గణాంకాలను పరిశీలిస్తే 15.90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత ఐదేళ్లలో తొలిసారిగా జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మూడు రోజులు..ఎల్లో అలర్ట్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గురువారం వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, శుక్ర, శనివారాల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇచ్చోడలో 6.2 సెంటీమీటర్ల వర్షం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గద్వాల జిల్లా అయిజలో 6.13 సెం.మీ., బజార్హత్నూర్లో 5.25 సెం.మీ., సరికొండలో 4.1 సెం.మీ., వెంకటాపూర్‌లో 4.05 సెం.మీ. వర్షం కురిసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 14.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు రాష్ట్ర ప్రణాళిక విభాగం తెలిపింది. -
దేశమంతటా రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు ఈ సీజన్లో తొమ్మిది రోజులు ముందుగానే దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించే రుతుపవనాలు జూలై 8వ తేదీనాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తా యని పేర్కొంది. ఈసారి మాత్రం ముందుగానే ప్రవేశించడంతోపాటు విస్తరించాయంది. 2020లో జూన్ 26వ తేదీకల్లా దేశమంతటా రుతు పవనాల విస్తరణ పూర్తయిందని గుర్తు చేసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ యూపీ, హరియాణాల్లో వ్యాపించాయని వివరించింది.వచ్చే వారం రోజుల్లో దేశంలోని వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం మీదుగా బలమైన అల్పపీడన వ్యవస్థల మద్దతుతో, రుతుపవనాలు వేగంగా ముందుకు సాగాయని తెలిపింది..అయితే, మే 29 నుంచి జూన్ 16 వరకు దాదాపు 18 రోజుల పాటు రుతు పవనాల కదలికలో స్తబ్దత ఏర్పడిందని పేర్కొంది. జూన్–సెప్టెంబర్ మధ్య ఈసారి సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశాలున్నాయంది.ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి..ఇద్దరు మృతిఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఆదివారం ఉదయం కురిసిన కుంభవృష్టి నిర్మాణ కార్మికులిద్దర్ని బలి తీసుకుంది. మరో ఏడుగురు గల్లంతయ్యారు. యమునోత్రి జాతీయ రహదారి పక్కన ఓ హోటల్ నిర్మాణం పక్కనే కార్మికులు తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. భారీ వర్షంతో కొండచరియలు విరిగి ఈ నివాసాలపై పడ్డాయి. ఈ ఘటనలో ఘటనలో ఇద్దరు చనిపోయారు.గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. హైవే దెబ్బతినడంతో ఛార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ కుంభవృష్టి కారణంగా సిమ్లా–కల్కా రైలు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. జార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్భుమ్ జిల్లాలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పండర్సోలిలోని ప్రైవేటు స్కూల్ ఆవరణలోకి వరద చేరడంతో లోపల కనీసం 162 మంది విద్యార్థులు చిక్కుబడిపోయారు. -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణి పేట (విశాఖ): బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. -
పశ్చిమ గాలుల ప్రభావం.. రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొద్ది రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భూ ఉపరితలానికి సమీప వాతావరణ పొరపై నైరుతి, పశ్చిమ దిశ నుంచి వీచే గాలుల ప్రభావం ప్రబలంగా ఉన్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కోస్తా ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావంతో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా పడుతున్నాయి. మరోవైపు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకూ 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లగా మారుతోంది. బుధవారం ప్రకాశం జిల్లా కరవాడిలో 22.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లా దరిమడుగు, పునుగోడులో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
Telangana: మూడు రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు వాలి ఉండగా, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. శనివారం ఉత్తరాంధ్ర తీరం, దాని పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తాజాగా వాయవ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంలో విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.దక్షిణ ప్రాంత జిల్లాలతోపాటు ఉత్తర ప్రాంతంలోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రా ష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు సోమవారం కురిసే అవకాశం ఉన్న ట్టు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే 4డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
ఎండ ప్రచండం!
జూన్ 14 వరకు తీవ్రమైన వడగాడ్పులు.. వాయవ్య భారతానికి వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక.పంజాబ్, హరియాణాలకు రెడ్ అలర్డ్. వచ్చే 48 గంటల్లో భానుడి ఉగ్రరూపం అంటూ జూన్ 12న ఐఎండీ మరో హెచ్చరిక.వేసవి వెళ్లిపోయింది. ఉష్ణోగ్రత ఉండిపోయింది! దేశంలోని అన్ని ప్రాంతాలను వడగాడ్పులు చుట్టు ముట్టాయి. ఇది ప్రస్తుతం.– సాక్షి, స్పెషల్ డెస్క్2030 నాటికి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, వంటి నగరాల్లో వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య ఇప్పటితో పోలిస్తే రెట్టింపు కానుందట. టైర్ –1, 2 సిటీల్లో 72 శాతం వాటికి తీవ్ర వేడిమి, భారీ వర్షాల ముప్పు పొంచి ఉందట. ఐపీఈ గ్లోబల్ – ఎస్రి ఇండియా సంయుక్త అధ్యయనం ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.భానుడి ప్రతాపానికి పంజాబ్, హరియాణా, రాజస్తాన్ తల్లడిల్లిపోతున్నాయి. ఢిల్లీలో రెడ్ అలెర్ట్. స్కూళ్లు బంద్. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ మధ్య నుండి జూన్ 10 వరకు దాదాపు 700 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ చరిత్రలోనే ‘హాటెస్ట్ ఇయర్’గా 2024 నమోదైంది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో భారత్‌లో సెగలు రేగుతున్నాయి. భవిష్యత్తుల్లో వేసవి కాలం.. మరిన్ని రోజులు ఉండనుందట. వడగాడ్పుల తీవ్రత మరింత పెరగనుందట. ఒకపక్క భారీ వర్షాలు.. మరోపక్క పిడుగుల వర్షం కురవనుంది. మానవాభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాల్లో పనిచేసే ఐపీఈ గ్లోబల్; భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)పై పనిచేసే ఎస్రి ఇండియా సంయుక్తంగా దేశంలో తీవ్ర వేడి, అత్యంత వర్షపాతం అంశాలపై అధ్యయనం చేశాయి. జిల్లా స్థాయిలో సమస్య తీవ్రతను మ్యాపింగ్ చేశాయి. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ప్రజారోగ్య వ్యవస్థలను పర్యావరణ ఉత్పాతాలను తట్టుకునేలా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.పదింట 8 జిల్లాల్లో...1993 నుంచి చూస్తే.. వేసవిలో తీవ్రమైన వడగాడ్పులు ఉండే రోజులు 15 రెట్లు పెరిగాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన వేడి, భారీ వర్షాలు.. ఇలా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2040 నాటికి.. ప్రతి 10 కోస్తా జిల్లాల్లోనూ 8 జిల్లాల్లో వేసవి ముగిసినా తీవ్ర వేడి, ఉక్కపోత వంటివి వర్షాకాలంలో కూడా నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సమస్యలకు పరిష్కారంగా.. రియల్‌టైమ్‌లో వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఒక క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ (సీఆర్ఓ) ఏర్పాటును ఈ అధ్యయనం సూచించింది. జీడీపీలో 4.5 శాతం తగ్గుదలఎండ దెబ్బకు ఆర్థిక నష్టం కూడా పెరిగే ముప్పు పొంచి ఉంది. 2030 నాటికి భారతదేశం అంచనా వేసుకున్న 8 కోట్ల ప్రపంచ ఉద్యోగాలలో 3 కోట్ల 40 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. తీవ్రమైన వేడి, ఉక్కపోత కారణంగా పని గంటల్ని కోల్పోయే పరిస్థితి ఉండటంతో ఈ దశాబ్దంలో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో 4.5 శాతం వరకు తగ్గుదల కనిపించవచ్చని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది.తీవ్రం.. సాధారణం!తీవ్రమైన వాతావరణం అన్నది ఇప్పుడు చాలా సాధారణమైన విషయమైపోయింది. దీన్ని కనిపెట్టి, మార్చుకోవాలంటే మనకు భౌగోళిక ఉపకరణాలు చాలా అవసరం. – అజేంద్రకుమార్, ఎమ్.డి., ఎస్రివాతావరణ అస్థిరతలు పసిగట్టాలివాతావరణం, అభివృద్ధి అనేవి పరస్పర అవినాభావ సంబంధం ఉన్నవి. భారత్ సహా గ్లోబల్ సౌత్‌గా పిలిచే దేశాలన్నింటి ముందూ ఇప్పుడు ఒక సమస్య ఉంది. అదేంటంటే.. వాతావరణ అస్థిరతలను పసిగట్టి, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతూనే ప్రజల జీవన ప్రమాణాలనూ పెంచాలి. – అశ్వజిత్ సింగ్, వ్యవస్థాపకుడు, ఎమ్.డి., ఐపీఈ గ్లోబల్కోస్తా ప్రాంతాల్లోనే ఎక్కువభారతదేశం అంతటా వడగాడ్పులు వీచే రోజులు 2030, 2040 నాటికి గణనీయంగా పెరుగుతాయని అంచనా. ప్రాంతాల వారీగా వడగాడ్పు రోజుల సంఖ్యలో పెరుగుదల అంచనాలు.. -
ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 4.8, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 4.4, విజయనగరం జిల్లా గుల్లసీతారామపురంలో 4.0, నంద్యాల జిల్లా చౌతకూరులో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా తడలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది. నాగలాపురంలో 7.9 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా మాచర్లలో 7.1, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకచర్లలో 6.7, చిత్తూరు జిల్లా యాదమర్రిలో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తర కర్ణాటక దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో ద్రోణి పశ్చిమ–మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
దంచికొట్టిన వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): ఈశాన్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి బుధవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో 15.5 సెం.మీ. వర్షం కురిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10, గుడివాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయిలో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాతపూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకులలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ద్రోణి ప్రభావంతో మరో రెండు, మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
రాష్ట్రంలో నాలుగైదు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: వచ్చే నాలుగైదు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి పశి్చమ మధ్య బంగాళాఖాతం వరకు, ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్య ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా 11, 12 తేదీల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు కొన్నిచోట్ల ఉక్కపోతతోపాటు ఎండ ప్రభావం ఉంటుందని తెలిపింది. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 4.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 4.2, విశాఖ జిల్లా ఆనందపురంలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా వేమవరంలో 40 డిగ్రీలు, కొనకనమిట్లలో 39.9, తిరుపతి జిల్లా మంగ నెల్లూరు 39.9, వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. -
శ్రుతి తప్పిన రుతురాగం
రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ సీజన్లు పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మండు వేసవిలో భారీ వర్షాలు కురిసి వాతావరణం చల్లబడగా.. వర్షాల సీజన్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత నెలాఖరుకే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి అన్నిచోట్లకు విస్తరించినా.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో మందగించాయి. దీంతో వారం రోజులుగా రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్నాయి.విజయవాడ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం వంటి కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు వాస్తవ ఉష్ణోగ్రత కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. విజయవాడలో శనివారం 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. 44 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రభావం కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకూ వేడి వాతావరణం ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రోహిణీ కార్తె కావడంతో ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటోంది. 15 రోజుల క్రితం వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండాల్సిన సమయంలో భారీ వర్షాలు కురిశాయి. –సాక్షి, అమరావతిసీజన్లు ఇలా మారాయిసాధారణంగా మార్చి నుంచి మే నెలాఖరు వరకూ వేసవి సీజన్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ వర్షాకాలం ఉంటుంది. కానీ.. ఈ ఏడాది సీజన్లు తారుమారయ్యాయి. మే నెలలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. కర్నూలు, కడప, అనంతపురం, విజయవాడ, గుంటూరు, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వేసవి అంతా వర్షాకాలంలా మారిపోయింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా తొలకరి వర్షాలు కురవడం లేదు. ఎండలు తగ్గాల్సిన జూన్‌లో మండిపోతోంది. కోస్తా ప్రాంతాల్లో వీచే గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉండటంతో నమోదైన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. వాతావరణ మార్పులతో అస్థిరంగా రుతుపవనాలుగ్లోబల్ వారి్మంగ్ వల్ల వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు రుతుపవనాల సమయాన్ని, తీవ్రతను అస్థిరపరచడమే దీనికి కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు పెరగడంతో తేమ స్థాయిలు పెరుగుతూ వర్షాలను అస్థిరపరుస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల అకాల వర్షాలకు కారణమవుతుండగా.. వేడి గాలులు, తక్కువ వాయు ప్రవాహం ఎండల తీవ్రతను పెంచుతున్నట్టు చెబుతున్నారు.జూన్ నెలాఖరు వరకు ఎండలుముందుగానే వచ్చిన రుతు పవనాలు ప్రస్తుతం మందగించాయి. నాలుగు రోజులుగా వాటిలో ఎలాంటి కదలిక లేదని వాతావరణ శాఖ తెలిపింది. వాటిని బలపరిచే ఉపరితల ఆవర్తనాలు లేకపోవడంతో స్థిరంగా ఉన్నచోటే ఉండిపోయాయి. జూన్ 15 తర్వాత కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఏదైనా జూన్ మధ్య నుంచి జూన్ చివరి వారం వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. జూలై మొదటి వారం నుంచి వర్షాలు స్థిరంగా కురిసే అవకాశం ఉందని.. అప్పటివరకూ ఎండల తీవ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
గ్రీష్మవర్షం
‘దేవుడికేం హాయిగ ఉన్నాడూ, మానవుడే బాధలు పడుతున్నాడూ’ అంటాడో సినీకవి. అనాదిగా జరుగుతున్నదీ, మనం అంతగా గమనించనిదీ ఏమిటంటే, ఈ చరాచర జగత్తు మొత్తానికి మనిషి తనే కేంద్రస్థానమనుకుంటాడు; ఈ విశ్వరచన అంతా తన కోసమేననీ, తనే సృష్టిచక్రం తిప్పు తున్నాననే భ్రమలోకి జారిపోతూ ఉంటాడు, తన బాధ ప్రపంచ బాధగా ఊహించుకుంటాడు. నిజానికి మనిషే కాదు, ప్రతి జంతువూ, చెట్టూ, పిట్టా కూడా అలాగే అనుకుంటాయేమో కూడా!కానీ కొంచెం సూక్ష్మంగా యోచిస్తే, దేవుడూ, లేదా ప్రకృతీ కూడా అంత హాయిగా ఏమీలేనట్టూ, తమవైన బాధలను, సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నట్టూ అర్థమవుతుంది. మనం దేవతగా భావించే భూమినే తీసుకుంటే, తన వందల కోట్ల సంవత్సరాల ఉనికిలో అదెన్ని బాధలు పడిందో, ఎన్నెన్ని అస్తిత్వ సమస్యల నెదుర్కొందో, ఎంతటి అస్థిరత్వానికి, అనిశ్చితికి గురైందో భూభౌతిక విజ్ఞానం మనకెంతో కొంత అవగాహన కలిగిస్తూనే ఉంది. మొదట భూమి మొత్తం మండిపోయే ఓ అగ్నిగోళం. క్రమంగా ఉపరితలం చల్లబడుతూ వచ్చింది. అయినా ఇప్పటికీ లోపల, తాపమానం మీద వందల, వేల డిగ్రీల మేరకు సెగలూ, పొగలూ కక్కుతూనే ఉందంటారు. ఆ పైన లక్షల సంవత్సరాల నిడివిగల మంచుయుగాలు, జలప్రళయాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, అంతర్గత ప్రకంపనాలతో అతలాకుతలమవుతూనే వచ్చింది. అప్పుడు తను కూడా మనిషిలానే, తనకన్నా పైన ఉన్న ఏ తీవ్రశక్తినో ఉద్దేశించి, ‘దేవుడికేం హాయిగ ఉన్నా’డని పాడుకునే ఉంటుందేమో! మరీముఖ్యంగా తన ప్రకృతి గమనానికి సంబంధించి భూమి తనదైన ఓ ఋతుభ్రమణాన్ని నిర్దేశించుకుని అదే స్థిరమూ, శాశ్వతమూ అని కూడా భ్రమిస్తూ ఉండచ్చు. ఇక్కడే మనిషికీ, భూమికీ మరో పోలిక. మనిషి కూడా తనదైన ఓ ఋతుచక్రాన్ని కల్పించుకుని, దానినో కాలచక్రంలో బంధించాననుకుంటాడు. తను కోరుకున్నట్టే అవి తిరుగుతూ ఉంటాయనుకుంటాడు. కానీ, తన పైనున్న శక్తులు తను నిర్దేశించుకున్న ఋతుభ్రమణాన్ని తలకిందులు చేయగలవన్న ఎరుక భూమికి తరచు తప్పినట్టే, ప్రకృతి తన ఋతుచక్రాన్ని వెనక్కి తిప్పగలదన్న ఎరుక మనిషికీ తప్పుతుంది. అసలు ప్రకృతీ, తనూ అనుసరించే ఋతుకాల సూచికలు ఒకటే కావాల్సిన అవసరం లేదన్న గ్రహింపూ మనిషికి లోపిస్తూ ఉంటుంది. ఇంతకీ సంగతేమిటంటే, ఈ ఏడాది దేశంలోని పలు ప్రాంతాలు గ్రీష్మతాపాన్ని చవిచూడకుండానే వర్షర్తువు చొరబడిపోయింది. ఆ విధంగా గ్రీష్మానికి, వర్షర్తువుకు మనం నిర్దేశించుకున్న కాలిక మైన హద్దుల్ని ప్రకృతి మరోసారి చెరిపేసింది. దాంతో వాతావరణ, పర్యావరణ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగిపోయి వర్షపాతానికి సంబంధించిన చారిత్రకమైన గణాంకాలు, ఇతర వివరాల కవిలె కట్టల్ని బయటికి తీసి శోధించడం ప్రారంభించారు. కేరళనే తీసుకుంటే, నైరుతి ఋతుపవనాలు 1975, 1990 తర్వాత మళ్ళీ ఇప్పుడే అక్కడికి వారం రోజుల ముందు అడుగుపెట్టాయంటున్నారు. దేశం ఇతర ప్రాంతాలలో ఇలా జరగడం 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడేనంటున్నారు. ఆ పైన ఈసారి కేరళతోపాటు, తమిళనాడులోనూ, కర్ణాటక, మహారాష్ట్రలలోని అత్యధిక ప్రాంతాలలోనూ నైరుతి ఋతుపవనాలు మామూలు గడువుకన్నా ముందు రావడమే కాకుండా; ఒకే రోజున ఒకేసారి పెద్ద ఎత్తున ముంచెత్తడాన్ని విశేషంగా చూపుతూ, ఇలా జరగడం 1971 తర్వాత ఇదే మొదటిసారి అంటున్నారు. మళ్ళీ ఇంకోవైపునుంచి చూస్తే, 1970లనుంచీ ఒక పద్ధతి ప్రకారం ఋతుపవనాల రాకలో ఆలస్యం జరుగుతోందంటున్నారు. మొత్తంమీద సంవత్సరాల వారీగా వర్షర్తువు చరిత్రనైతే నమోదు చేయగలుగుతున్నా, అది ఒక్కోసారి గడువు కన్నాముందే ఎందుకు తొలకరించి పలక రిస్తుందో, ఒక్కోసారి ఎందుకు వేళతప్పిన అతిథి అవుతుందో ఇప్పటికీ కారణాలు అంతుబట్టక శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అలాగని వాతావరణ, పర్యావరణ రంగాల్లో వైజ్ఞానికంగా మనం వేసిన అంగలు చిన్నవేమీ కావు. వర్షాలు ఎందుకు పడతాయో, ఎందుకు పడవో మనకిప్పుడు బాగా తెలుసు. నేలమీది శీతోష్ణాలు, సముద్రాలమీది శీతోష్ణాలు చెట్టపట్టాలు వేసుకుని విడతలవారీగా అల్పపీడనాలను సృష్టిస్తూ వర్షపాతానికి ఎలా కారణమవుతాయో; మారిషస్, మడగాస్కర్ల సమీపంలో పుట్టుకొచ్చే సోమాలీ నిమ్నవాయువులూ, పసిఫిక్ గాలులూ అరేబియా సముద్రం, బంగాళాఖాతాల దాకా వ్యాపించి మన గడ్డమీద వర్షాలకు, లేదా వర్షాభావాలకూ కూడా ఎలా దోహదం చేస్తాయో, ప్రత్యేకించి హిమాలయాలు మన దగ్గర వర్షసామ్రాజ్యాన్ని ఎలా శాసిస్తున్నాయో మనకిప్పుడు మరింత స్పష్టంగా తెలుసు. అసాధారణ ఉపరితల ఉష్ణోగ్రతలను సంకేతించే ‘ఎల్ నినో’, అంతే అసాధారణ శీతలత్వాన్ని సూచించే ‘లా నినా’ అనే వాతావరణ ధోరణులకూ – వర్షాల రాకడకూ, పోకడకూ, ఇతర పరిణామాలకూ ఉన్న సంబంధం గురించిన అవగాహన కూడా మనకుంది. అయినాసరే, గడువుకు ముందే వర్షాలు, వర్షాభావాలూ, వర్షాలస్యాల వెనుక ప్రకృతి అనుసరించే సూత్రబద్ధత ఏమిటో ఇప్పటికీ అంతుబట్టని బ్రహ్మపదార్థంగానే ఉంది. మనకు సరే, ప్రకృతికి మాత్రం అది అంతుబట్టిందా అన్నది అంతిమ ప్రశ్న. అదలా ఉంచితే, ముందుస్తు వర్షాలు రేపటి ఆశల విరిజల్లులను తలపించి సంతోషభరితం చేస్తాయి కానీ, దురదృష్టవశాత్తూ ప్రతిసారి అవి వర్షపుష్కలత్వానికి హామీ ఇవ్వకపోవచ్చని శాస్త్రవేత్తలు పెదవి విరుస్తున్నారు. వారి భయాలు నిజం కాకూడదని మనసారా కోరుకుందాం. -
నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. బుధవారం రాత్రికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తంగానూ, మహారాష్ట్ర, తెలంగాణలో చాలా భాగాలు, చత్తీస్ఘఢ్, ఒడిశాల్లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఇది గురువారం మధ్యాహ్నానికి ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.అల్లూరి, పార్వతీపురం మన్యం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపారు. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40–50, గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంపై వర్షాల ప్రభావం జూన్ 1 వరకూ కొనసాగనుంది. అనంతరం క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఉంటుందనీ.. జూన్ 10 తర్వాత నుంచి వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
రాష్ట్రమంతా నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 26న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా... బుధవారం సాయంత్రానికి తెలంగాణ అంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో రాష్ట్ర భూభాగం అంతటా విస్తరించేవి. కానీ ఈసారి కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే విస్తరించడం గమనార్హం.ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించిన వాతావరణ శాఖ... ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ నెలలో విస్తారంగా వర్షాలు... కాగా, జూన్ నెలలో రుతుపవనాల గమనానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసింది. నైరుతి సీజన్లో జూన్ నెలలో రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఐఎండీ అంచనాల ప్రకారం జూన్ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని.. సగటున 111 శాతం వర్షపాతం నమోదు కావొచ్చని వివరించింది.గతేడాది జూన్ నెలలో 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణంకంటే 23 శాతం అధికంగా వర్షపాతం నమోదు కాగా... ఈసారి అంతకుమించి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో 4.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 3.0 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 2.75 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా గుండ్లపల్లెలో 2.28 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
వచ్చే నెలలో మంచి వర్షాలే
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించాయి. రోజురోజుకీ విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం తెలియజేసింది. దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 166.9 మిల్లీమీటర్లు కాగా, వచ్చే నెలలో అంతకంటే 108 శాతం అధిక వర్షం కురిసే పరిస్థితులు ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ చెప్పారు.దేశవ్యాప్తంగా సాధారణం నుంచి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈశాన్య, వాయవ్య, దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఈశాన్యం, వాయవ్య ప్రాంతాలు మినహా దేశమంతటా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగానే రికార్డు అవుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. సాధారణ వర్షపాతం 87 సెంటీమీటర్లు కాగా, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ దాకా 106 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే వీలుందని తెలిపారు.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్‌లో మంచి వర్షాలు కురుస్తాయని వివరించారు. పంజాబ్, హరియాణా, కేరళ, తమిళనాడుల్లో సాధారణ కంటే తక్కువ వర్షం పడుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో 2020లో 958 మిల్లీమీటర్లు, 2021లో 870, 2022లో 925, 2023లో 820, 2024లో 934.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. -
పలకరించిన తొలకరి
సాక్షి, హైదరాబాద్: వానాకాలం ప్రారంభాన్ని సూచిస్తూ రాష్ట్రంలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వారం ముందే పలకరించాయి. దీని ప్రభావంతో వివిధ జిల్లాల్లో తొలకరి జల్లులు కురిశాయి. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1.1 సెం.మీ. మేర సగటు వర్షపాతం నమోదైంది.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో అత్యధికంగా 5.98 సెం.మీ. వర్షం కురిసింది. అదే జిల్లాలోని షాబాద్ మండలం చందన్వెల్లిలో 5.68 సెం.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లాపల్లిలో 5.4 సెం.మీ., మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్‌లో 3.78 సెం.మీ., వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో 3.10 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. ఇప్పటికే అడపాదడపా వర్షాలతో రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్న వేళ రుతుపవనాలు ముందుగానే పలకరించడంతో వ్యవసాయ పనులను కూడా ముందస్తుగానే ప్రారంభించొచ్చని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి సాధారణం కంటే 10 శాతం అధిక వర్షాలు నైరుతి సీజన్లో నాలుగు నెలలపాటు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 73.86 సెంటీమీటర్లు. గతేడాది సీజన్లో 96.26 సెం.మీ. వర్షం (సాధారణ కంటే 30 శాతం అధికం) కురవగా ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కనీసం 10 శాతం అధికంగా వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనం.. ఆపై వానలు.. దక్షిణమధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. నైరుతి సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన మర్నాడే అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ, ఇంకొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. -
రాష్ట్రాన్ని తాకిన నైరుతి
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వీటి వేగాన్ని బట్టి మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు 16 ఏళ్ల తర్వాత ముందస్తుగా భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. సాధారణంగా ఇవి జూన్ ఒకటో తేదీన కేరళను తాకి, ఆ తర్వాత మూడు రోజుల్లో (జూన్ 4) ఏపీలోకి ప్రవేశిస్తాయి.ఒక్కోసారి కేరళను తాకిన తర్వాత కూడా వాతావరణ పరిస్థితులు మారడంతో ఏపీకి రావడానికి ఆలస్యమైన సందర్భాలున్నాయి. కానీ, ఈసారి మాత్రం పది రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. లానినో పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల గమనాన్ని బట్టి ఈ ఏడాది అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కూల్ సమ్మర్ వాతావరణంలో అనూహ్య మార్పులు, రుతుపవనాలు ముందస్తుగా పలకరించడంతో ఈ ఏడాది వేసవి ప్రభావం రాష్ట్రంలో పెద్దగా కనిపించలేదు. మామూలుగా మే నెలలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. రోహిణీ కార్తెలో ఎండతోపాటు ఉక్కపోతతో జనం అల్లాడిపోయేవారు. కానీ ఈ మే నెలలో అనిశి్చత వాతావరణం వల్ల ఎండతోపాటు వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ వేసవిలో ఎక్కడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాలేదు. ఆదివారం నుంచి రోహిణీ కార్తె మొదలైనా, ఎండల తీవ్రత మాత్రం లేకుండాపోయింది. రోళ్లు పగిలే రోహిణీ కార్తెలో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి.నేటి నుంచి వర్షాలు..ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. సోమవారం పలు ప్రాంతాల్లో వానలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాచపనుకులులో 56 మిల్లీమీటర్లు, విజయనగరంలో 42.7 మి.మీ, మారేడుమిల్లిలో 41.5 మి.మీ, గంపరాయిలో 34 మి.మీ, నెల్లిమర్లలో 33 మి.మీ, అన్నమయ్య జిల్లా ఎంగిలిబండ, కర్నూలు జిల్లా కామవరంలో 31.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
‘భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్’ నేడు ఆవిష్కరణ
న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితులు, వర్షాల విషయంలో మరింత కచ్చితత్వంతో సమాచారం అందించడానికి ఉద్దేశించిన ‘భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్’ను ప్రభుత్వం సోమవారం ఆవిష్కరించనుంది. పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇకపై స్థానికంగా వాతావరణ పరిస్థితులను కచ్చితత్వంతో వెల్లడించడానికి వీలవుతుందని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ తెలిపారు. బీఎఫ్ఎస్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జాతికి అంకితం ఇవ్వనున్నారు. -
రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, ఆదివారం నాటికి పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వివరించింది. అదేవిధంగా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, గోవా రాష్ట్రమంతటా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు, మిజోరం, మణిపూర్, నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 9.7 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు కూడా ఉషోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. -
కేరళ చేరిన నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. శనివారం ఉదయం కేరళ భూభాగంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నాయని, లక్షదీవులతో పాటు కేరళ రాష్ట్రంలోకి పూర్తిగా ప్రవేశించేందుకు అత్యంత తక్కువ సమయం పడుతుందని వివరించింది. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా రుతుపవనాలు తాకాయి. నైరుతి రుతుపవనాలు ముందుగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దేశమంతటా విస్తరిస్తాయి. ఈ సీజన్లో రుతుపవనాలు వాతావరణ శాఖ అంచనాల కంటే మూడురోజులు ముందుగానే భారత ప్రధాన భూభాగాన్ని తాకటం విశేషం. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 30న కేరళను తాకగా... ఈసారి ఆరు రోజుల ముందే ప్రవేశించాయి. రానున్న రెండురోజుల్లో రుతుపవనాలు మధ్య అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవాలో పూర్తి భూభాగం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతోపాటు సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కింలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈసారి వర్షాకాలంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మూడురోజుల్లో రాష్ట్రంలోకి.. రానున్న మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళను తాకిన తర్వాత సగటున నాలుగు నుంచి ఆరు రోజుల మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండడంతో మూడు రోజులలోపే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ 3వ తేదీన రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించగా... ఈసారి మే నెలలోనే ప్రవేశించడం గమనార్హం. 27న బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం రైతాంగంలో ఉత్సాహాన్ని నింపుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫానులపైనే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆరోజుకల్లా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఈ అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని, చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం రెండ్రోజుల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ముందస్తు అంచనాలు వెల్లడించాయి. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ – గోవా తీర ప్రాంతం సమీపంలో కొనసాగిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం శనివారం ఉదయం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో రత్నగిరికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. క్రమంగా తూర్పు దిశలో కదిలి శనివారం రాత్రికల్లా దక్షిణ కొంకణ్ తీరంలో రత్నగిరి, దాపోలి మధ్యలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి. -
రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: అరేబియా సముద్రంలోని దక్షిణ కొంకణ్–గోవా తీర ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడి శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. దీంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని, అదేవిధంగా జగిత్యాల, కామారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతా ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, రానున్న రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తగ్గిన ఉష్ణోగ్రతలు గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో అత్యధికంగా 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో అత్యధికంగా 20.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6–10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. -
నోటికాడి బువ్వ.. నీటిపాలు
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ/ మంచిర్యాల అగ్రికల్చర్/ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/ నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వివిధ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం బుధవారం కురిసిన వర్షానికి చాలా వరకు తడిచిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిచిపోవటంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిచిపోవడంతో మిల్లర్లు వాటిని తీసుకుంటారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిచిపోతోంది. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం 10 ఎల్ఎంటీ రాష్ట్రంలో ఇప్పటివరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారికంగా చెబుతోంది. అందులో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయగా, మిల్లులకు తరలించింది 54.33 ఎల్ఎంటీ మాత్రమే. అంటే ఇంకా సుమారు 6 ఎల్ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. ములుగు, మహబూబాబాద్, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో అక్కడక్కడ కోతలు ఆలస్యమైన నేపథ్యంలో మరో 5 ఎల్ఎంటీకి పైగా ధాన్యం రైతుల కల్లాల్లోనో, పొలాల్లోనో ఉంది. మొత్తంగా మరో 10 ఎల్ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, 17 శాతానికి తేమ తగ్గేవరకు ఆరబెట్టిన తరువాతే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, తేమ 20 శాతం ఉన్నా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి లేఖ రాసినట్లు సమాచారం. నీటిపాలైన ధాన్యం ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొత్తపేట, కట్టంగూర్, ఐటిపాముల, శాలిగౌరారం, గుడివాడ, తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, నూతనకల్ మండలాల్లో, భూదాన్ పోచంపల్లి, గూడూరు ప్యాక్స్ కేంద్రాల్లో ధాన్యం నీట మునిగింది. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టులో పిడుగుపాటకు రెండు ఆవులు మృతిచెందాయి. జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. అర్వపల్లి కేంద్రంలో ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురంలో పిడుగుపడి 10 గొర్రెలు, చివ్వెంల మండలం గంటోనిగూడెంలో 14 గొర్రెలు, కోదాడ మండలం నల్లబండగూడెంలో 38 మేకలు మృతిచెందాయి. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం, ఆజంనగర్, రాంపూర్, కమలాపూర్, గొల్ల బుద్ధారం, పాంబాపూర్, భీమ్ ఘనపూర్ గ్రామాల్లో ధాన్యం తడిచింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధనపల్లి గ్రామంలో ధాన్యం నీటిపాలైంది. ⇒ మహబూబ్‌నగర్‌లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటలకు వరకు, రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటలకు వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు కాలనీల్లో ఓపెన్ నాలాలు, డ్రెయినేజీలు పొంగిపొర్లటంతో. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంతో పాటు జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట, నవాబుపేటలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దేవరకద్ర, మిడ్జిల్, వెల్దండ ప్రాంతాల్లో వర్షాలకు ధాన్యం తడిచిపోయింది. ⇒ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి లక్ష మెట్రిక్ టన్నుల మేర నష్టం జరిగినట్లు సమాచారం. ⇒ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో బచ్చోడు కొనుగోలు కేంద్రంలో నిల్వధాన్యం తడిచిపోయింది. కరేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ⇒ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మార్కెట్ యార్డులో భారీగా ధాన్యం తడిచిపోయింది. ⇒ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దహెగాం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిచింది. పెంచికల్పేట్, కౌటాల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కొట్టుకుపోయాయి. ⇒ నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద, లోకేశ్వరం, కుంటాల, భైంసా రూరల్, ఖానాపూర్, మామడ తదితర మండలాల్లో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది. ⇒ భారీ వర్షాలకు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం, ఎస్ఎస్ తాడ్వాయి మధ్య రోడ్డుపై చెట్టు అడ్డుగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంతోపాటు ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. వరంగల్ జిల్లా నర్సంపేట, ఇల్లంద వ్యవసాయ మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ⇒ నిజామాబాద్ జిల్లాలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోపాల్ మండలం చిన్నాపూర్‌లో ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. ముదక్పల్లి, నర్సింగ్‌పల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మాక్లూర్ మండలంలో ఐదెకరాల బీర తోట ధ్వంసమైంది. పెర్కిట్, ఆర్మూర్, ఆలూర్ మండలంలో ఆరబోసిన వరిధాన్యం, సజ్జ పంట తడిశాయి. -
వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ రూరల్‌లో 7.5, కృష్ణా జిల్లా ఘంటశాలలో 7.1, కాకినాడలో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడ జిల్లా కరపలో 6.5 సెం.మీ వర్షం పడింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా కటికపల్లిలో 5.3 సెంటీమీటర్లు, కోనసీమ జిల్లా మండపేటలో 4.8, కాకినాడ జిల్లా ఆర్యావటంలో 4.6, మధ్యకొంపలులో 4.4 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది. 4, 5 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో నైరుతి రుతుపవనాలు 4, 5 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఏర్పడిందని పేర్కొంది. -
నేడు అండమాన్‌లోకి నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున మంగళవారం (13వ తేదీ) సాయంత్రానికి అండమాన్–నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అండమాన్–నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.ప్రస్తుతం అండమాన్–నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్‌లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుందని వెల్లడించింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడురోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వర్షాలు తెలంగాణలో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరాఠ్వాడా నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి బలహీన పడింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.ఖమ్మంలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.3 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. రానున్న రెండురోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. -
27న కేరళకు నైరుతి
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించనున్నాయి. సాధారణంగానే జూన్ ఒకటో తేదీన నైరుతి కేరళలోకి ప్రవేశిస్తాయి. అంతకంటే ముందుగా మే 27వ తేదీనే కేరళను తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం తెలిపింది. అదే జరిగితే 2009 తర్వాత మొదటిసారిగా రుతు పవనాలు మేలోనే వచ్చినట్లవుతుందని పేర్కొంది. 2009లో చాలా ముందుగా అంటే మే 23వ తేదీనే భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. సాధారణంగా జూలై 8వ తేదీకల్లా దేశం మొత్తానికి రుతుపవ నాలు వ్యాప్తి చెందుతాయి.తిరిగి సెప్టెంబరు 17వ తేదీన వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15కల్లా ముగుస్తుంది. గతేడాది మే 30న, అంతకు ముందు 2023లో జూన్ 8న కేరళను రుతుపవనాలు తాకాయి. అయితే, రుతు పవనాలు ప్రవేశించడానికి, ఈ సీజన్లో దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతానికి ఎటువంటి సంబంధం లేదని ఐఎండీ అధికారులు తెలిపారు.రుతుపవనాలు కేరళలోకి సాధారణం కంటే ముందుగా గానీ లేక ఆలస్యంగా గానీ తాకాయంటే దేశవ్యాప్తంగా అవి విస్తరిస్తాయని చెప్పలేమని అన్నారు. స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక పరిస్థితులపై రుతు పవనాల వైఖరి ఆధారపడి ఉంటుందని వివరించారు. 2025 రుతుపవన సీజన్లో మొత్తమ్మీద సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసింది. దేశంలో వ్యవసాయరంగానికి రుతుపవనాలే కీలకం. -
రెండ్రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకా శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తె లంగాణ ప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటు న 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వ ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరా ల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్ లో 40.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెద క్లో 22.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రా ష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. హనుమకొండలో గరిష్ట ఉష్ణో గ్రత సాధారణం కంటే 4.1 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. అలాగే భద్రాచలంలో 3.8 డిగ్రీల సెల్సి యస్ తక్కువగా నమోదు కాగా.. మిగిలిన ప్రాంతాల్లో 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా న మోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత చాలాచోట్ల సాధారణం కంటే తక్కువగా ఉంది. రానున్న 3 రోజులు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది.పిడుగుపాటుతో రైతు మృతి అశ్వారావుపేట రూరల్: పిడుగుపాటుతో ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లికి చెందిన సాధనం రాజారావు (42) శుక్రవారం సాయంత్రం తన బంధువుల పిల్లలతో కూరగాయల తోటకు వెళ్లాడు. కూరగాయలు కోస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పిల్లలు సాయిల తేజ, బాలుతో పాటు రాజారావు సమీపంలోని వేపచెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో రాజారావు మృతిచెందగా, కొంచెం దూరంలో ఉన్న తేజ, బాలు అస్వస్థతకు గురయ్యారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడైన మృతుడు రాజారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. -
చల్లని కబురు
సాక్షి, విశాఖపట్నం: దేశమంతా భానుడి భగభగలతో మండుతున్న వేళ భారత వాతావరణ శాఖ (ఐఎండీ)చల్లని కబురు అందించింది. ముందుగానే ఊహించినట్టు నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. మే 13న రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నట్టు ఐఎండీ ప్రకటించింది. 13 సాయంత్రం నాటికి అండమాన్ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి ప్రవేశించనుంది. సాధారణంగా రుతుపవనాలు మే 20 తర్వాతే అక్కడికి చేరుకుంటాయి. కానీ.. ఈసారి వాతావరణ పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉండటంతో వారం ముందుగానే ఆగ్నేయ బంగాళాఖాతానికి రాబోతున్నాయి. రుతుపవనాల రాకకు వాతావరణం కలిసొస్తే జూన్ మొదటి వారంలోనే కేరళని తాకే అవకాశం ఉంది. ఈసారి నైరుతి కాలంలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. ఈదురు గాలుల తీవ్రత కొనసాగుతుందని.. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని ఆంధ్ర ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ప్రాంతంలో ఎండలతోపాటు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో ఎండలు మండుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో41.3, కర్నూలు జిల్లా రేవూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. వర్షాలతోపాటు పిడుగులు పడుతుండడంతో ప్రజలు, వ్యవసాయ పనులు చేసుకునేవారు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 42.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. -
రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామా బాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యా పేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, వికా రాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగు ళాంబ గద్వాల, నారాయణ పేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.తగ్గిన ఉష్ణోగ్రతలు..: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు శనివారంతో పోలిస్తే ఆదివారం కాస్త తగ్గాయి. మెదక్‌లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
కాసింత నీడ.. కాస్తంత నీరు..!
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మేలో 47 వరకూ వెళ్లే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా. రాష్ట్ర ప్రభుత్వం వేసవిని ఎదుర్కొనేందుకు హెచ్చరికలు జారీ చేయడం తప్ప, క్షేత్ర స్థాయిలో తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు కనపడడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వేడిగాలులు పెరిగాయి. డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాష్టన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలకు ఇవి దారితీస్తాయి. ప్రభుత్వ తక్షణ దృష్టి అవశ్యం తీవ్ర ఉష్ణోగ్రతల నమోదు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచే దిశలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవాలి. భారత వాతావరణ శాఖ భాగస్వామ్యంతో జిల్లాల వారీగా హీట్ అలర్ట్స్ మరింత కచ్చితత్వంతో జారీ చేయాలి. అన్ని వర్గాలకు ఈ హెచ్చరికలు చేరేలా చూడాలి. బస్టాండ్లు, ఆటోస్టాండ్లు, రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి. కూల్ రూఫ్ బస్టాండ్లు, షెడ్లను శాశ్వతంగా నిర్మించడం మంచిది. ఆసుపత్రుల్లో హీట్ స్ట్రోక్ యూనిట్లు, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్, ఎమర్జెన్సీ బెడ్లు సిద్ధం చేయాలి. ఇక బడుల సమయాల్లో మార్పులు చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉండకుండా చూడాలి. బయట తరగతులు నిర్వహించకూడదు. హీట్ అలర్ట్ వచి్చనపుడు సెలవులు ప్రకటించాలి. ప్రజా రవాణా పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి.ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు» బయటకి వెళ్లే సమయాన్ని తగ్గించుకోవాలి. » మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. » తప్పనిసరిగా బయటకి వెళ్లాల్సివస్తే తలపై టోపీ, తెల్లని దుస్తులు ధరించాలి. » రోజుకు కనీసం 3–4 లీటర్ల వరకు నీటిని తాగాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం మంచిది. » ఆహార నియమాలు పాటించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వేడి ఆహారం, మసాలా పదార్థాలు, డ్రై ఫుడ్స్ తగ్గించి ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. » వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీరిని వేడి సమయాల్లో ఇంట్లోనే ఉంచాలి. తగినంత నీటిని తాగేలా చూడాలి. » వ్యాయామాలు ఉదయం, సాయంత్రం మాత్రమే చేయాలి » కూలీలు, రైతులు ఉదయం 6–10 లేదా సాయంత్రం 5–7 సమయంలో పని చేయాలి. » రోడ్లపై పనిచేసే ట్రాఫిక్ పోలీసులు, కూలీలకు జాకెట్లు, నీటి పంపిణీ జరగాలి. వడదెబ్బ తగలకుండా ఢిల్లీ తరహాలో కూల్ రూమ్ కాన్సెప్‌్టను ప్రవేశపెడితే మంచిది. » అడవుల్లో జంతువుల కోసం నీరు అందుబాటులో ఉంచాలి. హీట్ వేవ్ హాట్ స్పాట్లుకర్నూలు, నంద్యాల, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుఅన్ని చర్యలు తీసుకుంటున్నాంరోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీఈ సంవత్సరం వేసవి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి, తగిన చర్యలను సూచిస్తున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించడం మంచిది. కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు. -
మండుతున్న ఉష్ణోగ్రతలకు జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మే నాటికి 46–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సింగరేణి కాలరీస్‌తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వేసవికి అనుగుణంగా నడుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత.. తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల సమీపంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వడగాడ్పులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సింగరేణి కార్మికులతోపాటు రోజువారీ కూలీలు, రైతులు, చిరువ్యాపారులు, నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరగడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తత అవసరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరైతే గొడుగు, టోపీ, సన్‌్రస్కీన్ లేదా తడి గుడ్డ ఉపయోగించడం ద్వారా ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందాలని చెబుతున్నారు. టూవీలర్లపై వెళ్లే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వదులైన, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలంటున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ... వేసవిలో తాగిన నీరు తాగినట్టే చెమట రూపంలో వెళ్లిçపోతుంది. రోజుకు 3–4 లీటర్ల నీరు తాగడం శ్రేయస్కరం. దాహం లేకపోయినా గంటకోసారి నీటిని తాగుతూ ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఓఆర్ఎస్, ఉప్పు–చక్కెర కలిపిన నీరు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. కూల్‌డ్రింక్స్, బీర్లు, చికెన్, మాంసం తినడం వేసవిలో వేడిని ఇంకా పెంచుతాయి. రోజుకు 2–3 సార్లు కొబ్బరినీరు తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతౌల్యంగా ఉంటాయి. కాఫీ, టీ, ఆల్కహాల్ శరీరంలో నీటిని తగ్గిస్తాయి కాబట్టి వాటి బదులు హెర్బల్ టీ, తాజా పండ్ల రసాలు తాగడం మేలు. ఆహారం ముఖ్యం తేలికైన, నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, కీర దోస వంటివి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అధిక ఉప్పు, కారం, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఉడకబెట్టిన ఆహారం, సూప్‌లు, సలాడ్లు తీసుకోవాలి. గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వాళ్లు నీటిని అధికంగా సేవిస్తూ ఎండల్లో తిరగడం తగ్గించాల్సి ఉంటుంది.జాగ్రత్తలతోనే వేసవి నుంచి రక్షణ వేసవిలో శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీర ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు దాటినప్పుడు మెదడు వ్యాధులు, అవయవ వైఫల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను శరీరం బ్యాలెన్స్ చేసుకొనేలా వ్యవహరించాలి. ఆహార నియమాలు పాటించాలి. అధిక ఎక్సర్సైజ్లు తగ్గించాలి. – డాక్టర్ కిరణ్ మాదాల, ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఉస్మానియా కళాశాల -
నిప్పుల కొలిమి.. రికార్డు స్థాయిలో ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో చాలా ప్రాంతాలు భగభగమంటున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గత వారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఐదు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతు న్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్ర తలు తార స్థాయికి చేరాయి. మరోవైపు గాలిలో తేమ శాతం కూడా పెరగటంతో ఉక్క పోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. బుధవారం నిజామాబాద్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణో గ్రత మెదక్‌లో 24.3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్ర తలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డయ్యాయి. నిజామాబాద్‌లో 3.6, ఆదిలాబాద్‌లో 3.4, ఖమ్మంలో 3.1 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటిపూట జన సంచారం తగ్గింది. అత్యవసరమైతేనే ప్రజలు బయ టకు రావాలని, మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ప్రాంత జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతుండటంతో రాత్రిపూట కూడా వేడి తగ్గటంలేదు. -
రెండు రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య విదర్భ నుంచి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర– దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది క్రమంగా ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. 24 జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం తెలిపింది.జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మరింత పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.8 డిగ్రీ సెల్సియస్‌గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 43.5 25.2 భద్రాచలం 39.4 29.0 దుండిగల్ 38.7 27.2 హకీంపేట్ 38.5 27.5 హనుమకొండ 40.0 25.5 హైదరాబాద్ 38.8 26.5 ఖమ్మం 40.4 27.0 మహబూబ్‌నగర్ 40.0 30.1 మెదక్ 41.8 23.8 నల్లగొండ 40.0 24.4 నిజామాబాద్ 43.1 27.2 రామగుండం 41.4 26.2 -
ఉత్తరాంధ్రకు వడగాడ్పుల ప్రభావం
సాక్షి, విశాఖపట్నం: భానుడు రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం చూపనున్నాడు. ఆది, సోమవారాల్లో సాధారణం కంటే 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 20న 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 19 మండలాల్లో వడగాడ్పులు, 21న 10 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 12 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయన్నారు. తీవ్ర వడగాడ్పుల ప్రభావం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఉంటుందని తెలిపారు. 20వ తేదీన విజయనగరం జిల్లాలోని 10 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలోని 2 మండలాల్లో మాత్రమే ఆదివారం వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 21న మన్యం జిల్లాలో 10 మండలాల్లో తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వారం రోజులపాటు అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వారం రోజుల అనంతరం ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలున్నాయని తెలిపారు. -
చల్లటి కబురు!
భానుడు ఉగ్రరూపం దాల్చే ఏప్రిల్ నెలలోనే ప్రాణం కుదుటపడేలా జూన్‌లో ఆగమించే నైరుతి రుతుపవనాల తీరుతెన్నులు చెప్పడం మన వాతావరణ సంస్థలకు అలవాటు. ఈసారి భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించినదాన్నిబట్టి సాధారణ వర్షపాతంకన్నా అధికంగానే వానలు పడొచ్చు. అంతేకాదు... వర్షాభావానికి దారితీసి కరువు కాటకాలకు కారణమయ్యే ఎల్ నినో బెడద కూడా ఉండకపోవచ్చని కూడా ఆ విభాగం తెలియజేసింది. అయితే వాతావరణ స్థితి గతులను అంచనా వేసే మరో సంస్థ స్కైమెట్ మాత్రం ‘సాధారణ’ స్థాయిలోనే రుతుపవనాలుంటాయని చెబుతోంది. ఈ నెల మొదట్లోనే ఇందుకు సంబంధించిన లెక్కలు ప్రకటించి, సాధారణంకన్నా అధికంగా వర్షాలు పడే అవకాశం 30 శాతం మాత్రమే ఉన్నదని తెలిపింది. నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ 1న ప్రవేశించి చకచకా విస్తరించుకుంటూపోయి సెప్టెంబర్ మధ్య కల్లా నిష్క్రమిస్తాయి. దేశ జనాభాలో 42.3 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయం పూర్తిగా రుతుపవనాలపై ఆధారపడి వుంటుంది. అది సక్రమంగా వచ్చి వెళ్తే దేశం కళకళలాడుతుంది.మందగమనంతో అడుగులేస్తే, అంతంతమాత్రంగా ముగిసిపోతే అనేక సమస్యలకు దారితీస్తుంది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం వాటా 18.2 శాతం. అయితే ‘వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరికీ తెలియద’న్న నానుడి మరిచిపోకూడదు. వర్షపాతం బాగుంటుందన్నా, అది అధికంగా ఉండొచ్చని చెప్పినా దేశవ్యాప్తంగా అన్నిచోట్లా అదే మాదిరిగా ఉంటుందని ఆశించలేం. స్థానిక కాలమాన పరిస్థితులనుబట్టి కొన్నిచోట్ల అధిక వర్షపాతం, మరికొన్నిచోట్ల అవసరమైన దానికన్నా తక్కువగావుండొచ్చు. బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్ ఒక సందర్భంలో చెప్పినట్టు వాతావరణం అనేది ప్రభుత్వం వంటిది. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది!ఎక్కడో భూమధ్య రేఖకు ఆనుకునివున్న పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడివున్న వర్తమాన వాతావరణ పరిస్థితులు మన రుతుపవనాలను నిర్దేశిస్తాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై, ముఖ్యంగా దక్షిణమెరికా తీర ప్రాంతంవైపు ఉష్ణోగ్రతలు అధికంగావుంటే గాలిలో తేమ శాతం పెరిగి ఎల్ నినో ఏర్పడి రుతుపవనాలు బలహీనపడతాయి. వర్షాలు లేక కరువుకాటకాలు విజృంభిస్తాయి. ఆ ఉష్ణోగ్రతలు తక్కువుంటే లానినా ఏర్పడి కుంభవృష్టికి దారితీసి వరదల బెడదవుంటుంది. ప్రస్తు తానికి అక్కడ తటస్థ పరిస్థితులున్నాయంటున్నారు.ఒక్కోసారి మన హిందూ మహాసముద్రంపై ఆవరించివుండే మేఘాల స్థితిగతులు, ఆ వాతావరణంలోవుండే గాలి తుంపరలు, మనకుండే అటవీ సాంద్రత వంటివి ఎల్ నినోను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంవల్లనే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినా ఒక్కోసారి మన రుతుపవనాలు సజావుగా వచ్చివెళ్తాయి. అందుకే ఎల్ నినో గురించి పట్టించుకోవటం, రుతుపవనాలను ముందుగా అంచనా వేయటం అశాస్త్రీయం అంటారు కొందరు శాస్త్రవేత్తలు. ఎల్ నినోను నియంత్రించే ఇతరేతర పరిస్థితులు అనేకం ఉన్నప్పుడు దాని ఆధారంగా వర్షాల గురించి అంచనా వేయటం వృధా ప్రయాస అని వారి భావన. వర్షరుతువులో ఏటా వర్షపాత సగటు(ఎల్పీఏ) ఎంతవుంటున్నదో లెక్కేయటం ఐఎండీ పని. ఆ సగటు దీర్ఘకాలంలో ఎంతవుందో గణించి, దానికన్నా ఎంత ఎక్కువగా లేదా ఎంత తక్కువగా వర్షాలు పడే అవకాశం వుందో తెలియజేస్తారు. ఎల్‌పీఏను 87 సెంటీమీటర్ల వర్షపాతంగా గణించి, ఈసారి వర్షాలు దీన్నిమించి 105 శాతంవరకూ ఉండొచ్చని అంచనా కట్టారు. నిరుడు మొదట్లో 106 శాతం అధిక వర్షపాతం అంచనా వేయగా, అది 108 శాతం వరకూ పోయింది. ఎల్పీఏ 96 శాతంకన్నా తక్కువుంటే సాధారణంకన్నా తక్కువ వర్షపాతంగా లెక్కేస్తారు. 96–104 మధ్యవుంటే సాధా రణ వర్షపాతంగా, 104–110 శాతం మధ్యవుంటే అధిక వర్షపాతంగా పరిగణిస్తారు. ఐఎండీ 105 శాతంవరకూ ఉండొచ్చని అంచనా వేయగా, స్కైమెట్ మాత్రం 103 శాతానికి పరిమితమైంది. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతంవరకూ వర్షాధారమే. కనుక వర్షాలు సమృద్ధిగా పడితేనే మన సాగురంగం బాగుంటుంది. అందరికీ పనులు దొరికి సుఖసంతోషాలతో వుంటారు. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వర్షపాతం అంచనాలు సక్రమంగావుంటే ఎక్కడ ఎలాంటిపంటలు వేసుకోవచ్చునో, వేటికి అననుకూలతలు ఏర్పడవచ్చునో తెలుస్తుంది. రైతులు నష్టపో కూడదంటే ఇలాంటి అంచనాలు ఎంతో అవసరం. కానీ నిర్దుష్టంగా అంచనాలు చెప్పటం అన్ని వేళలా సాధ్యపడకపోవచ్చు. గతంతో పోలిస్తే వాతావరణ విభాగం అంచనాలు మెరుగ్గా ఉంటు న్నాయి. ఆ రంగంలో పెరిగిన సాంకేతికతలే అందుకు కారణం.వర్షాలు సాధారణంకన్నా ఎక్కువుంటాయని వేసిన అంచనాలు చూసి మురిసిపోలేం. ఎందుకంటే కురిసిన వర్షాన్నంతటినీ ఒడిసిపట్టి తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చుకునే మౌలిక సదుపాయాలు మనదగ్గరుండాలి. తొలకరినాటికల్లా సాగుపనుల కోసం రైతులకు డబ్బు అందు బాటులో వుండాలి. సకాలంలో నాట్లు పడకపోతే పైరు ఎదుగుదల బాగుండదు. భిన్న దశల్లో ఎరువులూ, పురుగుమందులూ దొరకాలి. అన్నిటికన్నా ముందు విత్తనాల లభ్యత సక్రమంగావుండాలి. కల్తీ విత్తనాల బెడద నిరోధించాలి. వీటికోసం ఎలాంటి ముందస్తు చర్యలు అమలు కావాలో, రైతులకు బ్యాంకుల నుంచి రుణసదుపాయాలెలా కల్పించాలో ప్రభుత్వాలు ఆలోచించాలి. రుతుపవనాలు సక్రమంగా ఉండబోతున్నాయని ఐఎండీ ప్రకటించింది కనుక ఇప్పటినుంచే పకడ్బందీ ప్రణాళికలు రూపుదిద్దుకోవాలి. -
ఎండలు మండుతాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది.కోస్తా ఆంధ్ర తీరం, యానాం పరిసరాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని జిల్లాల్లో వడగాలులు వీచేఅవకాశం ఉందని తెలిపారు. -
అకాల వర్షాన్ని ఒడిసిపడితే.. బోరులోనూ జలహోరు!
తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు నోరెళ్ల బెడుతున్నాయి. పంటలు, తోటలు కళ్లు తేలేస్తున్నాయి. మరో మూడు నెలలు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతూనే ఉంది. ఈ కష్టకాలంలో అడపాదడపా పలకరించే అకాల వర్షాలు రైతులకు కొంత మేరకు ఉపశమనం కలిగిస్తున్నాయి. రెండు రోజులు గడిస్తే నీటికష్టాలు షరా మామూలే. అయితే, ఈ అకాల వర్షపు నీటిని పొలాల్లో ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎండిపోయిన /ఎండిపోతున్న బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు కట్టుకుంటే ఆ బోర్లు ఎండిపోకుండా ఉంటాయి. అవి తిరిగి జలకళను సంతరించుకుంటాయి. వర్షం కురిసిన రోజే ఆ బోర్లలో అప్పటికప్పుడే నీటిలభ్యత పెరుగుతుందని సీనియర్ హైడ్రాలజిస్ట్, సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాటర్ అండ్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్వి.రాంమోహన్అనుభవపూర్వకంగా చెబుతున్నారు. పన్నెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వేలాది బోర్లను రీచార్జ్ చేసిన అనుభవంతో ఆయన ‘సాక్షి సాగుబడి’కి అనేక విషయాలు చెప్పారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏమిటి?గ్రామీణ ప్రాంతాల్లో వేలాది వ్యవసాయబోర్లు ఎండిపోయి ఉన్నాయి. కొన్నిచోట్ల తక్కువ నీటిని పో స్తూ ఉన్నాయి. కొత్త బోర్లు తవ్వకుండా ఇప్పటికే ఉన్న ఎండిపోయిన లేదా ఎండిపోతున్న బోరుబా వుల చుట్టూ వాననీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించాలి. తద్వారా చిన్న, సన్నకారు రైతులకు అందుబా టు ఖర్చుతోనే నీటి భద్రత కల్పించొచ్చు. ఎప్పుడు? బోరు లోపలికి ట్యాంకర్‌తో తెచి్చన నీటిని పోసి.. దానికి వాననీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం ఉందో లేదో టెస్ట్ చేయాలి. దీన్నే ట్యాంకర్ టెస్ట్ అంటారు. కేవలం కొన్ని వందల రూపాయల ఖర్చుతో రైతులు సొంతంగా తమ బోరుబావులను పరీక్షించుకోవచ్చు. వానాకాలం ప్రారంభం కాక ముందు ఫిబ్రవరి–మే నెలల మధ్య రోజులు ఇందుకు అనువైన కాలం. ఎక్కడ?కొన్ని పొలాల్లో ఒకటి కన్నా ఎక్కువ బోర్లు ఉండొచ్చు. అలాంటప్పుడు అన్ని బోర్లకు ‘ట్యాంకరు టెస్ట్’చేయాలి. వాటి వాస్తవిక రీచార్జ్ సామర్థ్యం ఎంత అనేది కచ్చితంగా తెలుస్తుంది. లోతు తక్కువ ఉన్న బోరుబావిని రీచార్జ్ కోసం ఎంపిక చేసుకుంటే రీచార్జ్ కట్టడం ద్వారా ఆ పక్కనున్న ఇతర బోరుబావుల్లో కూడా నీరు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయిన ప్రతిసారీ కొత్త బోర్లు వేయటం ఆర్థికంగా కష్టంతో కూడుకున్న పని. అందుకని బోరుబావులకే వాననీటిని తాపే పనిచేయడం ఉత్తమం. ఇందుకోసం బోరుబావుల చుట్టూ వాన నీటి రీచార్జ్ కట్టడాలు నిర్మించుకోవాలి. ఇవి దీర్ఘకాలం (కనీసం 8–10 ఏళ్లు) పాటు రైతులకు ప్రయోజనాలు అందించగలుగుతాయి. బోరు రీచార్జ్ సాంకేతికతను ఉపయోగించి, రెండు వానాకాలపు సీజన్లలోనే ఎండిపోయిన బోరు బావులను పునరుద్ధరించుకోవచ్చు. ఎలా? బోరు రీచార్జ్ నిర్మాణానికి స్థానికంగా దొరికే రాళ్లు, ఇసుక, సిమెంట్ వంటి సామగ్రిని వాడుకొని 7–10 రోజుల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు. కొత్తగా బోరుబావి తవ్వడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. తక్కువ ఖర్చులోనే ఎండిన బోరుబావులను పునరుద్ధరించొచ్చు. కొత్తగా తవ్వే బోరు పడకపోతే ఆ ఖర్చు అంతా వ్యర్థమే. ఎగువన ఉండే నీటి పరీవాహక ప్రాంతాల నుంచి సంగ్రహించే వాననీటిలో గరిష్టంగా 50% నీరు రీచార్జ్ అవుతుంది (చెక్‌డ్యాం, నీటికుంటల ద్వారా 10–15% నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతుంది). ఈ పద్ధతిలో వాననీటిని రీచార్జ్ చేస్తూనే ఆ బోరుబావి నుంచి నీటిని పంటలకు వాడుకునే వెసులుబాటు ఉంది. ఎవరు?బోరుబావి ద్వారా వాననీటిని నేలలోకి ఇంకించి భూగర్భ నీటిని మరింతగా రీచార్జ్ చేసే సాంకేతిక ప్రక్రియలో ఆర్వి.రాంమోహన్ది అందెవేసిన చేయి. 2012 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నీటి కష్టాలకు పరిష్కారంగా బోరుబావుల చుట్టూ రాళ్లు రప్పలు, గులక రాళ్లు, ఇసుకతో ఇంకుడు గుంతలు నిర్మించుకోవటంలో రైతులకు, పట్టణవాసులకు చేదోడుగా ఉంటున్నారు. ఇప్పటికి వెయ్యి బోర్ల రీచార్జ్‌కు ఇంకుడుగుంతలను నిర్మించటంలో ప్రత్యక్షంగా తోడ్పాటునందించారు. మరో మూడు, నాలుగు వేల బోరు రీచార్జ్ పిట్ల నిర్మాణానికి పరోక్షంగా సాంకేతికతంగా సాయపడ్డారు. ఈ క్రమంలో రైతుల అభిప్రాయాలు, సలహాలు సూచనల మేరకు ఈ సాంకేతికతలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేశారు. ఈ అనుభవ జ్ఞానంతో ‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోరుబావుల పునరుద్ధరణ (అక్విఫెర్ రీచార్జ్)’పేరిట శిక్షణ కరదీపికను ప్రచురించారు. -
రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ సమీప ప్రాంతం నుంచి ఈశాన్య తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కాగా, రాష్ట్రంలో రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. శనివారం ఖమ్మంలో గరిష్టంగా 41.8 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో కనిష్టంగా 22.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
అకాల వర్షం.. ఆగమాగం
సాక్షి, నెట్వర్క్: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పలు జిల్లాల్లో అకాలవర్షం కురిసింది. గురువారం గాలి దుమారంతో ప్రారంభమై.. ఓ మోస్తరు వర్షం కురిసింది. వడగండ్లతో రైతులకు కడగండ్లు మిగిలాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మూడుచోట్ల పిడుగులు పడి ముగ్గురు చనిపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసింది. వడగండ్ల వానకు మామిడి కాయలు నేలరాలాయి. వరి చేలు నేలకొరిగాయి. ఆత్మకూర్(ఎం)లో కరెంట్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి దుమారానికి పలుచోట్ల ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. గుండాలలో బండపై రైతులు ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఎడపల్లి మండలం బాపూనగర్‌లో వడగండ్లు పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులకు ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులతో వరితోపాటు మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా: పలు మండలాల్లో ఈదురుగాలులు, వర్షానికి ధాన్యం పొలాల్లోనే రాలిపోయింది. మొక్కజొన్న నేలవాలింది. గంభీరావుపేట మండలం గజసింగవరంలో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. వేములవాడ మండలం నాగాయపల్లి శివారులో గాలివానకు పడిపోయిన చెట్లను బ్లూ కోల్ట్స్ తొలగించారు. జనగామ జిల్లా: జనగామ వ్యవసాయ మార్కెట్లో 600 బస్తాల వరకు ధాన్యం తడిసిపోగా, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట దెబ్బతింది. గాలి దుమారంతో 11 కేవీ విద్యుత్ లైన్లపై చెట్లు విరిగి పడిపోవడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా నంగునూరు, చిన్నకోడూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకూలగా, పొలాల్లోనే గింజలు రాలడంతో వరి మొక్కకు పిలకలే మిగిలాయి. మొక్కజొన్న, మిర్చి, టమాట, కూరగాయ పంటలు నేలకొరిగాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా : దేవరకద్ర మార్కెట్లో వేలం వేసిన ధాన్యం కుప్పలు తడిపోయాయి. రైతులు కవర్లు కప్పినా.. అప్పటికే చాలా ధాన్యం తడిసి ముద్దయ్యిది. కొల్లాపూర్‌లో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. నిర్మల్ జిల్లా: పలు మండలాల్లో ఈదురు గాలులతోపాటు రాళ్ల వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన పంటలు నేలవాలాయి. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. మొక్కజొన్న తడిసి ముద్దయ్యింది.కల్లాల్లో అరబెట్టిన మక్కలు కొంత మేరకు తడిసిపోయాయి. రైతు ఆత్మహత్యాయత్నం ములుగు జిల్లా మొట్లగూడెం గ్రామానికి చెందిన యాలం నర్సింహారావు తనకున్న ఐదెకరాలతోపాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేశాడు. మరో మూడు రోజుల్లో వరి పంట కోయాల్సి ఉండగా.. ఈనెల 7న సాయంత్రం వడగళ్ల వాన పడింది. దీంతో వరి చేనులో గింజకూడా లేకుండా రాలిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. అప్పులు తీర్చే మార్గం లేక నర్సింహారావు బుధవారం రాత్రి తన ఇంటికి సమీపాన ఉన్న పొలం వద్దకు పురుగుల మందుతాగాడు. ఉదయాన్నే స్థానికులు గుర్తించి ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్‌రెడ్డి ఆకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు వివిధ జిల్లాల్లో కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. ముగ్గురి ప్రాణం తీసిన పిడుగులు వేర్వేరు జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన రైతు మందాడి రవీందర్‌రెడ్డి(55) రోజు మాదిరిగానే గురువారం గేదెలను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు సంకీర్తరెడ్డి వ్యవసాయబావి వద్దకు వెళ్లి చూడగా విగతజీవుడై పడి ఉన్నాడు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో పిడుగు పడిందని, దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు. – సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారాం గ్రామానికి చెందిన సంపత్‌కుమార్ అలియాస్ సతీశ్(19), జశ్వంత్, కార్తీక్‌లు సదాశివపేట మండల పరిధిలోని గొల్లగూడెంలోన ఓ కాలేజీలో ఐటీఐ చదువుతున్నారు. క్లాస్‌లు ముగిశాక ఒకేపై ముగ్గురూ స్వగ్రామానికి బయలు దేరారు. వర్షం ఎక్కువ కావడంతో సిద్దాపూర్–గొల్లగూడెం శివారులోని మైసమ్మ కట్ట వద్ద బైక్‌ను నిలిపి సంపత్‌కుమార్, జశ్వంత్ చింత చెట్టు కింద నిల్చున్నారు. కార్తీక్ మరో చెట్టు కింద నిలబడ్డాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడి సంపత్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, జశ్వంత్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. – నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మేకల రాములు(55) గ్రామ సమీపంలో తన గొర్రెలను మేపుతుండగా.. అకస్మాత్తుగా గాలి దుమారంతో వర్షం కురిసింది. రాములు పక్కనే పిడుగుపడడంతోఅక్కడికక్కడే మృతిచెందగా ఆయన కుమారుడు నరసింహకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలేరు మండలం మంతపురిలో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర వాయవ్య దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉత్తర, ఈశాన్య దిశగా తిరిగి దిశ మార్చుకుని మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో పలుచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎగసిపడుతున్నసముద్ర కెరటాలుబంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మంగళవారం సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలజడి నెలకొనడంతో మత్స్యకారుల వేట సాగలేదు. రెండు రోజులుగా అలల ఉధృతి మారుతోంది. దాదాపు ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. తిరుపతి జిల్లా, గూడూరు నియోజకవర్గం, తూపిలిపాళెం, కొండూరుపాళెం, అంజలాపురం, శ్రీనివాసపురం, ఓడపాళెం, మొనపాళెం, వైట్‌కుప్పం, పూడికుప్పం, నవాబుపేట, పూడిరాయిదొరువు సముద్రం ఒడ్డున మత్స్యకారులు తమ బోట్లను లంగరు వేశారు. – వాకాడు -
వాతావరణం చల్లబడింది
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/చింతలపూడి: నెల రోజులుగా భానుడి భగభగలతో ఉడికిపోతున్న రాష్ట్రం.. ఉపరితల ద్రోణుల ప్రభావంతో చల్లబడింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో.. ప్రజలు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందారు. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తులో ఉంది. అదేవిధంగా.. ఉత్తర తమిళనాడు, కర్ణాటక మీదుగా ఉత్తర దక్షిణ ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వానలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. గంటకు 30–40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. రాగల నాలుగు రోజుల్లో సాధారణం కంటే 2–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. అన్నదాతకు అపార నష్టం..మరోవైపు.. గడిచిన రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. వైఎస్సార్, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల, అనకాపల్లి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. దాదాపు 8,770 ఎకరాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడు జిల్లాల్లో 7,078 ఎకరాల్లో వరి, మొక్క జొన్న, మినుము, అలసందలు, సజ్జలు, తదితర పంటలు దెబ్బతినగా, తొమ్మిది జిల్లాల్లో 1,692 ఎకరాల్లో అరటి, బొప్పాయి, బత్తాయి, కూరగాయలు వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఇప్పటివరకు తేల్చారు. ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే 1,200 ఎకరాల్లో అరటి పంట నేలవాలిపోయింది. ఈదురుగాలుల ప్రభావానికి కోతకు సిద్ధంగా ఉన్న మామిడి తోటల్లో వేలాది టన్నుల మామిడి కాయలు నేలరాలిపోయినట్లు రైతులు వాపోతున్నారు. అమ్మకానికి సిద్ధంచేసిన పొగాకు తడిసి ముద్దయింది. వ్యవసాయ పంటల పరంగా ఇవన్నీ ప్రాథమికంగా అంచనాలు మాత్రమే. ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక ఏలూరు జిల్లాలోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో అనేక ప్రాంతాల్లో రేకుల షెడ్లు దెబ్బతినగా.. చెట్లు పడిపోయాయి. చింతలపూడి మండలం సుప్రీంపేటలో ఈదురుగాలులకు చెట్టు విరిగి ఇంటిపై పడడంతో ఇంట్లో ఉన్నవారికి గాయాలయ్యాయి. మామిడితోటల్లో కాయలు రాలిపోయాయి. చాలాచోట్ల వైర్లు ఊడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొయ్యలగూడెంలోనూ పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. -
ముంచెత్తిన వాన.. చెరువులను తలపించిన రోడ్లు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఉపరితల చక్రవాత ఆవర్తనంతో రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై క్రమంగా జల్లులతో మొదలైన వాన... ఆ తర్వాత తీవ్రరూపం దాల్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతమే నమోదైంది. మధ్యాహ్నం తర్వాత చినుకులుగా మొదలై.. పలు ప్రాంతాల్లో కుండపోతగా మారింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆ తర్వాత నాలాలు పొంగడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. కీలక రద్దీ సమయంలో భారీ వర్షం కురవడం... రోడ్లు జలమయం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓల్డ్‌బోయిన్‌పల్లి–న్యూ బోయిన్పల్లి మార్గంలో మోకాలిలోతు వరద చేరడంతో రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తుమ్మలబస్తీలోని బల్కాపూర్ నాలాలోని వ్యర్థాలు తీస్తున్న జేసీబీ పూర్తిగా మునిగిపోయింది. సమతానగర్‌లో ఇళ్ల ముందు పార్కు చేసిన కార్లు, బైక్‌లు నీట మునిగాయి. ⇒ రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో గంటల వ్యవధిలోనే జోరుగా పడింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన కూడా పడింది. ⇒ రాష్ట్ర ప్రణాళిక శాఖ గురువారం రాత్రి 8 గంటల నివేదిక ఆధారంగా రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌లో 9.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లా హిమాయత్‌నగర్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో 9.10 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తగ్గిన ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీ సెల్సియస్ మేర తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే...ఆదిలాబాద్‌లోనే 39.8 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత కూడా 21.7 డిగ్రీ సెల్సియస్‌గా ఆదిలాబాద్‌లోనే నమోదైంది. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదవుతాయని, శనివారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పింది. పిడుగుపాటుకు నలుగురు మృతి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి నలుగురు మృత్యువాత పడ్డారు. ⇒ నాగర్‌కర్నూల్ జిల్లా పదర శివారులో వ్యవసాయ పనులకు మహిళా కూలీలు వెళ్లారు. వారికి సమీపంలో పిడుగు పడడంతో సుంకరి సైదమ్మ(45) గాజుల వీరమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందారు. సుంకరి లక్ష్మమ్మకు తీవ్ర గాయాలుకాగా, అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ⇒ గద్వాల జిల్లా చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(41) పొలం వద్ద పశువులు మేపుతుండగా.. పిడుగు పడి మృతి చెందాడు. వడ్డేపల్లి మండలంలోని బుడమర్సకు చెందిన మహేంద్ర(21) తుంగభద్ర తీరంలో గేదెలు మేపుతుండగా.. పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ⇒ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని ఇశ్రితాబాద్ శివారులో వాన పడుతుండగా, బలరాం లచ్చయ్య జీవాలను చెట్టు కిందకు చేర్చాడు. ఒక్కసారిగా పిడుగు పడడంతో 20 మేకలు మృత్యువాత పడ్డాయి. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో పిడుగు పడి ఆవు, దూడ, కొడంగల్‌లో 25 మేకలు చనిపోయాయి. యాదాద్రి జిల్లా రాజాపేట, వలిగొండ మండలాల్లో పిడుగుపాటుకు ఆవు, పాడి గేదెలు మృతి చెందాయి. ఈ మినార్ పెచ్చులూడటం రెండోసారి.. చారిత్రక కట్టడమైన చార్మినార్ పైభాగం నుంచి పెచ్చులూడి పడ్డాయి. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్న మినార్ నుంచి మట్టి పెచ్చులూడడంతో అక్కడే ఉన్న పర్యాటకులు, వ్యాపారస్తులు పరుగులు తీశారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పెచ్చులు ఊడి పడడంతో పిడుగు పడిందనుకున్నామని చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయ పూజారి సచిన్ తెలిపారు. గతంలో కూడా ఈ మినార్ నుంచి పెచ్చులూడడంతో ఆర్కియాలజీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. అకాల వర్షం...రైతులు ఆగమాగం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో చేతికొచి్చన మామిడి కాయలు, ధాన్యం నేలరాలింది. మోత్కూరులోని వ్యవసాయ మార్కెట్లో, గుండాలలో బండపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. గద్వాల జిల్లా గట్టు మండంలో ఆర బెట్టిన పొగాకు వానకు తడిసింది. ⇒ నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మెండోరా, ముప్కాల్, వర్ని మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. మెండోరా, ముప్కాల్ మండలాల పరిధిలో కల్లాల్లో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దయింది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం, మక్కలు తడిసి పోయాయి. కామారెడ్డి జిల్లాలోని పెద్దకొడప్గల్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, నిజాంసాగర్, బాన్సువాడ, రామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి తదితర మండలాల్లోని కొన్ని చోట్ల రాళ్ల వర్షం కురిíసి వడ్లు నేలరాలాయి. ఈదురుగాలులతో మక్క నేలవాలింది. ⇒ మహబూబాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్లో బయట ఉంచిన మిర్చి బస్తాలు వర్షానికి తడిసిముద్దయ్యాయి. రెండు గంటలపాటు వర్షం కురవడంతో రైతులు పడరాని పాట్లు పడ్డారు. -
ఎండల నుంచి 2 రోజులు ఉపశమనం
సాక్షి, విశాఖపట్నం: ఎండ, ఉక్కపోతతో ఠారెత్తిపోతున్న రాష్ట్రానికి రెండు రోజులు ఉపశమనం లభించనుంది. శని, ఆది వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి వానలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు రోజుల అనంతరం.. మళ్లీ పొడి వాతావరణం ఏర్పడి, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
ఉడుకుతున్న తెలంగాణ
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఏకంగా 25 జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమురంభీం జిల్లా వంకులంలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ పిప్పల్దరి, ములుగు జిల్లా ఘనపూర్, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో 41.2, నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 41.1, నిర్మల్ జిల్లా కుబీర్‌లో 41, నల్లగొండ జిల్లా పడ్మట్‌పల్లిలో 40.9, వనపర్తి జిల్లా కనాయపల్లిలో 40.8, భద్రాచలంలో 40.7 డిగ్రీలు, హైదరాబాద్ మెట్టుగూడలోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 1 నుండి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాత్రి వేళల ఉష్ణోగ్రతలు సైతం తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లోనూ చలి తగ్గలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 19.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. -
పెరుగుతున్న ఎండల తీవ్రత
సాక్షి, అమరావతి: వేసవి తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటోంది. నిన్నటి వరకు రెండు, మూడు చోట్ల మాత్రమే 40 డిగ్రీలు దాటిన ఎండ.. గురువారం చాలా మండలాల్లో 40 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో 42.1 డిగ్రీలు నమోదైంది. ఇవి సాధారణంకంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండో వారానికల్లా మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గాలిలో తేమ శాతం ఎక్కువగానే ఉండడం వల్ల ఉక్కపోత ఉండడంలేదు. అయితే ఎలినినో పరిస్థితుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మున్ముందు ఎండ, వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అప్పుడే భగభగలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి రెండో వారంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈసారి వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. వాస్తవానికి మార్చి మొదటి వారం నుంచి వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ క్రమంలో మార్చిలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. కానీ గత రెండ్రోజుల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్‌లో సగటు ఉష్ణోగ్రతకన్నా 4.4 డిగ్రీలు అధికంగా, నిజామాబాద్‌లో 3.2, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మంలో 3 డిగ్రీలు అధికంగా నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డు అయింది. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు వేగంగా పెరినట్లు ఐఎండీ తెలిపింది. రానున్న మూడు రోజులు ఇదేతరహాలో వాతావరణం ఉంటుందని వివరించింది. వడదెబ్బతో కూలి మృతి రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజా పేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి బొల్లారం నర్సమ్మ (55) వడదెబ్బతో మృతిచెందింది. నర్సమ్మ గురువారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిoది. దాహం వేయడంతో నీళ్లు తాగింది. ఆ వెంటనే ఆమె అస్వస్థతకు గురైంది. నర్సమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. -
మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు(సోమవారం) నుండి రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడనుంది. సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం 7 గంటలకు దృశ్యమానత 200 మీటర్లుగా నమోదైంది. పాలంలో ఉదయం 4 గంటలకు 50 మీటర్లుగా ఉంది.జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షం, హిమపాతం కారణంగా వాతావరణం(Weather)లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా మంచు గాలులు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను తాకాయి. దేశంలోని 12 రాష్ట్రాల్లో విపరీతంగా కురుస్తున్న పొగమంచు పలు సమస్యలను సృష్టిస్తోంది. పంజాబ్, హర్యానాలలో పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.పొగమంచు కారణంగా కోల్‌కతాలో 13 విమానాల రాకపోకలకు(flight arrivals) అంతరాయం కలిగింది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, బెంగాల్, బీహార్, ఒడిశా సహా 12 రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిశా, అస్సాం, మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో సోమవారం కూడా దట్టమైన పొగమంచు కమ్ముకోనుందని వాతావరణశాఖ తెలిపింది.మంగళవారం పొగమంచు నుండి కొంత ఉపశమనం లభిస్తుందని, రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. పొగమంచు కారణంగా పంజాబ్‌లోని అమృత్సర్-ఖేమ్కరన్ రహదారిపై ఒక కారు- బస్సు ఢీకొన్నాయి. అమర్‌కోట్ బస్తీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేవిధంగా హర్యానాలోని మంగళ్‌పూర్-దరౌలి రోడ్డుపై దట్టమైన పొగమంచు కారణంగా, ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.ఇది కూడా చదవండి: America: 10 సురక్షిత రాష్ట్రాలు.. కాల్పుల మోతకు దూరం.. ప్రాణహానికి సుదూరం -
చిటపట.. గజగజ..
రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి.. పగలంతా ఉక్కపోత.. రాత్రయితే వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు పతనం కావడం, చలిగాలుల ప్రభావంతో వాతావరణం వేగంగా చల్లబడుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కపోతగా ఉంటే.. రాత్రిపూట గజగజమంటూ చలి వణికిస్తోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకు మించి నమోదవుతుండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంకంటే తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వర కు అధికంగా నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. బుధవా రం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 34.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతో జనజీవనం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ మార్పులు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయ ని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణో గ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం భారీ వ్యత్యాసంతో నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతకంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కాగా, హైదరాబాద్, రామగుండంలో 3డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది.రాష్ట్ర ప్రణాళికా విభా గం వివరాల ఆధారంగా కనిష్ట ఉష్ణోగ్రత కోహి ర్లో 6.9 డిగ్రీలుగా నమోదైంది. రానున్న 3 రోజులు కూడా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ గా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారు లు అంచనా వేస్తున్నారు. ఈసారే ఎందుకిలా?రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో చలిగాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు పతనం కావడం, చలిగాలుల ప్రభావంతో వాతావరణం వేగంగా చల్లబడుతోంది. భౌగోళికంగా రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గడం, పెరగడం జరుగు తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతుంటాయి. ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి బలమైన చలిగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. గతేడాది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదు కాగా.. ఈ ఏడాది మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
మళ్లీ విజృంభించనున్న కార్చిచ్చు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ అటవీ ప్రాంతాలను బూడిదచేస్తున్న కార్చిచ్చు మళ్లీ కన్నెర్రజేయనుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోని దావాగ్నిని ఇప్పటిదాకా కేవలం 14 శాతం మాత్రమే అదుపులోకి తెచ్చిన నేపథ్యంలో వాతావరణ విభాగ నివేదికలు స్థానికుల్లో భయాందోళనలను మరింత పెంచాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీంతో అడవిలో కార్చిచ్చు మరింత విస్తరించే ప్రమాదముందని అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ సోమవారం ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వీయనున్న శాంటా అనా పెనుగాలులతో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం దాకా ‘రెడ్ ఫ్లాగ్’ వార్నింగ్ అమల్లో ఉంటుంది. మరోవైపు అటవీప్రాంతాల్లో అగ్నికీలల సంబంధ అగ్నిప్రమాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా 24కు పెరిగింది. ఇంకా డజన్ల మంది జాడ తెలియాల్సిఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఒక్క లాస్ ఏంజెలెస్ సిటీ, కౌంటీ పరిధుల్లో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకువెళ్లాలని సూచించగా, మిగతా చోట్ల కలిపి మరో 87,000 మందికి సురక్షిత స్థలాలకు వెళ్లాలని స్థానికయంత్రాంగం హెచ్చరికలుచేసింది. ఆరు చోట్ల కార్చిచ్చు వ్యాపించగా పసిఫిక్ పాలిసేడ్స్, ఏటోన్ ప్రాంతాల్లోని దావాగ్ని మాత్రమే ఇంకా అత్యంత ప్రమాదకరస్థాయిలో కొనసాగుతు న్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 60 శాతం విస్తీర్ణానికి సమానమైన అటవీభూములను పాలిసేడ్స్, ఏటోన్, హర్స్ట్ కార్చిచ్చులు బూడిదకుప్పలుగా మార్చేశాయి. మొత్తంగా అన్ని కార్చిచ్చుల కారణంగా 40,000కుపైగా ఎకరాల్లో అటవీప్రాంతం పూర్తిగా కాలిపోయింది. 12,000కు పైగా ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు తగలబడ్డాయి. అయితే దుప్పటిలా కమ్మేసిన పొగ, దుమ్ము చాలా వరకు తగ్గడంతో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు తెరిచారు.బాణాసంచా వల్లే: వాషింగ్టన్ పోస్ట్నూతన సంవత్సర వేడుకల్లో జనం కాల్చిన బాణాసంచా కారణంగానే పసిఫిక్ పాలిసేడ్స్‌లో అగ్గిరాజుకుందని వాషింగ్టన్ పోస్ట్ వార్తాసంస్థ ఒక కథనంలో పేర్కొంది. రేడియో సంప్రదింపులు, ఆ ప్రాంతంలో బాణాసంచా కాల్చడానికి ముందు, ఆ తర్వాత తీసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు, స్థానికుల ఇంటర్వ్యూలతో ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తన కథనంలో పేర్కొంది. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ప్రదేశంలో అగ్గిరవ్వలు అడవిలో పడి దావాగ్ని మొదలైందని, అయితే వెంటనే దానిని ఆర్పేశారు. కానీ దావాగ్ని తాలూకు నిప్పుకణికలు కొన్ని అలాగే ఉండిపోయి భీకరగాలుల సాయంతో నెమ్మదిగా మళ్లీ దావాగ్నికి ఆజ్యంపోశాయని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గత మంగళవారం తొలుత పసిఫిక్ పాలిసేడ్స్‌లో మంటలు అంటుకున్నప్పుడు స్థానికులు ఫిర్యాదుచేసినా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతో మంటలు అదుపుతప్పి చివరకు లాస్ ఏంజెలెస్ చరిత్రలోనే మరో అతిపెద్ద దావాగ్నిలా ఎదిగాయని ఆరోపణలున్నాయి. ‘‘ ఆరోజు మేం వెంటనే ఫోన్లుచేశాం. కానీ లాస్ఏంజెలెస్ ఫైర్ డిపార్ట్మెంట్(ఎల్ఏఎఫ్డీ) నుంచి స్పందన రాలేదు. 45 నిమిషాలతర్వాత ఒక హెలికాప్టర్ వచ్చి నీళ్లు పోసి వెళ్లిపోయింది. మంటలు మాత్రం ఆరలేదు’’ అని స్థానికులు మైఖేల్ వాలంటైన్ దంపతులు చెప్పారు.ప్రైవేట్ నీటిట్యాంక్లకు గిరాకీతమ ప్రాంతంలో చెలరేగుతున్న మంటల నుంచి తమ ఇళ్లను కాపాడుకునేందుకు స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ నీటిట్యాంక్లకు గిరాకీ అమాంతం పెరిగింది. ఇదే అదనుగా ప్రైవేట్ వాటర్‌ట్యాంక్ సంస్థలుచార్జీలు మోతమో గిస్తున్నాయి. లాస్ ఏంజెలెస్‌లోని సంపన్నులు ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బంది వచ్చేదాకా ఆగకుండా ప్రైవేట్ ఫైర్ఫైటర్లను రప్పిస్తున్నారు. అయితే ఆ సేవలందించే సంస్థలు గంటకు 2,000 డాలర్లు అంటే రూ.1,73,000 చార్జ్ చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ దిగ్గజాలు రిక్ కరుసో, కీత్ వాసర్మ్యాన్ సహా చాలా మంది ఇదే బాటపట్టారు. ‘‘ నా ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. సంస్థ మొదలైననాటి నుంచి హాలీవుడ్లో ఇంతస్థాయి డిమాండ్ ఎప్పుడూ లేదు’’ అని కవర్డ్6 ఫైర్‌ఫైటింగ్ సేవల సంస్థ యజమాని క్రిస్ డన్ చెప్పారు. ‘‘ నగరపాలకులను నమ్మలేమని ఈవారం ఘటనతో తేలిపోయింది. నా దగ్గర డబ్బుంది. అయితేమాత్రం ఏం లాభం. ఇళ్లు తగలబడ్డాయి’’ అని ఒక హాలీవుడ్ ప్రముఖుడు వాపోయాడు. -
మానవాళికి ప్రకృతి శాపం!
‘వాతావరణం కూడా ప్రభుత్వాల వంటిదే. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది’ అంటాడు బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్. అది ముమ్మాటికీ నిజం. దేశంలో గత 123 ఏళ్లలో కనీవినీ ఎరగనంత స్థాయి ఉష్ణోగ్రతలు నిరుడు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చేసిన ప్రకటన హడలెత్తిస్తోంది. అంతేకాదు... వచ్చే ఏడాది సైతం రికార్డులు బద్దలయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మనదేశం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుటి ఉష్ణో గ్రతలు అధికంగానే ఉన్నాయని వివిధ దేశాల వాతావరణ విభాగాల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. మన పొరుగునున్న చైనాలో 1961 నుంచీ పోల్చిచూస్తే గత నాలుగేళ్ల ఉష్ణోగ్రతలు చాలా చాలా ఎక్కువని అక్కడి వాతావరణ విభాగం తెలియజేసింది. నిజానికి 2024లో ప్రపంచ ఉష్ణో గ్రతల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఇంకా అధికారిక నివేదిక విడుదల చేయలేదు. అందుకు మార్చి వరకూ సమయం ఉంది. కానీ ఈలోగా కొన్ని కొన్ని అంశాల్లో వెల్లడైన వాతావరణ వైపరీత్యాలను అది ఏకరువు పెట్టింది. అవి చాలు... మనం ఆందోళన పడటానికి! వాటి ప్రకారం– నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ నెలలమధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కాలం నాటికంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్ అధికం. అలాగే అంటార్కిటిక్ సముద్రంలో మంచు పలకలు మునుపటితో పోలిస్తే అధికంగా కరుగుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాతావరణం వల్ల నిరుడు మరణాలు, ఆర్థిక నష్టాలు కూడా బాగా పెరిగాయి. సాగర జలాల ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. సముద్ర మట్టాలు ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డయిన 29 వాతావరణ ఘటనలను విశ్లేషిస్తే అందులో 26 కేవలం వాతావరణ మార్పులవల్ల జరిగినవేనని తేలిందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ ఉదంతాల్లో 3,700 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది.స్వర్గనరకాలు మరెక్కడో లేవు... మన ప్రవర్తన కారణంగా ఆ రెండూ ఇక్కడే నిర్మితమవుతా యంటారు. వాతావరణం విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మానవ కార్యకలాపాలే వాతా వరణ వైపరీత్యాలకు మూలకారణం. నూతన సంవత్సర సందేశంలో గత దశాబ్దకాలపు వార్షిక ఉష్ణోగ్రతలన్నీ రికార్డు స్థాయివేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ వినాశకర దోవ విడనాడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తోంది. వినూత్న ఆవిష్కర ణలు అందుబాటులోకొస్తున్నాయి. కానీ వీటిని చూసి విర్రవీగి, ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టిన పర్యవసానంగా అది ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రకృతి చెప్పినట్టు వింటూ అది విధించిన పరిమితులను శిరసావహించాలి తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదని ఏటా వెలువడే నివేదికలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వినేదెవరు? లాభార్జనే తప్ప మరేమీ పట్టని పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ఎడాపెడా అనుమతులు మంజూరు చేస్తున్న పాలకులు, వాతావరణం నాశనమవు తున్నదని గ్రహించే చైతన్యం లోపించిన ప్రజలు పర్యావరణ క్షీణతకు దోహదపడుతున్నారు. అయి దేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పర్యావరణ పరిరక్షణ అంశం ఏనాడూ ప్రస్తావనకు రాదు. మన దేశంలోనే కాదు... ప్రపంచంలో వాతావరణ శిఖరాగ్ర సదస్సుల వంటివి నిర్వహించినప్పుడు తప్ప మరెక్కడా పర్యావరణం గురించి చర్చ జరగటం లేదు. ఇది ప్రకృతి విధ్వంసానికి పాల్పడే పారిశ్రామికవేత్తలకూ, పాలకులకూ చక్కగా ఉపయోగపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిందే. అందుకవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అభివృద్ధి అవసరాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టే విధానాలు మొత్తంగా మానవాళికే ప్రమాదకరం. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదనే విషయంలో ఎవరూ పెద్దగా విభేదించటం లేదు. కానీ దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలే నత్తనడకన ఉంటున్నాయి. ప్రపంచంలో కర్బన ఉద్గా రాల తగ్గింపునకు 2015 పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చెప్పాలంటే ఆ దిశగా ఎంతోకొంత అడుగులేస్తున్నది మనమే. ఆ శిఖరాగ్ర సదస్సు 2050 నాటికి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నిలువరించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అయితే దాన్ని చేరుకోవటానికి వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణానికి తూట్లు పొడవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంపన్న రాజ్యాలు బడుగు దేశాలకు హరిత ఇంధన సాంకే తికతలను అందించటంలో, అందుకవసరమైన నిధులు సమకూర్చటంలో ముఖం చాటేస్తున్నాయి. వాతావరణ మార్పుపై చెప్తున్నదంతా బోగస్ అనీ, పారిస్ ఒడంబడిక నుంచి తాము వైదొలగు తున్నామనీ అమెరికాలో క్రితంసారి అధికారంలోకొచ్చినప్పుడే ప్రకటించిన ట్రంప్... ఈసారి కూడా ఆ పనే చేస్తారు. ప్రపంచ దేశాల మాటెలావున్నా ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావొచ్చన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ అట్టడుగు స్థాయివరకూ తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి. మండే ఎండలు మాత్రమే కాదు... జనావాసాలను ముంచెత్తే వరదలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను గరిష్ట స్థాయిలో ఉంచటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. బాధిత ప్రజానీకానికి సాయం అందించటానికి అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. -
వర్షాలకు సెలవు!
సాక్షి, విశాఖపట్నం: శీతాకాలంలోనూ అల్పపీడనం, వాయుగుండం, ఫెంగల్ తుపాన్‌తో విలవిల్లాడిన రాష్ట్రానికి ఊరట లభించే వార్తను వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇకపై వచ్చే వేసవి కాలం వరకూ మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు, అల్పపీడనాలు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల శుక్రవారం వానలు పడే సూచనలున్నాయన్నారు. ఈ ఏడాదికి ఇవే చివరి వానలనీ..వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ భారీ వర్షాలేవీ ఉండవని తెలిపారు. నెలాఖరు నుంచి చలిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందనీ.. జనవరి 2వ వారం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. -
బలపడిన అల్పపీడనం..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ–నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని, ఈ ప్రక్రియ మొత్తం సముద్రంలోనే జరుగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం మరో 3 రోజుల పాటు రాష్ట్రంపై ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 26 నుంచి 28వ తేదీ వరకు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తగ్గే సూచనలున్నాయని వెల్లడించారు. వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. ఎగసి పడుతున్న అలలు వాకాడు: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మంగళవారం తిరుపతి జిల్లా సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం తీరంలో అలలు 5 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. -
బలహీనపడిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/బొల్లాపల్లి: వాయుగుండం బలహీనపడి.. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ–నైరుతి దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చి అల్పపీడనంగా బలహీనపడనుంది. మంగళవారం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతం వద్ద మరింత బలహీనపడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు అక్కడక్కడా వానలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని..ఈ నేపథ్యంలో 25 వరకు దక్షిణ కోస్తా తీరం వైపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.అకాల వర్షం ముంచేసింది..పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 4 గంటలపాటు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. కోత కోసి పొలాల్లో ఉంచిన వరి ఓదెలు నీట మునిగాయి. పలుచోట్ల ఆరబెట్టిన ధాన్యం కూడా తడిచిపోయింది. ధాన్యం విక్రయించే సమయంలో కురిసిన అకాల వర్షం తమను నిండా ముంచేసిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పలుకూరు, కనుమలచెరువు, పేరూరుపాడు, వెల్లటూరు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. -
వాయుగుండం అస్తవ్యస్త ప్రయాణం
సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా వాయుగుండం ఏర్పడితే ఈదురు గాలులు, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. కానీ.. ఈసారి వాయుగుండమే అస్తవ్యస్తమవుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం దారి తప్పినట్టుగా మారి.. అటూఇటూ తిరుగుతూ ప్రస్తుతం చెన్నైకి 480 కి.మీ., విశాఖపటా్ననికి 430 కి.మీ., గోపాల్‌పూర్‌కి 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. వారం రోజులపాటు అల్పపీడనంగానూ, తర్వాత వాయుగుండంగా బలపడిన సమయంలో గాలిలో తేమనంతటినీ లాగేసుకుంది. దీంతో సముద్రంలో మొత్తంగా పొడిగాలుల వాతావరణం ఏర్పడింది. తేమ గాలులు లేకపోవడంతో వాయుగుండం దిక్కుతోచని స్థితిలో పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్పారు. ఇది తూర్పు ఈశాన్య దిశగా నెమ్మదిగా కదులుతూ సముద్రంలోనే శనివారం రాత్రి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి మరింత బలహీనపడుతుందని, దీనిప్రభావం రాష్ట్రంపై ఇక ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి వానలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. -
స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
మహారాణిపేట: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది వాయవ్యంగా ఉత్తర తమిళనాడు, దక్షణ ఆంధ్రా దిశగా ఏపీ తీరానికి ఆనుకుని ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధవారం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో శీతల వాతావరణం నెలకొంది. గురువారం కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, విశాఖ, అల్లూరి జిల్లా, విజయనగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఆదిలాబాద్ @ 4.7 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే సగటున 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.7డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఇక్కడ ఈ సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కంటే 8.1 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.పటాన్చెరు, హకీంపేట్, హనుమకొండ, మెదక్, నిజామాబాద్, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సాధారణం కంటే 4డిగ్రీ సెల్సియస్‌కు పైబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా నెలకొన్న వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు పతనమైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఈశాన్య దిశనుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. రానున్న రెండ్రోజులు ఉదయం పూట పొగమంచు ఏర్పడుతుందని, దీంతో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.రానున్న మూడురోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 4డిగ్రీల వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ప్రాంతాలు ఆదిలాబాద్ : 4.7 డిగ్రీలు, అర్లి : 6.3డిగ్రీలు, తండ్ర: 6.6 డిగ్రీలు, తిర్యాణి: 6.7 డిగ్రీలు, కొహిర్: 6.8డిగ్రీలు, జుక్కల్: 7.6డిగ్రీలు, కొట్గిరి: 7.7 డిగ్రీలు, శివంపేట్: 8 డిగ్రీలు, మల్లాపూర్: 8 డిగ్రీలు, మోమీన్‌పేట్: 8.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నేడు అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, చెన్నై: అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. అనంతరం తమిళనాడు ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అల్పపీడన ప్రభావంతో కోసాంధ్ర జిల్లాల్లో ఈ నెల 17 తరువాత అక్కడక్కడా మోస్తరు వానలు పడే సూచనలున్నాయని తెలిపారు. తమిళనాడులో భారీ వర్షాలు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలను వర్షం ముంచెత్తడంలో జనజీవనం స్తంభించింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం తీరాన్ని తాకినప్పటి నుంచి తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు తామర భరణి నదిలో ప్రవహిస్తుండటంతో తీరగ్రామాల ప్రజల్లో ఆందోళన ఉధృతమైంది. విరుదునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని ప్రమాదవశాత్తూ నీటి గుంటలో పడి రాజేశ్వరి (32), ఆమె కుమారుడు దర్శన్ (5) మరణించారు. -
17 నుంచి కోస్తాంధ్ర జిల్లాలకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలున్నాయని.. దీని ఫలితంగా రాష్ట్రంపై మళ్లీ వర్ష ప్రభావం ఉండబోతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 17 తర్వాత అల్పపీడన ప్రాంతాలు ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇవి కోస్తాపై ప్రభావం చూపిస్తాయని.. 17వ తేదీ రాత్రి నుంచి ఏపీ తీరప్రాంత జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. -
వాయు‘గండం’ లేనట్లే.!
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల ఫెంగల్ తుపాన్‌తో వణికిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు.. మరోసారి అదే వైపుగా అల్పపీడనం వస్తుండటంతో ఆందోళనకు గురవుతుండగా.. ఆ భయం వద్దని వాతావరణశాఖ ధైర్యం చెప్పింది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని స్పష్టం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత.. శ్రీలంక, తమిళనాడు తీరాలవైపుగా పయనించి అక్కడే తీరం దాటే సూచనలున్నాయని వెల్లడించారు. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గురువారం కోస్తా జిల్లాల్లో వాతావరణం మేఘావృతంగా ఉంటుందని పేర్కొన్నారు. -
చలికాలంలోనూ ‘ఎండలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా పెరిగాయి. ఇటీవలి తుపానుతోపాటు బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో తేమ శాతం కూడా వేగంగా పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.5 డిగ్రీలు అధికం. అలాగే భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, నిజామాబాద్‌లలో రెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండం, మెదక్, దుండిగల్లలో సాధారణం కంటే 7 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవడం గమనార్హం. మిగిలిన చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతూ 11వ తేదీ నాటికి శ్రీలంక–తమిళనాడు తీరాల సమీపానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణాజిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
సర్కారు నిర్వాకంతో తడిసిముద్దయిన ధాన్యం రాశులు.. అన్నదాత అగచాట్లు
బస్తాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.. ఎకరం 50 సెంట్లలో వరి సాగుచేశా. ఎకరాకు 54 బస్తాల దిగుబడి వచి్చంది. తేమ శాతం ఎక్కువగా ఉందని ఆరబెట్టమన్నారు. రోడ్లపై ఆరబెట్టాను. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అమ్ముదామని అనుకున్నా. మిల్లర్లకు చేరవేస్తే క్వింటాకు రూ.1,500 ఇస్తామంటున్నారు. ఇప్పుడు బస్తాల్లోకి ఎక్కించిన ధాన్యం కాస్తా ఇలా తడిసి ముద్దయింది. ధర ఎంతొస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. – అంగరాల రాంబాబు, చిట్టిగూడెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లాసాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను వస్తుందని నాలుగైదురోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో బాధ్యతగల ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది.. ముందుగా కోసిన పంటను ఆఘమేఘాల మీద కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపడుతుంది. కానీ, నిత్యం సొంత డబ్బా కొట్టుకునే టీడీపీ కూటమి ప్రభుత్వం చేతగానితనంవల్ల కళ్లెదుటే తమ కష్టార్జితం తడిసిముద్దవడంతో అన్నదాతల వేదన అంతాఇంతా కాదు. ఇప్పటికే రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధరలేక రైతులు అల్లాడిపోతుంటే.. ఫెంగల్ తుపాను ప్రభావంతో వారి పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. అలాగే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడం.. తమ కష్టార్జితాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటుండడంతో వారు క్వింటాకు రూ.500కు పైగా నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే.. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కళ్లాల మీద ఉన్న వరిచేలు నేలకొరుగుతుంటే.. కోసిన పంట తడిసి ముద్దవుతోంది. కనీసం నష్టానికి తెగనమ్ముకుందామన్నా కూడా కొనే నాథుడు కన్పిచక రైతులు అన్నిరకాలుగా దగాకు గురవుతున్నారు. ఫెంగల్ కలవరంతో రైతులు పడరాని పాట్లు.. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడుతున్న ఫెంగల్ తుపాను రైతులను మరింత కలవరపెడుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కొన్ని జిల్లాల్లో 20–40 శాతం కోతలు పూర్తికాగా, మెజార్టీ జిల్లాల్లో 15–20 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. కోసిన పంటను కనీసం 3–4 రోజులపాటు ఆరబెడితేగాని తేమ శాతం తగ్గే అవకాశం ఉండదు. దీనికితోడు.. కూలీల కొరత, మరోవైపు సంచుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే, తూకం వేయకుండా సంచుల్లో నింపిన ధాన్యాన్ని తరలించే దారిలేక రోడ్ల మీద, పంట పొలాల మీదే ఉంచేసారు. ఈ నేపథ్యంలో.. శనివారం కురిసిన వర్షాలకు ఈ ధాన్యం కాస్తా తడిసి ముద్దవడంతో తేమశాతం పెరగడమే కాక రంగుమారి పోయే పరిస్థితి నెలకొంది. ఈ తేమ శాతం తగ్గితేగానీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే పరిస్థితిలేదు. ఇదే వంకతో గడిచిన మూడ్రోజులుగా ప్రైవేటు వ్యాపారులు సైతం ధాన్యం కొనేందుకు ముందుకు రావడంలేదు. అయినాసరే.. ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా ఉంది. ముఖ్యంగా.. ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కోసిన పంట రోడ్లపైన, కళ్లాల్లోనే కన్పిస్తోంది. ఆరబోత కోసం రోడ్లపై వేసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు.. కోసిన ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు.. అధిక శాతం పంట ఇంకా కళ్లాలు, పొలాల్లోనే ఉండడంతో కోసిన పంటను అక్కడే ఆదరాబాదరాగా కుప్పలు పెడుతున్నారు. ఇవి కనీసం నాలుగైదు రోజులు పనల మీదే ఎండాల్సి ఉంది. వాతావరణ మార్పులతో ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పీడిస్తున్న టార్పాలిన్ల కొరత.. ఇక టార్పాలిన్ల కొరత కూడా రైతులను పట్టిపీడిస్తోంది. అద్దెకు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. అవి కూడా అరకొరగానే దొరుకుతున్నాయి. ఎకరం విస్తీర్ణంలో పండిన ధాన్యానికి కనీసం మూడ్రోజులపాటు ఆరబెట్టుకునేందుకు రూ.వెయ్యి నుంచి రెండువేల వరకు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగితే అద్దె భారం తడిసి మోపెడవక తప్పని పరిస్థితి. అమ్ముకోవాలంటే మండపేటకు వెళ్లండిఇదిలా ఉంటే.. కృష్ణాజిల్లాలో రైసుమిల్లుల వద్ద ధాన్యం లోడులతో వందలాది లారీలు బారులుతీరాయి. దీంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలేదు. పైగా.. అమ్ముకోవాలంటే మండపేట మిల్లులకు తరలించుకోవాలని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. కృష్ణాజిల్లా నుంచి మండపేట తరలించాలంటే రైతులకు రవాణా చార్జీలు తడిసిమోపెడవుతాయి. ఒకవేళ వ్యయప్రయాసలకోర్చి తరలించినా మండపేట మిల్లుల వద్ద కూడా 3–4 రోజుల పాటు పడిగాపులు పడాల్సిన పరిస్థితులున్నాయని చెబుతున్నారు. జీఎల్టీ చెల్లింపుల ఊసులేదు.. వైఎస్ జగన్ హయాంలో హమాలీల చార్జీలు భరించడంతో పాటు రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చేది. ఒకవేళ రైతే సొంతంగా తరలించుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు (జీఎల్టీ) చార్జీలు నేరుగా రైతుల ఖాతాలో జమచేసేది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో హామీల చార్జీలు చెల్లించడంగానీ, రవాణా సౌకర్యాలు కల్పించడంగానీ ఎక్కడా జరగడంలేదు. మంత్రి నాదెండ్ల ప్రచారార్భాటం.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై 60 కిలోమీటర్ల పొడవునా ఇరువైపులా సర్వీవస్ రోడ్లలో ధాన్యం రాశులే కన్పిస్తున్నాయి. తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాసులు శనివారం కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వారం జిల్లా పర్యటనలో ప్రచారార్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యత ధాన్యం కొనుగోళ్లపై పెట్టలేదని సాక్షాత్తు రైతులే ఆరోపించారు. నిజానికి.. రోడ్లపై ఆరబడిన ధాన్యాన్ని 48 గంటల్లోనే మిల్లులకు తరలిస్తామని మంత్రి ఆర్భాటంగా ప్రకటన చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితిలేదు. కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలో తడిసిపోయిన వరి పనలు జిల్లాల్లో ఇదీ పరిస్థితి..⇒ ఉత్తరాంధ్రలో విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో 50–60 శాతం కోతలు పూర్తికాగా, అనకాపల్లి జిల్లాలలో కేవలం 12 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. ఈ జిల్లాల్లో తుపాన్ ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే ధాన్యం రంగుమారి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ⇒ పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కళ్లాల్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం రాసులు పోసి ఉన్నాయి. దాదాపు లక్ష ఎకరాల పంట పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో వర్షాలు కురిస్తే కళ్లాల్లో ఉన్న ధాన్యం రంగుమారడమే కాదు.. వర్షపు నీరు పొలాల్లో చేరి కనీసం 2–3 రోజులుంటే పక్వానికి వచ్చిన పంటకు కూడా తీవ్రనష్టం తప్పదంటున్నారు. ⇒ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 30–40 నూరి్పడి చేసిన ధాన్యాన్ని రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పోసి ఆరబెట్టుకుంటున్నారు. ఈ డెల్టా పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతకు వచి్చన వరి పంట నేలవాలింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొలకలొచ్చే పరిస్థితులు కని్పస్తున్నాయి. పొలాల్లో వర్షపు నీరుచేరితే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ⇒ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కేవలం 15 శాతానికి మించి కోతలు పూర్తికాలేదు. కోత కోసి ఓదె మీద ఉన్నప్పుడు వర్షం వస్తే నష్టం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో యంత్రాలతోనే నూర్పిడికి మొగ్గు చూపుతున్నారు. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడితే తాము నిండా మునిగిపోతామని రైతులు కలవరపడుతున్నారు. ఈ జిల్లాల్లో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి, వాగుల వెంబడి ఉన్నా మిరప పంటలు దెబ్బతినే అవకాశం కన్పిస్తోంది. ⇒ నెల్లూరు జిల్లాలో రైతులు ముందస్తు రబీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో ఈ జిల్లాల్లో వరి సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పెన్నా డెల్టా, కనుపూరు కాలువల కింద వరి నారుమడుల కోసం విత్తనాలు జల్లారు. మరికొన్నిచోట్ల నారుమడులు సిద్ధంచేసుకుంటున్నారు. ఈ దశలో 2–3 రోజులు వర్షాలు కురిసి, పొలాల్లో నీరుచేరితే నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ⇒ తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో పంట 45–60 రోజుల దశలో ఉంది. ఈ జిల్లాల్లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసి చేలల్లో చేరిన నీరు నిలిస్తే మాత్రం నష్టతీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. -
తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహాబలిపురానికి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టు పేర్కొంది.తీరం దాటే సమయంలో ఇంకా నెమ్మదిగా కదులుతున్నట్టు తెలిపింది. తుపాను చెన్నైకి సమీపంలో తీరం దాటేందుకు వచ్చినట్టే వచ్చి దాదాపు 6 గంటల వరకూ సముద్రంలోనే స్థిరంగా నిలిచిపోయింది. అనంతరం.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పుదుచ్చేరి తీరం వైపు పయనించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా.. కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 వరకూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ∙ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.రెండు జిల్లాల్లో కుండపోతశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతుండటంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారుహెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో చలి తీవ్రంగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం నుంచి∙సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్‌ఎన్‌పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్ల మడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.తిరుమలలో భారీ వర్షంతిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలు ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతోపాటు, ఆకాశ గంగ, పాపవినాశనం మార్గాలను తాతాల్కింగా మూసివేశారు. విమాన సర్వీస్‌లు రద్దువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సరీ్వస్‌లను శనివారం రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీస్‌లు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్‌వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సరీ్వస్‌లు రద్దయ్యాయి. భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్లుశనివారం తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మన్నార్పోలూర్లో 13.0, పుత్తూరులో 12.3, సూళ్లూరుపేటలో 11.8, పూలతోటలో 11.5, తడలో 10.8, మల్లంలో 10.3, చిత్తూరు జిల్లా నగరిలో 9.4, నిండ్రలో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.సముద్రం అల్లకల్లోలంవిశాఖ సముద్ర తీరం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా మారింది. మూడు అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగసి పడుతున్నాయి. విశాఖలోని వైఎంసీఏ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు గల తీరం భారీగా కోతకు గురయింది. నాలుగు అడుగులకుపైగా ఎత్తున ఇసుక పూర్తిగా కోతకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఉదయం నుంచి జల్లులు పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడడక్కడా జల్లులు పడ్డాయి.కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పనలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదీవి వద్ద సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతలవారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3వేల ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది.తుపానుపై సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను విషయంలో రైతులు ఆందోళనగా ఉన్నారని, నిరి్ధష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు. కాగా, ఫెంగల్ తుపాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. -
వణికిస్తున్న చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రివేళ చలి పెరిగిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకుంటోంది. ప్రస్తుత సమయంలో సాధారణంగా నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దిగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. మరో మూడు రోజుల పాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్టం నిజామాబాద్ ః 32.4 శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 32.4 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట అదిలాబాద్‌లో 8.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.రాష్ట్రంలోని దాదా పు 30 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదు అయ్యింది. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కాగా, మెదక్, హనుమకొండల్లో 3 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదైంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు తాజా పరిస్థితుల్లో కుమ్రుంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. శని, ఆదివారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉదయం పూట పొగమంచుకు అవకాశం ఉంటుందని సూచించింది. -
మళ్లీ తుపానుగా బలపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బలపడటం.. బలహీనపడటం.. మళ్లీ బలపడటం.. ఇలా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోజుకో రకంగా రూపాంతరం చెంది, శుక్రవారానికి తుపానుగా మారింది. తీవ్ర వాయుగుండం గమనాన్ని బట్టి మొదట తుపానుగా మారుతుందని అంచనా వేసినా, గురువారానికి బలహీనపడింది. కానీ, మళ్లీ పుంజుకొని గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ శుక్రవారం మ«ద్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫెంగల్ తుపానుగా బలపడింది. వ్యతిరేక దిశలో ఉన్న షీర్ జోన్ బలహీనపడటం వల్లే వాయుగుండం మళ్లీ బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం ట్రింకోమలికి 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 270 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పుదుచ్చేరికి సమీపంలోని కారైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశాలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. శనివారం అర్ధరాత్రి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.వేటకు వెళ్లొద్దు..తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిమీ, ఉత్తర కోస్తాలో 40 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు డిసెంబర్ 1 వరకూ వేటకు వెళ్లొద్దని సూచించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 1.5 మీటర్లు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 2.7 నుంచి 3.3 మీటర్ల వరకూ ఎగసి పడుతూ అలలు అల్లకల్లోలం సృష్టిస్తాయని తెలిపారు. సందర్శకులు కూడా సముద్ర తీరానికి వెళ్లవద్దని సూచించారు.పోర్టులకు హెచ్చరికలుఫెంగల్ తుపాను కారణంగా కృష్ణపట్నం పోర్టులో డేంజర్ సిగ్నల్ నం–6 జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్–2 జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
వాయుగుండం ముప్పు ఏపీకి తక్కువే..
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న వాయుగుండం ముప్పు ఏపీకి ఉండే అవకాశాలు చాలా తక్కువని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ అండమాన్ సముద్రం వరకూ విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 25 నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఏపీపై తక్కువగా ఉంటుందని, దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపుగా కదిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. వాయుగుండం మరింత బలపడి తుపానుగా కూడా మారే సూచనలూ కనిపిస్తున్నాయని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 26, 27 తేదీల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
25న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు చలిగాలులు ప్రారంభమైన తరుణంలో... భారీ వర్షాలు మరోసారి విరుచుకుపడనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, 25 నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వెల్లడించారు. క్రమంగా.. ఇది దక్షిణకోస్తా మీదుగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందనీ.. లేదంటే.. దక్షిణ కోస్తాంధ్రలోనే తీరం దాటే సూచనలు కూడా ఉన్నాయని వివరించారు. దీని ప్రభావంతో 25 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. 23 నుంచి తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు 23 నుంచి 27 వరకూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
రాష్ట్రానికి తుపాను ముప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మళ్లీ తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల చివరి వారంలో రాష్ట్రాన్ని తుపాను తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రంలో ఈ నెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. 27వ తేదీ నాటికి అది తుపానుగా బలపడి 28వ తేదీలోపు చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
నేడు, రేపు వానలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఒడిశా వైపు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణాంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య విస్తరించి కొనసాగుతోంది.దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. -
బలహీనపడిన ‘దానా’ తుపాను
సాక్షి, అమరావతి: తీవ్రమైన తుపాను ‘దానా’ బలహీనపడింది. గురువారం రాత్రి 1:30 నుంచి తెల్లవారుజాము 3:30 గంటల మధ్య ఒడిశాలోని హబాలిఖతి నేచర్ క్యాంప్ (భిత్తర్కనిక), ధమ్రాకు సమీపంలో తీరం దాటింది. ఇది 10 కి.మీ వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తా ఒడిశా మీదుగా ఒడిశాలోని భద్రక్‌కు 30 కి.మీ, ధమ్రాకు 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను కేంద్రం చుట్టూ గరిష్ట స్థిరమైన గాలులు గంటకు 80–90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఉత్తర ఒడిశా వద్ద వాయువ్య దిశగా కదులుతూ కొద్దిగంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. -
రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: తూర్పు– మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తుపానుగా మారింది. ఇది పారదీప్ (ఒడిశా)కు ఆగ్నేయ దిశగా సుమారు 560 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. వాయువ్య దిశగా కదులుతూ గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం 25న తెల్లవారుజాము కల్లా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పూరి, సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లోని ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు: ప్రస్తుతం రాష్ట్రానికి ఉత్తర, ఈశాన్య దిశల నుండి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి 7.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా. 6.02 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 81.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, బుధవారం నాటికి 102.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 26 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవన సీజన్ నుంచి ఈశాన్య రుతుపవనాల సీజన్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 జిల్లాల్లో అత్యధికం, 16 జిల్లాల్లో అధికం, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. -
23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాను
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23న తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఎగువ గాలులతో ఏర్పడిన చక్రవాతపు ఆవర్తనం ప్రభావం వల్ల సోమవారం ఉదయానికి తూర్పు–మధ్య బంగాళాఖాతం, పరిసర ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 22వ తేదీ ఉదయం కల్లా వాయుగుండంగా మార్పు చెందుతుందని వెల్లడించింది. ఆ తర్వాత వాయుగుండం బలపడి ఈనెల 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24వ తేదీ ఉదయం కల్లా ఒడిశా–పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి, పరిసర పశి్చమ మధ్య బంగాళాఖాతంలో మరో చక్రవాతపు ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండంగా మార్పు చెందే క్రమంలో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. -
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో ఆదివారం నుంచి 5 రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 21 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి 23వ తేదీ నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్ లేదా ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో తీరం దాటే సూచనలు సమానంగా ఉన్నాయనీ.. 21 తర్వాత ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ హెడ్ భారతి ఎస్ సబడే తెలిపారు. ఎక్కువగా ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో ఈ నెల 24 నుంచి 26 మధ్యలో తీరం దాటేందుకు అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అధికారి స్టెల్లా పేర్కొన్నారు. కాగా.. వారం క్రితం మన రాష్ట్రంలో బలహీనపడిన వాయుగుండం ప్రస్తుతం అరేబియా సముద్రం–దక్షిణ కర్ణాటక, రాయలసీమ ప్రాంతంలో అల్పపీడనంగా ఉంది. వీటన్నింటి ప్రభావంతో వచ్చే 5 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రధానంగా రాయలసీమ, దక్షిణాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఒడిశా వైపు కదిలే అవకాశం ఉండటంతో 23వ తేదీ తర్వాత ఉత్తరాంధ్రలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఈ నెల 29న ఒకటి, వచ్చే నెల 3న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడే సూచనలు మొదలైన నేపథ్యంలో సముద్రంలో అలజడి మొదలైందనీ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులెవరూ ఆదివారం నుంచి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. -
వణికిస్తున్న వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రాష్ట్రాన్ని వణికిస్తోంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రెండ్రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ఉండడంతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.నేడు తీరం దాటనున్న వాయుగుండంఇక బుధవారం రాత్రికి చెన్నైకి 190 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, నెల్లూరుకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడులోని పొన్నేరి–తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మధ్యలో బుధవారం అర్థరాత్రి 12 నుంచి గురువారం వేకువజామున 3 గంటలలోపు తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అల్పపీడనంగా బలహీన పడే అవకాశం ఉందని వెల్లడించింది.దీని ప్రభావంతో గురువారం రాత్రి వరకు రాయలసీమలోని నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అయితే సూళ్లూరుపేట, తడ మండలాలకే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లుగా హెచ్చరిస్తున్నారు. తేరుకుంటున్న చెన్నై.. సాక్షి, చెన్నై/సాక్షి, బెంగళూరు : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెన్నైలో బుధవారం క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 450 ప్రాంతాల్లో వరద నీటిని పూర్తిగా తొలగించారు. కానీ, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు అవస్థలు తప్పలేదు. కొన్ని కుటుంబాలను పడవల ద్వారా శిబిరాలకు తరలించారు. వాయుగుండం గురువారం తీరం దాటే అవకాశాలతో రెడ్ అలర్ట్‌ను కొనసాగిస్తున్నారు. చెన్నై శివార్లలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. బెంగళూరు విలవిల.. మరోవైపు.. భారీ వర్షాలకు ఐటీ రాజధాని బెంగళూరు వణికిపోతోంది. వర్షాల తీవ్రత మంగళవారం ఎక్కువగా ఉండగా, చాలావరకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. తిరుపతిలో భారీ వర్షాలు..వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని పలుచోట్ల చెరువు కట్టలు దెబ్బతిన్నాయి. తిరుపతిలో 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టుకు ఒక్కసారిగా 20 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. ఇప్పటివరకు జిల్లాలో సరాసరి 198.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.మరోవైపు.. తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో రెండో ఘాట్ రోడ్డులోని 15వ మైలు వద్ద, భాష్యకార్ల సన్నిధికి సమీపంలో, హరిణి వద్ద బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో తిరు మాడవీధుల్లో, శ్రీవారి ఆలయం ఎదుట నీరు ప్రవహిస్తోంది. మరోవైపు.. వర్షాల కారణంగా తిరుమలలోని డ్యాముల్లోకి పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఐదు డ్యాములకు 250 లక్షల గ్యాలన్ల నీరు వచ్చిచేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. బుధవారం ఉ.7.35 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి ప్రయాణికులతో ఇండిగో విమానం చేరుకుంది.ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నైకు వెళ్లింది. అక్కడ రన్‌వేపై నీళ్లు ఉండటంతో తిరిగి రేణిగుంటకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా దింపి మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అలాగే హైదరాబాద్ నుంచి తిరుపతి రావాల్సిన మరో ఇండిగో విమాన సర్వీసు రద్దయింది. అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరుతోపాటు రాజంపేటలలో వరి, బొప్పాయి, అరటికి నష్టం జరిగింది.శ్రీవారి మెట్టు మార్గం మూసివేత..ఇక భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. అలాగే, బుధవారం రాత్రి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈఓ శ్యామలరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులతో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఆదేశించారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి వాటికీ ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూడాలన్నారు.నెల్లూరు జిల్లాలో అత్యవసర పరిస్థితి..మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కలెక్టర్ ఆనంద్ జిల్లాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అధికారులు, రెవెన్యూ, పంచాయతీ ఉద్యోగులకు సెలవులను రద్దుచేశారు. పెన్నా పరీవాహక ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేçస్తూ కలెక్టర్‌తో పాటు ఎస్పీ కృష్ణకాంత్, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని సుమారు 8.50 లక్షల జనాభాలో దాదాపు 1.5 లక్షల మంది వర్ష ప్రభావానికి గురయ్యారు. ఇక పలుచోట్ల వాగులు పొంగిపొర్లడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.అలాగే, జిల్లాలో పలుచోట్ల సముద్రం ఐదారు మీటర్ల వరకు ముందుకొచ్చింది. మూడు నుంచి నాలుగు మీటర్ల వరకు అలలు ఎగసిపడుతున్నాయి. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్రతీరం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా 120 అడుగుల మేర ముందుకు వచ్చింది. పౌర్ణమిరోజు వచ్చే పోటు సమయంలో సహజంగా 20 అడుగుల మేర సముద్రం ముందుకొస్తుంది. తీరంలోని వాచ్టవర్లు, తాత్కాలిక విశ్రాంతి బెడ్స్,, పర్యాటకులు కూర్చునే బల్లలను దాటుకుని సముద్రపునీరు ముందుకొచ్చింది. జిల్లాలో 14 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి బాధితులను వీటిలోకి తరలించారు. ఉలవపాడు మండల పరిధిలోని మన్నేటికోట గ్రామంలోని పునరావాస కేంద్రంలో బాధితుల్ని గాలికొదిలేశారు. రెవెన్యూ సిబ్బంది కొంత బియ్యం, కూరగాయలు షెల్టర్ వద్ద ఉంచి వెళ్లిపోయారు. దీంతో గిరిజనులే వండుకున్నారు. అధికారులు బుధవారం మధ్యాహ్నం వరకు కూడా భోజనాల ఏర్పాట్లుచేయలేదు. బాధితులే వండుకున్నారు. కానీ, ఉన్నతాధికారులకు పంపే రిపోర్టులో మాత్రం పునరావాసంలో అన్నం వండి వారికి పెట్టినట్లుగా పేర్కొన్నారు. 8 ప్రకాశం జిల్లా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరాయకొండ, కొత్తపట్నం, ఒంగోలు, సంతనూతలపాడు సముద్రతీర ప్రాంతాల్లో ఈదురు గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేట నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులకు గండ్లు పడటం, చెరువు కట్టలు తెగిపోవడం, పలుచోట్ల సప్టాలు మునిగిపోయాయి. ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నివాస ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఈసారి వణికించే చలి!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత శీతాకాలంలో చలితీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. డిసెంబర్, జనవరి నెలల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతాయని సూచించింది. లానినొ పరిస్థితుల కారణంగా వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక అంచనాలను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా విడుదల చేసింది. సాధారణంగా వర్షాకాలం ముగిసిన తర్వాత అక్టోబర్ నెలలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదవుతుంటాయి. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో ఏర్పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల సాధారణం కంటే అధికంగా నమోదు కావడంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం, ఆ తర్వాత ఒక్కసారిగా పతనం కావడంలాంటి పరిస్థితులు ఈ సీజన్లో కనిపించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు, మధ్య పసిఫిక్ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు (లానినొ) నమోదవుతుండడమే ఇందుకు కారణమని వివరిస్తున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని, ఉదయం వేళల్లో తీవ్రమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. గతంలో, తాజాగా 2022లో కూడా రాష్ట్రంలో ఈ తరహా లానినొ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర శివారుల్లోని కొన్ని ప్రాంతాల్లో 8 డిగ్రీ సెల్సీయస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయని, ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 4 డిగ్రీలకు పడిపోయిందని గుర్తుచేస్తున్నారు.సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలుసోమవారం రాష్ట్రంలోని పలు ప్రధాన కేంద్రాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 35.6 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా దుండిగల్‌లో 20.7 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. పలు జిల్లాలకు వర్ష సూచనరాష్ట్రంలో రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ, మధ్య బంగాళాఖాతం సమీపంలోని ఏపీ తీర ప్రాంతంలో చక్రవాతపు ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం ఏపీలో అధికంగా ఉన్నప్పటికీ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని సూచించింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. -
‘ఈశాన్య’ సీజన్లోనూ జోరు వానలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రాన్ని ముంచెత్తిన వానలు.. ఈశాన్య రుతుపవనాల సీజన్లోనూ అంతే స్థాయిలో జోరుగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో మూడు నెలల కాలంలో వర్షాలు, ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ తాజాగా అంచనాలు విడుదల చేసింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం 11.32 సెంటీమీటర్లుకాగా, సీజన్ ముగిసేనాటికి ఇంతకు మించి వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. నార్త్–ఈస్ట్ మాన్సూన్ సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 12 శాతం అధికంగా వర్షాలు నమోదు కావొచ్చని పేర్కొన్న ఐఎండీ.. అక్టోబర్‌లో మాత్రం 15 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 73.86 సెంటీమీటర్లు కాగా, సీజన్ ముగిసే నాటికి 96.26 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, సీజన్ మారుతున్న సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్నారు. 4 ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు.. ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో జోరువానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. నాలుగు ఉమ్మడి జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్టోబర్ నెలలో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక వర్షాలు నమోదు కాగా.. ఖమ్మం, భద్రాచలం, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. ఈశాన్య సీజన్లో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా నమోదు కావొచ్చని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలో ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. -
వాతావరణ అంచనాల్లో అగ్రపథం
సాక్షి, విశాఖపట్నం: వాతావరణ అంచనాలను కచ్చితత్వంతో మెరుగ్గా అందిస్తున్న దేశాల సరసన భారత్ నిలిచిందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డా.మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. మిషన్ మౌసమ్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో రాడార్ల ఆధునికీకరణతోపాటు ప్రజలకు వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసేలా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు. రెండేళ్లలో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో కొత్త రాడార్ స్టేషన్లు ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఖచ్చితత్వాన్ని మెరుగుపరచుకున్నాంవాతావరణ పరిస్థితుల అంచనాలో లోపాల్ని అధిగమించి ఖచ్చితత్వాన్ని మెరుగుపరచుకున్నాం. ప్రస్తుతం 40–50 శాతం ఫోర్ కాస్ట్‌ని ఖచ్చితత్వంతో అందిస్తున్నాం. 2030 నాటికి ఇది 15 శాతం పెరిగి 60–70 శాతం కచ్చితమైన సమాచారం అందించేలా కృషి చేస్తున్నాం. తుపానులపై మా అంచనాల ఖచ్చితత్వం అన్ని దేశాల కంటే మెరుగ్గా ఉంది. తుపాను సూచనల ఖచ్చితత్వం దాదాపు 86% వరకు ఉంది. హీట్‌వేవ్, కోల్డ్‌వేవ్ ఖచ్చితత్వం 92%గా ఉంది.విశాఖ, మచిలీపట్నం రాడార్ స్టేషన్ల ఆధునికీకరణ..వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 50 కొత్త రాడార్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం 1,000 కంటే ఎక్కువ ఆటోమేటిక్ వాతావరణ స్టేషన్లు, 6,000 రెయిన్ గేజ్‌లు, 550 డిపార్ట్మెంటల్ అబ్జర్వేటరీలు ఉన్నాయి. 25 విండ్ ప్రొఫైలర్స్, మైక్రో రేడియో మీటర్లు కొత్తగా ఏర్పాటు చేశాం. 60 రేడియో వన్ స్టేషన్లు జనరేట్ చేశాం. విశాఖపట్నం, మచిలీపట్నం, చెన్నై, కోల్‌కతా రాడార్ స్టేషన్లని ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.పిన్‌కోడ్‌తో సమాచారం మీ చేతుల్లో2024–25 నాటికి బ్లాక్ లెవల్, పంచాయతీ లెవల్ ఫోర్‌కాస్ట్‌ని అందుబాటులోకి తీసుకొస్తాం. సాధారణ ప్రజలు సమాచారం తెలుసుకునేలా మౌసమ్ మొబైల్ యాప్ తీసుకొచ్చాం. జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో స్పెషల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మీ ఊరి సమాచారం కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ ప్రాంతం పిన్‌కోడ్ ఎంటర్ చేస్తే అక్కడికి సంబంధించిన వాతావరణ సమాచారం తెలుసుకునే విధానం రాబోతుంది. ఇందులో భాగంగా ప్రతి బ్లాక్‌కి ఒక ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా దేశంలో 1.30 లక్షల ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.అర్బన్ మోడలింగ్ సిస్టమ్..వయనాడ్, విజయవాడల్లో వరదల ప్రభావం దృష్ట్యా అర్బన్ మోడలింగ్ సిస్టమ్‌ని అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఈ పనులు ప్రారంభించాం. మిగిలిన నగరాలకూ విస్తరించనున్నాం. దేశంలో 1,200 నగరాల్లో అర్బన్ సర్వీస్ అందిస్తున్నాం. 150 సిటీల్లో జియోస్పేషియల్ సర్వీస్ అందుబాటులో ఉంది. 2019 నుంచి పిడుగులు, ఉరుముల సమాచారం ఇస్తున్నాం. ఈ సమాచారం అందిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 3 కోట్ల మంది రైతులకు చేరువవాతావరణ సేవల ద్వారా ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు రైతులతో అనుసంధానం కావాలనేది మా లక్ష్యం. తీవ్రమైన వాతావరణ హెచ్చరికలతోపాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, గాలుల వేగం వంటి వివరాలను ‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా పొందవవచ్చు. దీన్ని వినియోగించుకుంటే చిన్న రైతులు రూ.12,500 వరకు లబ్ధి పొందవచ్చు. ఇప్పటివరకు 3 కోట్ల మంది రైతులకు చేరువయ్యాం. వీరికి రూ.13,300 కోట్ల మేర లబ్ధి కలిగింది. దేశంలో 10 కోట్ల మంది రైతులకు చేరువ కాగలిగితే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతుంది. అదే మా ముందున్న లక్ష్యం.ఘనంగా విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవాలు సాక్షి, విశాఖపట్నం: విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం (సీడబ్ల్యూసీ) స్వర్ణోత్సవాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) డైరెక్టర్ డాక్టర్ మహాపాత్ర హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అమృత్ కాల్ విజన్‌కు అనుగుణంగా ఐఎండీ అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్వరో్ణత్సవ వేడుకల సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఐఎండీ మాజీ డీజీ అజిత్ త్యాగి, చెన్నై ఆర్ఎంసీ హెడ్ డా.బాలచంద్రన్, సీడబ్ల్యూసీ విశాఖపట్నం హెడ్ భారతి ఎస్. సబడే, కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఏయూ వీసీ ఆచార్య శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వారం రోజులుగా వేసవిని తలపిస్తున్న రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ‘ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో సగటున సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. శనివారం అండమాన్ సముద్ర పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా కదిలి ఈ నెల 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈశాన్య రుతుపవన కాలం ప్రారంభమయ్యేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.’ అని వాతావరణ శాఖ తెలిపింది. -
నేడు మరో అల్పపీడనం!
మహారాణిపేట (విశాఖ): బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది 15న పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వెల్లడించారు. దీని ప్రభావం ఏపీపై ఉండబోదని స్పష్టం చేశారు. ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణంలో వేడి ఎక్కువవుతోంది. గురువారం అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.మరో వారం ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు తెలిపారు. -
రాష్ట్రానికి తప్పిన అల్పపీడనం ముప్పు
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల కురిసిన కుంభవృష్టితో అతలాకుతలమైన రాష్ట్రంపై దూసుకొచ్చి కలవరపెట్టిన మరో అల్పపీడనం దిశ మార్చుకొని బంగ్లాదేశ్ వైపుగా కదులుతోంది. దీంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. రాష్ట్రంలో భారీ వర్షాలకు మరో నాలుగు రోజుల పాటు బ్రేక్ పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం సమీపంలో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ వైపుగా కదులుతోంది. ఈ నెల 9 నాటికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, అనంతరం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తీరం దాటిన అనంతరం జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణిస్తూ బలహీనపడే సూచనలున్నాయని చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి ఉత్తరాంధ్ర మీదుగా బీహార్ వరకూ విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు 3 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. -
9న బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం కూడా కొనసాగుతూ మధ్య, ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తోంది. ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ బలపడి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరం వద్ద ఈనెల 9న వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శుక్రవారం వనపర్తి జిల్లాలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గద్వాల జిల్లాలో 4.16 సెం.మీ., మహబూబ్‌నగర్ జిల్లాలో 3.16 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో నైరుతి సీజన్లో ఇప్పటివరకు 60.87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 85.57 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ వివరించింది. -
మరో మూడు రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తాయని తెలిపింది. ఆరు జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ముసురు వాతావరణంతో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. భద్రాచలం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల మేర, మిగతా చోట్ల ఒకట్రెండు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాత్రివేళల్లో చలిగాలులు వీస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 32.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.రెండు జిల్లాల్లో వానలు డబుల్ నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి వర్షాలు సాధారణాన్ని దాటిపోయాయి. సీజన్‌కు సంబంధించి ఇప్పటి (సెపె్టంబర్ 5)వరకు 60.32 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవాల్సి ఉండగా.. 40శాతం అధికంగా 84.72 సెంటీమీటర్లు కురిసింది. వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో సాధారణం కంటే రెండింతలకుపైగా వర్షాలు కురిసినట్టు తెలంగాణ ప్రణాళిక విభాగం గణాంకాలు చెప్తున్నాయి. వనపర్తి జిల్లాలో 37.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 79.14 సెంటీమీటర్లు, అంటే 114 శాతం అధికంగా వర్షం కురిసింది.నారాయణపేట జిల్లాలో 37.08 సెం.మీ. సాధారణ వర్షపాతానికిగాను 77.15 సెంటీమీటర్లు (108 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో ఆరు జిల్లాలు వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. మిగతా జిల్లాల్లో అధిక వర్షం కురిసింది. -
దేశవ్యాప్తంగా సాధారణంకంటే అధిక వర్షపాతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వర్షాకాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణంకంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు 707.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 759.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వివరించింది. దేశంలోని 14 రాష్ట్రాల్లో సాధారణం కన్నా భారీ వర్షాలు కురిశాయని, అందులో రెండు తెలుగు రాష్ట్రాలున్నాయని తెలిపింది.తెలంగాణలో 581.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కన్నా 29 శాతం అధికంగా 751.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఆంధ్రప్రదేశ్‌లో 373.6 మిల్లీమీటర్లకు గానూ 534.3 మిల్లీమీటర్లు అంటే 43 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వెల్లడించింది. తెలంగాణలో ఏడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవగా, ఏపీలో నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడినట్లు వివరించింది. అలాగే భారీ వర్షాల జాబితాలో తెలంగాణలో 11, ఏపీలో 21 జిల్లాలున్నట్లు తెలిపింది. మిగతా జిల్లాలో సాధారణ వర్షపాతం ఉందని పేర్కొంది. దేశంలో అతిభారీ వర్షాలు కురిసిన జిల్లాలు అధికంగా తమిళనాడులో 19, రాజస్తాన్‌లో 14 జిల్లాలు ఉన్నాయని వెల్లడించింది. -
తీరం దాటిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని గడగడలాడించిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో అదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తీరం దాటింది. భూమిపైకి చేరి దక్షిణ ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది గంటకు 17 కి.మీ. వేగంతో కదులుతోంది. ఇది పశి్చమ వాయువ్య దిశగా కదులుతూ తెలంగాణకు తూర్పున రామగుండం ప్రాంతానికి 310 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కదులుతూ సోమవారం మధ్యాహా్ననికి బలహీనపడి అల్పపీడనంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి స్టెల్లా తెలిపారు.దీనికి అనుగుణంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మీదుగా రుతుపవన ద్రోణి పశి్చమ మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘అస్నా’ తుపాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు.వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి పరిగణనలోకి తీసుకుంటే కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలులో 24.25 మి.మీ., గోకవరంలో 14, మాకవరపాలెం, సాలూరులో 13, మద్దిపాడు, బాడంగిలో 12.5 మి.మీ.వర్షపాతం నమోదైంది.ముంచుకొస్తున్న మరో తుపాను! ఈ నెల 6, 7 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా మీదుగా పయనించి రెండు ప్రాంతాల మధ్యలో తీరం దాటనుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడనంపై రెండు రోజుల్లో కచ్చితమైన సమాచారం అందుతుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో 6వ తేదీ సాయంత్రం నుంచి మళ్లీ రాష్ట్రంలో మోస్తరు వానలు విస్తారంగా కురుస్తాయని అధికారులు వెల్లడించారు. -
నిలువెత్తు నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: భారీ వర్షాల వల్ల ముంపు ముప్పు పొంచి ఉందని ముందే తెలిసినా అలసత్వంతో వ్యవహరించి లక్షలాది మందిని నిరాశ్రయులుగా మిగిల్చింది! సర్కారు నిర్లక్ష్యం బెజవాడకు పెనుశాపంగా మారింది. భారీ వర్షాలు కురుస్తాయని మూడు రోజులు ముందు నుంచే వాతావరణ శాఖ, నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. భారీ వర్షాలు, వరద నిర్వహణపై ప్రణాళిక, అవగాహన లేకపోవడం, అలసత్వం కారణంగా విజయవాడ నగరవాసులు ముంపులో చిక్కుకుపోయారు. వరద పోటెత్తిన తర్వాత సీఎం చంద్రబాబు హడావుడి చర్యలకు దిగారు.ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వానికి పలు రకాల మెసేజ్‌లు పంపింది. వాతావరణ సమాచారాన్ని ఇవ్వడంలో ఎప్పటికప్పుడు ముందుండే ఏపీ వెదర్‌మ్యాన్ ప్రణీత్ ఆగస్టు 28వ తేదీ నుంచి ఎక్స్ మాధ్యమం ద్వారా పదేపదే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమవ్వాలని, అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూనే ఉన్నారు.గత 31వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని ట్యాగ్ చేస్తూ ఓ వినతిపత్రాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో అందులో వివరంగా పేర్కొన్నారు. అయినాసరే పట్టించుకునే నాథుడే లేకపోవడంతో రికార్డు స్థాయి వర్షానికి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు ముంపునకు గురయ్యాయి. మూడు లక్షల ఎకరాల్లోపంట పొలాలు దెబ్బతిన్నాయి. శనివారం అర్థరాత్రి నుంచి బుడమేరు ఉప్పొంగి బెజవాడలోని అనేక ప్రాంతాలను ముంచేసింది.పీకల మీదకు వచ్చాక..కనీస హెచ్చరికలు లేకుండా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి వేయడంతో బుడమేరు వరద విజయవాడను ముంచెత్తింది. భారీ వర్షాలకు బుడమేరు ఉప్పొంగి తిరువూరు, ఎ.కొండూరు, మైలవరం, జి.కొండూరు మీదుగా కౌలూరు హెడ్ రెగ్యులేటర్ వరకూ వస్తుంది. అక్కడ గేట్లు ఎత్తితే విజయవాడ రూరల్ మండలం, విజయవాడ నగరంలోని సింగ్‌నగర్ పరిసరాలన్నీ మునిగిపోతాయి. ఈ విషయం తెలిసి కూడా శనివారం రాత్రి 7.30 గంటలకు గేట్లు ఎత్తివేశారు. దీనికితోడు వెల్లటూరు వద్ద పటమట చెరువుతోపాటు దానిపైనున్న పలు చెరువులకు గండ్లు పడ్డాయి.దీంతో వరద అంతా బుడమేరులోకి రావడంతో కట్ట తెగిపోయింది. బుడమేరు వరద నీరు పోలవరం కాలువ మీదుగా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో కలవాలి. కానీ పోలవరం కాలువకు పలుచోట్ల గండ్లు పడడంతో ఆ వరదంతా విజయవాడవైపే వస్తోంది. బుడమేరు వరద హెడ్‌రెగ్యులేటర్ వద్ద 11 అడుగుల మేర నిలిచిపోయే దాకా అధికార యంత్రాంగం కళ్లు తెరవలేదు. పీకల మీదకు వచ్చాక ఎటువంటి హెచ్చరికలు లేకుండా గేట్లు ఎత్తేశారు. దీంతో శనివారం రాత్రి నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. మరోవైపు కొండవీటివాగు పొంగి రాజధాని గ్రామాల్లోకి నీరు చేరింది. చివరికి హైకోర్టు కూడా ముంపు బారినపడింది. సెక్రటేరియేట్, అసెంబ్లీ కూడా జలమయంగా మారాయి. కృష్ణా డెల్టా పరిధిలో లక్షల ఎకరాలు మునిగిపోయాయి. హడావుడే.. కానరాని సన్నద్ధత వర్షాలపై హెచ్చరికలు పట్టించుకోకుండా సీఎంతో సహా మంత్రులు, ఉన్నతాధికారులు వీకెండ్ విశ్రాంతిలో ఉండిపోయారు. ముందస్తు సన్నద్ధత లేకపోగా, వర్షాలు తీవ్రంగా కురుస్తున్నా సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులు, జిల్లాలను అప్రమత్తం చేయలేదు. ఎప్పటిమాదిరిగానే ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు ఉన్నతాధికారులంతా చాలామంది శుక్రవారమే హైదరాబాద్ వెళ్లిపోయారు. వర్షాలు దంచి కొట్టడంతో సాయంత్రానికి పరిస్థితి తీవ్రత గమనించి అప్పుడు హడావుడిగా సమీక్ష నిర్వహించారు. రెండు గంటలకు ఒకసారి తనకు రిపోర్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.సీసీఎల్ఏ నేతృత్వంలో ఉన్నతాధికారులతో రాత్రి 8 గంటల తర్వాత ఒక కమిటీని నియమించారు. అయితే అప్పటికి వారిలో చాలామంది అధికారులు అందుబాటులో లేరు. తీవ్రత తెలిశాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లి తూతూమంత్రంగా సమీక్ష చేశారు. మరోవైపు చంద్రబాబు నివేదికలు, సమీక్షలతో కాలం గడిపారు. ఇదంతా జరుగుతుండగానే ఎటువంటి హెచ్చరికలు లేకుండా అధికారులు బుడమేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేశారు.ఫలితంగా తెల్లారేసరికి విజయవాడ ముంపునకు గురైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (వాతావరణ శాఖ) మూడు రోజుల క్రితమే హెచ్చరించింది. మరోవైపు ఎగువ నుంచి కృష్ణాతో పాటు మూసీ, మున్నేరు, బుడమేరు, కట్టలేరు, నాలేరు, రామిలేరుల నుంచి భారీ వరద ప్రభావం ముంచెత్తుతుందని సీడబ్ల్యూసీ కూడా అప్రమత్తం చేసింది. అయినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడం, సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.మునిగాక బోట్లు తెప్పిస్తారా?అనంతరం సమీక్షల పేరుతో అధికారులను పని చేయనివ్వకుండా సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లి సంబంధం లేని మాటలతో అధికారులకు విసుగు తెప్పించారు. ఆ తర్వాత ముంపునకు గురైన విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతానికి వెళ్లి రాత్రంతా అక్కడే ఉంటానని, బోట్లు తెప్పిస్తానని, హెలికాఫ్టర్లు రప్పిస్తానని చెప్పారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మునిగిపోయాక వచ్చి పడవలు తెప్పిస్తాననడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద నిర్వహణపై ఏమాత్రం అవగాహన లేకుండా వ్యవహరించి తర్వాత తాపీగా తప్పు గత సర్కారుదేనని చంద్రబాబు బురద చల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది.వీటికి జవాబేది బాబూ?1 ఐఎండీ, సీడబ్ల్యూసీ హెచ్చరికలను ఎందుకు బేఖాతర్ చేశారు?2 ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా ఇంత అలసత్వం ఎందుకు?3 బుడమేరు గేట్లు ఎత్తేముందు ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదు?4 సాక్షాత్తూ మీ ఇంట్లోకే వరద పోటెత్తితే కార్యాలయాల్లో తలదాచుకోవడం నిజం కాదా? 5 వరద బాధితులకు కనీసం మంచినీరు, ఆహారం అందకపోవటానికి మీ వైఫల్యం కారణం కాదా?6 విపత్తు వేళ అధికార యంత్రాంగాన్ని పని చేయనివ్వకుండా మీ చుట్టూ తిప్పుకోవడం సబబేనా? -
Telangana: రాష్ట్రవ్యాప్తంగా 'జోరు వాన'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి, చెరువులు అలుగుపోస్తున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. ఆదివారం విశాఖపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్లు శనివారం రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 18.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిరలో 16.38, బోమన్‌దేవిపల్లిలో 13.75, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 12.35, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 10.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక విభాగం గణాంకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల 5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మొత్తంగా శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2.33 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. సీజన్ సగటులో అధిక వర్షపాతం నైరుతి సీజన్లో ఆగస్టు చివరినాటికి రాష్ట్రంలో 57.59 సెం.మీ. సగటు వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 66.37 సెం.మీ. కురిసింది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలన్నీ సాధారణ వర్షపాతానికి కాస్త అటు ఇటుగా ఉన్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా వానలు.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్లలోని పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఏకబిగిన వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు చెందిన పుట్ట మహేశ్ (17) పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుతో మృతి చెందాడు. ⇒ ములుగు జిల్లా జగ్గన్నగూడెం సమీపంలోని బొగ్గులవాగు, పస్రా–ఎస్ఎస్ తాడ్వాయి మండలాల మధ్య జలగలంచవాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పస్రా– తాడ్వాయి మధ్య కొండపర్తి సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో పాకాల వాగు ఉప్పొంగడంతో.. వందల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఖమ్మం జిల్లా మధిర పట్టణం జలదిగ్బంధమైంది. బస్సులు, వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి ఆందోళనలో పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. భారీ వర్షాల నేపథ్యంలో హుటాహుటిన మధిరకు బయలుదేరారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు–పెగళ్లపాడు మధ్య రహదారిపై చేరిన వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడి నక్కలవాగులో భవానిపురానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు(19) గల్లంతయ్యాడు. ⇒ కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లో భారీ వర్షం కురిసింది. పట్టణంలో ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా రాజాపేటలో, అడ్డ గూడూరు మండలం చౌళ్లరామారంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పొలాలు నీటమునిగాయి. ⇒ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా బండగొండలో ఇద్దరు యువకులు వాగులో పడి కొట్టుకుపోగా.. స్థానికులు గమనించి కాపాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో దుందుభి, వర్నె వాగు ఉధృతంగా పారుతున్నాయి. జడ్చర్లలో ఏరియా ఆస్పత్రి జలదిగ్బంధమైంది వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం దావాజీపల్లి సమీపంలో కేఎల్ఐ కాల్వకు గండిపడటంతో పొలాలు నీటమునిగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెనచర్లలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ⇒ జగిత్యాల జిల్లా కేంద్రంలోని వెంకటాద్రినగర్ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది. అధికారులు ప్రజలను జేసీబీ సహాయంతో వాగును దాటిస్తున్నారు. గ్రేటర్ సిటీకి ముసురు హైదరాబాద్ మహానగరానికి ముసురు పట్టింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీనితో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది. లో తట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. హై దరాబాద్ జిల్లా పరిధిలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. విస్తారంగా వానలతో హిమాయత్‌నగర్, గండిపేట జంట జలాశయాల్లోకి వరద పెరిగింది. దీ నితో మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో శనివారం ఆయన సీఎస్‌తో సమీక్షించారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. జలాశయాల గేట్లు ఎత్తేసే నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అన్ని జిల్లా కలెక్టరేట్లు, జీహెచ్ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని.. ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారిని నియమించి.. జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల పరిస్థితికి అనుగుణంగా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.బొగత జలపాతం సందర్శన నిలిపివేత వాజేడు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రేంజర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మళ్లీ ఎప్పుడు అనుమతిస్తారనేది మీడియా ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించారు.సీజనల్ వ్యాధులపై జాగ్రత్తవైద్య సిబ్బందికి మంత్రి దామోదర సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. తమ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గే వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ రవీందర్ నాయక్‌ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులకు అండగా నిలవాలని కోరారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా తదితర వ్యాధుల కట్టడిపై శనివారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, రాష్ట్రంలో డెంగీ, చికున్ గున్యా, మలేరియా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని అధికారులు మంత్రికి నివేదించారు.డెంగీ: రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు పరీక్షించిన మొత్తం 1,06,356 నమూనాలలో రిపోర్ట్ అయిన డెంగీ కేసులు 6,242 అని అధికారులు తేల్చారు. డెంగీ హైరిస్క్ తొలి పది జిల్లాల్లో హైదరాబాద్‌లో (2,073), సూర్యాపేట (506), మేడ్చల్ మల్కాజ్గిరి (475), ఖమ్మం (407), నిజామాబాద్ (362), నల్లగొండ (351), రంగారెడ్డి (260), జగిత్యాల (209), సంగారెడ్డి (198), వరంగల్ (128) కేసులు నమోదయ్యాయి.చికున్ గున్యా: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పరీక్షించిన 3,127 నమూనాలలో రిపోర్ట్ అయిన వాటిలో చికున్ గున్యా కేసులు 167. చికున్ గున్యా హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ (74), మహబూబ్‌నగర్ (20), వనపర్తి (17), రంగారెడ్డి (16), మేడ్చల్ (11) కేసులు నమోదయ్యాయి.మలేరియా: జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు మొత్తం 22,80,500 నమూనాలు పరీక్షిస్తే మలేరియా పాజిటివ్‌గా 197 కేసులు నమోదయ్యాయి. -
రోజంతా ముంచెత్తిన వాన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. అయితే తెల్లవారు జామునుంచే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై చెరువులను తలపించాయి. ఫలితంగా ఆయా రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కురుస్తాయనే ముందస్తు సమాచారంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. హైదరాబాద్ సమీప జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు సైతం నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు లోటు వర్షపాతంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సమీప జిల్లాలకు ఈ వర్షంతో భారీ ఊరట దక్కింది. రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం...ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవగా, దక్షిణ ప్రాంత జిల్లాల్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 7.31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 50.6 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, మంగళవారం నాటికి 58.27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 15శాతం అధికంగా వానలు కురిసినట్టు ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుంలాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.– భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముషీరాబాద్ పార్శిగుట్టకు చెందిన విజయ్‌కుమార్(43) వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. కారులు, బైకులు కూడా కొట్టుకొని పోయాయి. ఒక అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడి కొద్దిమేర ధ్వంసమై బీటల వారింది.పలు ప్రాంతాల్లో గోడలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి వరద పోటెత్తోంది. దీంతో మూసారాంబాగ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జంటజలాశయాల్లో సైతం భారీ వరద నీరు వచ్చి చేరింది.– ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వంద పడకల ఆస్పత్రి భవన ప్రాంగణం జలమయమైంది. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద రెండు అడుగుల వరద నీరు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గద్వాల జిల్లా అయిజ మండలంలో ఓ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. – రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉరకలెత్తాయి. లోతట్లు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. కడ్తాల్ మండలం మేడికుంట చెరువుకు గండి పడి, నీరంతా వృథాగా పోయింది. -
AP: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వర్షాలు అధికంగా ఉన్న కోస్తా జిల్లాలతో పాటు కనీస వర్షపాతం నమోదు కాని రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాయలసీమ జిల్లాల్లో సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత.. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. తాజా ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నట్టు జనం వాపోతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఉక్కపోత మరింత ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఉక్కపోత కారణంగా వేసవి తరహాలో గృహ విద్యుత్ వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీల వినియోగం ఆగస్టులో తీవ్రంగా పెరిగినట్టు తేలింది. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపానుకు రెండు రోజుల ముందు ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు ఉంటాయని చెబుతున్నారు. బంగాళాఖాతంలో పీడనం తగ్గినప్పుడు గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఓ మోస్తరుగా ఉన్నా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువ దాహంగా ఉండటం కనిపిస్తుందంటున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనంతపురంలోని రేకుల కుంట వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణ శాఖ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుపాను అనంతరం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. “గాలిలో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉక్కపోత ఉంటుంది. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో వాయు గుండం ప్రభావమే. వాతావరణంలో మార్పులు కూడా కొంత మేరకు ఈ పరిస్థితికి కారణం’ అని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త విజయశంకర్ బాబు తెలిపారు. -
Telangana: మరో రెండ్రోజులు వానలే..
సాక్షి, హైదరాబాద్: కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాతీరం చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. రానున్న ఆరు గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. జైసాల్మయిర్, కోట, గుణ, మాండ్ల, అంతర్గత ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఉపరితల ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కొనసాగుతున్నట్టు వివరించింది.రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. ఆదివారం రాష్ట్రంలో సగటున 3.32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 8.81, జగిత్యాల జిల్లాలో 7.01, నిర్మల్ జిల్లాలో 6.92, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6.83 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్లగొండ, గద్వాల జిల్లాలు మినహాయిస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 23.39 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఆదివారం నాటికి 36.43 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కంటే 33శాతం అధికంగా వానలు నమోదయ్యాయి. -
Telangana: కరువుతీరా వర్షాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: కరువుతీరేలా.. వరుణుడు కరుణించాడు. వానాకాలం ప్రారంభమైన నలభై రోజుల అనంతరం ఒకేసారి రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు వాగులు, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. పలుచోట్ల పంట పొలాల్లోకి నీరు చేరింది. శనివారం జిల్లాల వారీ గణాంకాలు పరిశీలిస్తే.. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో సగటున 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ములుగు జిల్లాలో 4.19 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4.0 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 12.15 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా అంతటా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా రెండురోజులుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా, ఇంకొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్ ప్రాంతంలో 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ముసురు వాన ఉండడంతో పలుచోట్ల వరి నారుమడులు, పత్తి చేన్లలో వరద నీరు నిలిచింది. పలుచోట్ల చెరువులు నిండి అలుగు పోస్తుండగా అక్కడక్కడా రహదారులు, లోలెవల్ బ్రిడ్జిలపైకి వరద చేరింది. ఉధృతంగా జంపన్న, ముసలమ్మ వాగులు ములుగు జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఏటూరునాగారం మండలంలోని కొండాయి, ఎలిశెట్టి గ్రామాల సమీపంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మర పడవలను ఏర్పాటు చేశారు. ఎలిశెట్టిపల్లి సమీపంలో జంపన్న వాగు ఉధృతి ఎక్కువ కావడం, దబ్బగట్ల శైలజ, పులిసె అనూష అనే గర్భిణులు పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో వారిని పడవల్లో వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. రామన్నగూడెం పుష్కరఘాట్‌కు 6 కిలోమీటర్ల దూరంలో కరకట్ట కోతకు గురవుతుండటంతో ఇరిగేషన్ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. మంగపేట మండలంలోని రాజుపేట ముసలమ్మవాగు వరద ఉధృతికి ఒడ్డు కోతకు గురవుతుండటంతో ఒడ్డు వెంట నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాజేడు మండల పరిధిలోని కొప్పుసూరు గుట్టల వద్ద ఉన్న గుండ్లవాగు ప్రాజెక్టు కట్ట ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షించారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోతుల్వాయి సమీపంలోని బొర్రవాగు, గుండ్రాత్‌పల్లి సమీపంలోని అలుగువాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద కాజ్‌వేల పైనుంచి వెళ్తుండడంతో పలు గ్రామాలకు మండలం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పత్తి చేలల్లోకి వరద నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వర్షాలతో మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి, మైన్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తిలు తెలిపారు. వర్షాల కారణంగా 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ, 6 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. గోదావరిలో కలెక్టర్, ఎస్పీ బోటు ప్రయాణం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, పలిమెల మండలాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పర్యటించారు. గోదావరిలో బోటులో ప్రయాణించి వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుండి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మారుమూల గ్రామమైన దమ్మూరుకు చేరుకొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్రి–సాంగిడి దారి మూసివేత ఎడతెరిపిలేని వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఉమ్రి వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ఉమ్రి–సాంగిడి దారిని పోలీసులు మూసి వేశారు. రెండు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగుపై కొత్త బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, తాత్కాలిక వంతెన గుండానే రాకపోకలు కొనసాగుతున్నాయి. 60 గ్రామాలకు నిలిచిన రాకపోకలు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలోని ఎల్లంపల్లి, ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు మండలాల్లో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ప్రాంతాల్లోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కైరిగూడ, డొర్లి ఏరియాల్లోని ఓపెన్ కాస్టుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి రూ.కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలో అత్యధికంగా 65.5మి.మీ వర్షపాతం నమోదైంది. ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ వెళ్లే మార్గంలో రెంకోనివాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలో 13.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శనివారం రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కమ్మర్‌పల్లిలో 34.3 మిల్లీమీటర్లు, మెండోరాలో 28.0, నవీపేట్లో 27.5, బాల్కొండలో 24.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాలమూరులో ముసురు వాన వనపర్తి జిల్లాలో 2.7 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లాలో 2.69, మహబూబ్‌నగర్ జిల్లాలో 2.49, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2.04, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.42 సెంమీటర్ల వర్షపాతం నమోదైంది.ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా మహమ్మదాబాద్ మండలంలో 4.9 సెంమీ వర్షపాతం నమోదైంది. కొత్తకోట, జడ్చర్ల, ఆత్మకూరులో ముసురు వర్షానికి తడిసిన మట్టి ఇళ్లు కూలిపోయాయి. వీడని ముసురు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులుగా ముసురు కొనసాగుతోంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో శనివారం 1.43 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవగా కడ్తాలలో అత్యల్పంగా 0.95 సెంటీమీటర్లు నమోదైంది. వికారాబాద్ జిల్లాలోని పలు వాగులు ఉరకలెత్తుతున్నాయి. సగటు వర్షపాతం కంటే ఎక్కువగా.. శనివారం రాష్ట్రంలో 1.79 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోంది. శనివారం 0.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా రెట్టింపు వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో భాగంగా జూన్1 నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతం 26.46 సెంటీమీటర్లు కాగా, ఇప్పటివరకు 33.11 సెంటీమీటర్ల వర్షపాతం (25 శాతం అధికం) నమోదైంది. గతేడాది ఇదే సీజన్లో 32.84 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత నైరుతి సీజన్లో శనివారం నాటికి రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం, నాగర్‌కర్నూల్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ములుగు, కరీంనగర్, సూర్యాపేట, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురిసింది. మిగిలిన జిల్లాలో గడిచిన నాలుగు రోజుల క్రితం వరకు సాధారణం కంటే తక్కువ నమోదైనా.. శుక్ర, శనివారాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ శనివారం రాత్రి ప్రకటించింది. వాయుగుండానికి తోడు ఉపరితల ద్రోణి పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం మరింత ముందుకు సాగి ఒడిశాలోని చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండురోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. నేడు అతిభారీ, అత్యంత భారీ వర్షాలు!ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఆ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. -
5 రోజులు వానలే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపుగా కదులుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించి ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి విదర్భ, గోపాల్పూర్ మీదుగా ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతం వరకూ విస్తరించి ఉంది.వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. మరో అల్పపీడనం ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. 19న మరో అల్పపీడనం!ఈ నెల 19 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది ఏర్పడితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేకచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం జిల్లా మెరకముడిదంలో మంగళవారం మధ్యాహ్నం 3.30 సెంటీమీటర్ల వర్షం కురిసింది.గజపతినగరం మండలం ముచ్చర్లలో 2.8 సెం.మీ., అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 2.6 సెం.మీ. వర్షం పడింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో 6.8 సెం.మీ. వర్షం కురిసింది. అదే జిల్లా కృత్తివెన్ను మండల కేంద్రంలో 6.6, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 5.9, కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలో 5.8, బాపట్ల జిల్లా రేపల్లె మండలం కామరాజుగడ్డలో 5.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఈ నెలలో వరుస అల్పపీడనాలు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: జూలై నెలలోకి అడుగుపెట్టినా సరైన వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. వాతావరణం పూర్తిగా అనుకూలిస్తే ఈ అల్పపీడనాలు ఏర్పడి, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది మరింత బలపడి అల్పపీడనంగా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు.. ఈ నెల 15న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి, ఏపీ వైపుగా వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు 23న తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడే ఆవర్తనం అల్పపీడనంగా బలపడే సూచనలున్నాయని, ఇది క్రమంగా వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా వరుసగా ఏర్పడే ఆవర్తనాలు, అల్పపీడనాలతో రాష్ట్రంలో ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని చెబుతున్నారు. ఇవి లోటు వర్షపాతం నుంచి అధిక వర్షపాతాన్ని నమోదు చేస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలైనందున, ఈ వర్షాలు అన్నదాతలకు మేలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ద్రోణి ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ, యానాం మీదుగా నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో పలు చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ⇒ మంగళవారం శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ⇒ బుధవారం అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ⇒ గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ⇒ జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం 99.4 మిల్లీ మీటర్లు నమోదుకావాల్సి ఉండగా 162.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 19 జిల్లాల్లో అత్యధిక, 5 జిల్లాల్లో అధిక, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. -
గతేడాదిని మించి వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: గతేడాదిని మించి ఈ ఏడాది వడగాడ్పులు హడలెత్తించాయి. గతేడాది వేసవిలో 17 రోజులు వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీచినట్టు నమోదైంది. అయితే ఈసారి వడగాడ్పుల సంఖ్య 18కి పెరిగింది. అంతేకాకుండా గతేడాది ఉష్ణోగ్రతలు గరిష్టంగా 47 డిగ్రీల వరకు నమోదు కాగా ఈ ఏడాది 48 డిగ్రీల వరకు చేరుకున్నాయి. గతేడాది వేసవి దడ పుట్టించిందనుకుంటే ఈసారి అంతకు మించి హడలెత్తించింది. సాధారణం కంటే దాదాపు మూడు రెట్ల వడగాడ్పులతో జనాన్ని బెంబేలెత్తించింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ ఆరంభం నుంచే వడగాడ్పులు మొదలయ్యాయి. ఆ నెలలోనే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకున్నాయి. మే నెల రెండో వారం, మూడో వారంలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తూ ఉష్ణతాపాన్ని కాస్త తగ్గించాయి. ఫలితంగా వడగాడ్పుల తీవ్రత ఒకింత తగ్గినట్టు కనిపించింది. సాధారణంగా ఏప్రిల్, జూన్కంటే మే నెలలోనే వేసవి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా మే నెలలో వర్షాలు కురవడం వల్ల ఏప్రిల్‌కంటే తక్కువ వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను చూసి మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కానీ మే నెల మధ్య మధ్యలో ఆవర్తనాలు, ద్రోణులు, తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకే పరిమితమయ్యాయి. ఇలా ఈ వేసవి మూడు నెలలూ 18 రోజుల పాటు వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. ఇందులో ఏప్రిల్‌లో ఎనిమిది రోజులు (5, 6, 7, 8, 24, 28, 29, 30 తేదీలు), మే నెలలో ఏడు రోజులు (1, 2, 3, 4, 5, 28, 31 తేదీలు), జూన్‌లో మూడు రోజులు (1, 17, 18 తేదీలు) వడగాడ్పులు ప్రభావం చూపాయి. స్తబ్దుగా నైరుతి రుతుపవనాలునైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ముందుగా అటు కేరళలోకి, ఇటు రాష్ట్రంలోకి ప్రవేశించినా అవి ఉత్తర కోస్తాలోకి విస్తరించాక దాదాపు పది రోజుల పాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో జూన్ మూడో వారం వర్షాలు కురవాల్సిన సమయంలో రెండు రోజుల (17, 18 తేదీల్లో) పాటు వడగాడ్పులు మళ్లీ చెలరేగాయి. ఈ దఫా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పులు దడ పుట్టించాయి. ప్రధానంగా నంద్యాల, కర్నూలు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఎక్కువగా వడగాడ్పులను ఎదుర్కొన్నాయి. -
కోస్తాంధ్రపై కొనసాగుతున్న ఆవర్తనం
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు, శుక్ర, శనివారాల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయని పేర్కొంది. -
జూన్‌లో లోటు వర్షపాతమే!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. జూన్ నెల మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి ఆ తర్వాత అత్యంత చురుకుగా కదిలి ఈనెల 14వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. కానీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం రుతుపవనాల కదలికలు మందగమనంలోనే ఉన్నాయి. దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నెలకు సంబంధించిన అంచనాలను ఐఎండీ తాజాగా విడుదల చేసింది. ఈ నెలలో రాష్ట్రంలోని చాలాచోట్ల లోటు వర్షపాతం నమోదయ్యే పరిస్థితులే కనిపిస్తున్నట్లు తెలిపింది. నెలాఖరులో వర్షాలు కురుస్తాయని, సాధారణ వర్షపాతానికి దగ్గరగా గణాంకాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ మొత్తం మీదా చాలాచోట్ల లోటు ఉంటుందని ప్రకటించింది. 8 జిల్లాల్లో సాధారణం..11 జిల్లాల్లో లోటు జూన్ నెలలో ఇప్పటివరకు 7.85 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. బుధవారం ఉదయానికి 8.53 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 9 శాతం అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల చివరి వారంలో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, తూర్పు ప్రాంత జిల్లాల్లోనే ఇందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 7 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక 11 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. మంచిర్యాలలో లోటు ఎక్కువగా నమోదైంది. రానున్న రెండ్రోజుల్లో వర్షసూచన ప్రస్తుతం కోస్తాంధ్రను ఆనుకుని తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉందని, దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.జూన్‌లో ఇప్పటివరకు జిల్లాల వారీగా వర్షపాతం.. » తీవ్ర లోటు (–60% నుంచి –99%): మంచిర్యాల » లోటు(–20% నుంచి –59%): ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి » సాధారణం(+19% నుంచి –19%): వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, ఖమ్మం » అధికం(+20% నుంచి +59%): మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నారాయణపేట » అత్యధికం(+60% పైబడి): హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ జూన్‌లో సాధారణ వర్షపాతం : 12.94 సెంటీమీటర్లు బుధవారం నాటికి కురవాల్సిన వర్షం : 7.85 సెంటీమీటర్లు నమోదైన వర్షపాతం : 8.53 సెంటీమీటర్లు సాధారణం కంటే 9 శాతం అధికంగా నమోదు -
రానున్న రెండ్రోజులు ఉత్తర జిల్లాల్లో వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. శనివారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 39.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. -
రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెల 3న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా వ్యాప్తి చెందుతూ వారం రోజుల వ్యవధిలో రాష్ట్రమంతటా వేగంగా విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రుతుపవనాల వ్యాప్తి సమయంలోనే రాష్ట్రంలో తొలకరి వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో గత పదిరోజుల్లో సంతృప్తికర స్థాయిలో వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో ఈనెల 12 నాటికి 3.81 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..6.01 సెం.మీ. నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 55% అధికంగా నమోదైంది. ప్రస్తుతం మోస్తరు వర్షాలే కురవగా..ఈనెల మూడో వారం నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావర ణ శాఖ నిపుణులు అంచనా వేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సంతృప్తికరంగా, 4 జిల్లాల్లో మధ్యస్థంగా, 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా... ఆదిలాబాద్, మంచిర్యా ల. నిర్మల్, పెదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రెండ్రోజులు పలుచోట్ల మోస్తరు వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావ రణ శాఖ వెల్లడించింది. ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈక్రమంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా ఖమ్మంలో 37.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో అత్యధికంగా 20.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. బుధవారం జనగామ జిల్లా జఫర్గడ్లో అత్యధికంగా 4.06 సెం.మీ., సూర్యాపేట జిల్లా మునగాల, పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఆదిలాబాద్ మినహా అంతటా అత్యల్పమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తుండటం.. పలుచోట్ల వానలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా దాదాపు అన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 39.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 22.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదు కాగా, హనుమకొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయింది. మిగతా ప్రాంతాల్లో కూడా 3 డిగ్రీలు తక్కువగా నమోదు అయింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించాయి. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పతనమయ్యాయయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడం గమనార్హ. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఊపందుకోవడం.. దీనికితోడు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రానున్న మూడురోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ పరిసర ప్రాంతం వరకు విస్తరించినట్లు నిపుణులు చెబుతున్నారు.రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని చాలాప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 22.0 డిగ్రీ ల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
నేడు, రేపు పలుప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్నాయని వివరించింది. రానున్న మూడు రోజుల్లో ఇవి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులున్నట్లు వెల్లడించింది. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో గరిష్టంగా 40.3 డిగ్రీల సెల్సియస్, హనుమకొండలో 23.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. -
రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఉత్తర జిల్లాల్లో విస్తరించాయి. రానున్న 3 రోజుల్లో పూర్తిస్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల కదలికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెద క్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉక్కపోత కూడా క్రమంగా తగ్గుతోంది. గురువారం చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు, కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 40.1 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.3 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి. -
తెలంగాణలోకి నైరుతి వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వాతావరణ శాఖ ఈ నెల 5 నాటికి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసింది. కానీ వాతావరణ పరిస్థితులు కలసిరావడంతో సోమవారమే నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు వచ్చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 4,5 రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించే అవకాశం ఉందన్నారు. గత ఏడాది కరువు ఛాయలతో.. గతేడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 22న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆ తర్వా త కూడా ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. వర్షాల మధ్య తీవ్ర అంతరంతో చాలా ప్రాంతాల్లో కరువు ఛాయలు కనిపించాయి. పంటల సాగు, దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. అంతకుముందు 2022 వానాకాలంలో రుతుపవనాలు జూన్ 8న ప్రవేశించాయి. ఆ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. సాధారణ వర్షపాతం కంటే దాదాపు 48శాతం అధికంగా నమోదయ్యాయి. రెండు రోజుల పాటు వానలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం కూడా కొనసాగింది. దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. చాలాచోట్ల సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజులు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని పేర్కొంది. -
వేగంగా నైరుతి
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రెండు రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారానికి ఇవి రాయలసీమలోకి ప్రవేశిస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, త్రిపుర, మేఘాలయ, అస్సాంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ప శ్చిమ బెంగాల్, సిక్కింలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే రెండు రోజుల్లో అరేబియా సముద్రంలోని పలు భాగాలు, లక్షదీ్వప్, కేరళ, కర్ణాటక, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో రుతు పవనాలు ప్రవేశించే వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. రెమల్ తుపాను ప్రభావంతో గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఎండ, ఉక్కపోత ప్రభావం ఎక్కువగా ఉంటోంది. రుతు పవనాలు ముందుగా ప్రవేశించనుండటంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత మిగిలిన ప్రాంతాల కంటే కొంచెం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నారు. అవి పురోగమించకపోతే ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.ఏదేమైనా మరో రెండు, మూడు రోజులు ఎండల తీవ్రత ఉంటుందని, ఆ తర్వాత వాతావరణం చల్లబడి వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో 45.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45.3, గుంటూరు జిల్లా తుళ్లూరు, ఫిరంగిపురంలో 45, బాపట్ల జిల్లా పర్చూరులో 44.8, నెల్లూరు జిల్లా జలదంకిలో 44.4, కృష్ణా జిల్లా కోడూరులో 44.2, అల్లూరి జిల్లా కూనవరంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొద్ది రోజులు ఎండల్లో తిరగొద్దు రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశిస్తున్నప్పటికీ, మరోవైపు ఎండల తీవ్రత మరికొద్ది రోజులు కొనసాగనుంది. ఈ తరుణంలో వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠిన పనులను ఎండలో చేయరాదని వైద్యులు సూచిస్తున్నారు. నేడు అక్కడక్కడ వడగాడ్పులు, వర్షం శనివారం విజయనగరం జిల్లాలో 6, పార్వతీపురం మన్యం జిల్లాలోని 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 43 మండలాల్లో ఓ మోస్తరు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం నుంచి మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశి్చమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ప రుతు పవనాలుమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వేసవి భగభగ ఈ ఏడాది వేసవి ఆద్యంతం అగ్ని గుండంగానే కొనసాగింది. గతానికి భిన్నంగా మార్చి మూడో వారం నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అప్పట్నుంచే వడగాడ్పులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ మొదటి వారానికల్లా ఉష్ణోగ్రతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. సాధారణం కంటే 5–8 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని 358 మండలాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. మే నెల మధ్యలో నమోదు కావలసిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండో వారంలోనే రికార్డయ్యాయి. ఏప్రిల్ 8న మార్కాపురంలో 46 డిగ్రీలు, మే 2న 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 3న నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజనులో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఆ తర్వాత కూడా పగటి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో వర్షాలు కురిసి ఉష్ణ తీవ్రతను కాస్త తగ్గించినా, రెండు మూడు రోజుల్లోనే మళ్లీ యథా స్థితికి చేరుకున్నాయి. ఇలా ఒకపక్క అధిక ఉష్ణోగ్రతలు, మరోపక్క వడగాడ్పులు పోటీ పడుతూ జనాన్ని బెంబేలెత్తించాయి. ఈ వేసవిలో రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 5–9 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఏప్రిల్ 17న ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 33.4 డిగ్రీలు, కర్నూలులో 32, కడపలో 31 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మే నెలలో రాత్రిళ్లు పలుమార్లు 31–34 డిగ్రీల వరకు నమోదయ్యాయి. -
జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి
సాక్షి, హైదరాబాద్: కేరళలోకి గురువారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈలోగా పగటి ఉష్ణోగ్రతలు మరికొంత పెరగొచ్చని పేర్కొన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం పశ్చిమ, వాయవ్య దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మంచిర్యాల జిల్లా భీమారంలో అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతగా నమోదైంది. ఇప్పటివరకు ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అలాగే భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గరిమెల్లపాడులో 47.1 డిగ్రీల సెల్సియస్, కమాన్‌పూర్‌లో 46.7, కుంచవల్లిలో 46.6, కాగజ్‌నగర్, పమ్మిలో 46.5, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత నమోదైంది. చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. -
రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోకి రుతుపవనాలు!
సాక్షి, విశాఖపట్నం: ఉక్కపోత, భానుడి భగభగలతో విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే చల్లటి కబురిది. గురువారం కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ 2, 3 తేదీలనాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, నేడు, రేపు కోస్తా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. -
రోహిణి భగభగలు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిత్రమైన వాతావరణ పరిస్థితి కొనసాగుతోంది. పగలంతా ఎండలు మండిపోతుండగా, రాత్రికి మాత్రం కాస్త చల్లని వాతావరణం నెలకొంటోంది. సాధారణంగా రోహిణి కార్తెలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీనికి తోడు తీవ్రమైన ఉక్కపోత చిరాకు కలిగిస్తుంటుంది. అయితే ప్రస్తుతం రోహిణి కార్తె ప్రవేశించి 5 రోజులు కావస్తున్నా ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదవుతున్నాయి. రోహిణి కార్తెలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ అధికంగా..అంటే 43 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. కానీ ఈసారి కాస్త తక్కువగా నమోదవుతుండటం గమనార్హం. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రెండు మూడు చోట్ల 43కు అటుఇటుగానే నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. హనుమకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు అయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. రోహిణి కార్తెలో సాధారణంగా 30 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో తక్కువగా 25, 26, 27 డిగ్రీల మేరకే నమోదు అవుతున్నాయి. బుధవారం కనిష్టంగా నల్లగొండలో 25.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంతోనే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలావుండగా రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 46.4 డిగ్రీ సెల్సీయస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, బెల్లంపల్లిలో 45.8, ఆసిఫాబాద్‌లో 45.2 డిగ్రీ సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు కేరళను తాకనున్న నైరుతి బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు గురువారం కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. కేరళను తాకిన వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించి ఆ తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది. -
ఉడుకుతున్న ఉత్తరాది
న్యూఢిల్లీ/కొచ్చి: ఆదిత్యుని ఆగ్రహ కిరణాలకు ఉత్తరభారతం ఎండలతో భగభగ మండుతోంది. వడగాలులు తోడవడంతో వేసవికాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో మంగళవారం దాదాపు 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముంగేశ్‌పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీ సెల్సియస్, నజఫ్గఢ్లో 49.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే 9 డిగ్రీసెల్సియస్ ఎక్కువ ఉండటం గమనార్హం.ఉత్తర ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, పంజాబ్‌లోనూ ఎండలు ఇలాగే మండిపోయాయి. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 50.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ. హరియాణాలోని సిర్సాలో 50.3, హిసార్, పంజాబ్‌లోని భటిండాలో 49.3, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణంలో 49, ప్రయాగ్‌రాజ్‌లో 48.2, వారణాసి, కాన్పూర్‌లో 47.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్‌లోనూ నాలుగైదు ప్రాంతాల్లో 48 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రత రికార్డయింది. కేరళలో భారీ వర్షాలు ఉత్తరాది ప్రజలు ఉక్కపోతతో చెమట చిందిస్తుంటే దక్షిణాదిన కేరళలో భారీ వర్షాలతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. ఈదురుగాలులతో కూలిన భారీ వర్షం కేరళ దక్షిణ, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేసింది. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు కూలిపోయాయి. దీంతో కొందరు పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారు. చాలా జిల్లాల్లో పర్యాటక కేంద్రాలను మూసేశారు. కొండ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిషేధించారు.కొచ్చి సిటీ, ఎర్నాకులం జిల్లాల్లో గంటల తరబడి వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొచ్చిలోని కలమసెర్సీ ప్రాంతంలో వందలాది ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. మీనాచిల్, కొల్లియార్ నదుల్లో నీటిమట్టాలు పెరిగాయి. అరవిక్కర, మలాంకర డ్యామ్‌ల గేట్లను స్వల్పంగా ఎత్తారు. జలాశయాలు ఉప్పొంగడంతో శివారు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. తిరువనంతనపురంలోని ముథలపోజీ తీరం వద్ద భారీ అల కారణంగా పడవ బోల్తాపడి మత్స్యకారుడు చనిపోయాడు. -
‘నైరుతి’ వచ్చేస్తోంది
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈనెల 31 నాటికల్లా ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమ వారం తెలిపింది. నిరీ్ణత సమయానికి మూడ్రోజులు ముందుగా అంటే ఈనెల 19న అండమాన్ సముద్రంలోకి ఈ రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇవి చురుగ్గా కదులుతుండగా సోమవారం నాటికి బంగాళాఖాతం, శ్రీలంకలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. అలాగే, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేనెల 1, 2 తేదీల్లో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.వాతావరణ పరిస్థితులు ఏమైనా మారితే ఒకట్రెండు రోజులు ఆలస్యమై 3, 4 తేదీల నాటికి రాష్ట్రంలో ప్రవేశించే అవకాశముంది. మొత్తంగా ఐదో తేదీలోపే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రుతు పవనాలు చురుగ్గా ఉండడంతో వచ్చేనెల మొదటి వారంలో రాయలసీమలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. రెమల్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఈ తుపాను బంగ్లాదేశ్ వైపు కదిలి ఆ పరిసరాల్లోనే తీరం దాటడంతో రుతు పవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండ్రోజుల్లో అవి చురుగ్గా కదిలాయి. రైతులకు ఎంతో ఊరట.. జూన్‌లో రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు కురవనున్నాయని సోమవారం విడుదల చేసిన రెండో దశ దీర్ఘకాలిక నెలవారీ అంచనా నివేదికలో ఐఎండీ పేర్కొంది. ఈ సమాచారం రైతాంగానికి ఎంతగానో ఊరటనిస్తోంది. గత ఏడాది వారం రో జులు ఆలస్యంగా అంటే జూన్ 8న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. అనంతరం వర్షాలు అరకొరగానే కురిశాయి. పైగా రాష్ట్రంలో జూన్ అంతా మే నెలను తలపించేలా వడగాడ్పులు కొనసాగాయి.ఫలితంగా జూన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఖరీఫ్ పనులు ముందుకు సా గలేదు. ఆపై జూలై, ఆగస్టుల్లో సకాలంలో వర్షాలు కురవలేదు. దీంతో గతేడాది రైతులకు నైరుతి రుతుపవనాలు నిరాశను, నష్టాలను మిగిల్చాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితులు అందుకు భిన్నంగా, అనుకూలంగా మారుతున్నాయి. ఎల్‌నినో బలహీనపడుతూ జూన్ మధ్య నుంచే లానినా పరిస్థితులేర్పడుతున్నాయి. దీంతో వర్షాలు పుష్కలంగా కురవడానికి దోహద పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మూడ్రోజులు వడగాడ్పులు.. ఇదిలా ఉంటే.. రెమాల్ తీవ్ర తుపాను ఫలితంగా గాలిలో తేమను తుపాను ప్రాంతం వైపు లాక్కుపోయింది. దీంతో.. రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. దీనికి తోడు రోహిణి కార్తె కూడా రెండ్రోజుల క్రితమే మొదలైంది. వీటివల్ల రానున్న మూడ్రోజులు సాధారణంకంటే 4–8 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గరిష్టంగా కొన్నిచోట్ల 49 డిగ్రీల వరకు రికార్డయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల మళ్లీ వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. టకాగా, మంగళవారం 149 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 160 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో 22, విజయనగరం 27, పార్వతీపురం మన్యం 15, అల్లూరి సీతారామరాజు 2, విశాఖపట్నం 6, అనకాపల్లి 20, కాకినాడ 18, కోనసీమ 7, తూర్పు గోదావరి 18, పశి్చమ గోదావరి 4, ఏలూరు 7, బాపట్ల 1, కృష్ణా 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ⇒ అలాగే, వడగాడ్పులు శ్రీకాకుళం జిల్లాలో 8, అల్లూరి 8, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 3, కోనసీమ 8, తూర్పుగోదావరి 1, పశ్చిమ గోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎనీ్టఆర్ 17, గుంటూరు 17, పల్నాడు 15, బాపట్ల 20, ప్రకాశం 6 మండలాల్లోను వీయనున్నాయని వివరించింది. ⇒ ఇక బుధవారం 195 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 147 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ⇒ సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడులో 41.9, మనుబోలు (నెల్లూరు) 41.5, వేమూరు (బాపట్ల), పెడన (కృష్ణా) 40.9, చింతూరు (అల్లూరి) 40.8, డెంకాడ (విజయనగరం) 40.7, రావికమతం (అనకాపల్లి) 40.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ సీజన్లో వర్షాలే వర్షాలు.. ఈ సీజన్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతాలు నమోదవుతాయని తెలిపింది. రుతు పవనాలు వేగంగా విస్తరిస్తుండడంతో మంచి వర్షాలకు అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఐఎండీ ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. అలాగే, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, వాయవ్య భారతంలో సాధారణ వర్షపాతం, మధ్య, దక్షిణ భారతదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం ఢిల్లీలో జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో అంచనా వేశారు. జూన్–సెప్టెంబర్ కాలంలో దీర్ఘకాల సగటు 87 సెం.మీ. వర్షపాతంలో 106 శాతం మేర వర్షపాతం నమోదుకావచ్చన్నారు. -
ఐదు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు మధ్య బంగాళాఖాతంలో చురుకుగా కదులుతున్నాయి. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు బంగాళాఖాతంలో పూర్తిగా విస్తరించి కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వారాంతంలోగా కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఆరు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. రుతుపవనాల కదలికల ఆధారంగా రాష్ట్రంలోకి ప్రవేశించే సమయం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. చాలా చోట్ల సాధారణం.. కొన్నిచోట్ల అత్యధికం..ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనవల్ల రానున్న రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవగా కొన్నిచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జంబూగలో 45.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 44.9, జగిత్యాల జిల్లా తిర్యాణిలో 44.9, ఆసిఫాబాద్ జిల్లా వెల్గటూరులో 44.8, జగిత్యాల జిల్లా జైనలో 44.7, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 44.7 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
రాష్ట్రంలో మళ్లీ పెరిగిన వేడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. శనివారం నిర్మల్ జిల్లా కుబీర్‌లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 44.9 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లా డోంగ్లి 44.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 44.7 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్ జిల్లా వయల్పూర్ 44.6 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా నమోదయ్యే అవకాశముందని వివరించింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే....గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 44.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో 25.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదైంది. తీవ్ర వాయుగుండంగా మారిన వాయుగుండం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు తెలిపింది.శనివారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం అదిలాబాద్ 44.0 మెదక్ 42.7 నిజామాబాద్ 42.4 హైదరాబాద్ 39.9 హకీంపేట్ 39.8 నల్లగొండ 39.5 దుండిగల్ 39.5 రామగుండం 38.8 హనుమకొండ 38.0 మహబూబ్‌నగర్ 37.5 ఖమ్మం 36.0 భద్రాచలం 31.6 -
India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రాజస్తాన్‌లో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నా యి. రాజస్తాన్‌లోని ఫలోదీలో తాజాగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత రికా ర్డు కావడం ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2019 జూన్ 1న రాజస్తాన్‌లోని చురూలో 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఈశాన్యంలోని అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ ఎండల ధాటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాజస్తాన్‌లోని బార్మర్‌లో 48.8, జైసల్మేర్‌లో 48, బికనెర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. పశి్చమ బెంగాల్‌లోని కూచ్ బెహార్లో 40.5 డిగ్రీలు, అస్సాంలోని సిల్చార్‌లో 40, లుమిడింగ్‌లో 43, అరుణాచల్‌లోని ఈటానగర్‌లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
తుపానుగా మారిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 12 కి.మీ. వేగంతో ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర బంగాళాఖాతం మీదుగా శనివారం రాత్రి సమయంలో తుపానుగా మారింది. దీనికి రెమల్ అని నామకరణం చేశారు. రెమల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. తుపాను క్రమంగా ముందుకు కదులుతూ ఆదివారం ఉదయానికి ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ని ఆనుకుని ఉన్న పశి్చమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 135 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.పలుచోట్ల జల్లులు.. అక్కడక్కడా వర్షాలుమన రాష్ట్రంపై తుపాను ప్రభావం లేకపోయినా.. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసి పడుతున్నాయి. తీరంలో చీకట్లు కమ్ముకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కవిటి మండలంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంత ఇళ్లలో నీరు చేరింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు పడ్డాయి. తెనాలిలో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో అత్యధికంగా 86.4 మి.మీ. భారీ వర్షం కురిసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని 18 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలంలో 72.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 41.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనూ జోరు వాన కురిసింది. పల్నాడు జిల్లాలో శనివారం అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి. జిల్లా మొత్తం చల్లటి వాతావరణం ఏర్పడింది. నరసరావుపేటలో తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిసింది.చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి పట్టణం, గ్రామాల్లో జల్లులు పడ్డాయి. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఏజెన్సీ ప్రాంతం, నూజివీడు, కైకలూరు, ఆచంట, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో తుంపర్ల వర్ష కురిసింది. కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దేవనకొండలో 62.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
బంగాళాఖాతంలో నేడు తుపాను
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఇది ఈశాన్య దిశగా పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు దక్షిణ నైరుతి దిశలో 700 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో శనివారం ఉదయానికి తుపానుగా మారనుంది. అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ శనివారం రాత్రికి తీవ్ర తుపానుగా బలపడనుంది. తరువాత అదే దిశలో కదులుతూ ఆదివారం అర్థరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాల మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.దీని ప్రభావంతో శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లోను, ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కర్నూలు జిల్లాలో 14.7 సెంటీమీటర్ల వర్షపాతం శుక్రవారం కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా తళ్లగోకులపాడులో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడలో 10.3, యలమంచిలి (అనకాపల్లి జిల్లా) 4.5, నెల్లిమర్ల (విజయనగరం) 4.3, చింతపల్లి (అల్లూరి సీతారామరాజు)లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మళ్లీ వడగాడ్పుల ఉధృతి తుపాను ప్రభావం రాష్ట్రంపై లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వడగాడ్పులు క్రమంగా ఉధృతమవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో తొమ్మిది మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శనివారం 35 (విజయనగరం జిల్లాలో 15, శ్రీకాకుళంలో 10, పార్వతీపురం మన్యంలో 5, అనకాపల్లిలో 5) మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 14 (పార్వతీపురం మన్యం జిల్లాలో 6 శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 4) మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 64 (విజయనగరం జిల్లాలో 20, శ్రీకాకుళంలో 17, పార్వతీపురం మన్యంలో 8, కృష్ణాలో 7, అనకాపల్లిలో 6, విశాఖపట్నంలో 2, ఏలూరులో 2, తూర్పు గోదావరిలో 1, బాపట్లలో 1) మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
మళ్లీ సుర్రుమన్న ‘సూరీడు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని రోజులుగా చల్లబడ్డ వాతావరణం కాస్తా మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంపై సూరీడు సుర్రుమంటూ విరుచుకుపడ్డాడు. తెలంగాణను నిప్పుల కుంపటిలా మార్చాడు. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.అలాగే మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 44.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 44.5, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 44.4, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 26న బంగ్లాదేశ్‌లో తీరం దాటనున్న తుపాను పశి్చమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదిలి శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్‌లోని ఖేర్పురకు దక్షిణ నైరుతి దిశలో 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈ వాయుగుండం ఈశాన్య దిశలోనే కదులుతూ మరింత బలపడి శనివారం ఉదయానికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు తెలిపింది.క్రమంగా ఉత్తర దిక్కులో కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి ఈ నెల 26న అర్ధరాత్రికల్లా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలోని సాగర్ ఐలాండ్ ఖేర్పుర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావం ఉత్తర తెలంగాణ ప్రాంతంపై అతితక్కువగా ఉంటుందని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరమధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.శుక్రవారం ప్రధాన కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం ఆదిలాబాద్ 42.8 మహబూబ్‌నగర్ 41.5 రామగుండం 41.4 నల్లగొండ 40.5 మెదక్ 40.2 హైదరాబాద్ 39.7 ఖమ్మం 39.4 నిజామాబాద్ 39.3 భద్రాచలం 37.0 హనుమకొండ 36.8 -
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా 25వ తేదీ ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపానుగా, ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 26 నాటికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు వివరించింది. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా హనుమకొండ 21.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. ప్రణాళికా విభాగం వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా అర్లి ప్రాంతంలో గరిష్టంగా 44.4 డిగ్రీ సెల్సీయస్, కామారెడ్డి జిల్లా డొంగ్లిలో 43.1 డిగ్రీ సెల్సీయస్, నిజామాబాద్ జిల్లా కల్దుర్కిలో 42.9 డిగ్రీ సెల్సీయస్, మంచిర్యాల జిల్లా వెల్గటూరులో 42.8 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. అయితే గురువారం సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుని తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.నేడు, రేపు కొన్నిచోట్ల వడగాడ్పులుమరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు వడగాడ్పులు వీయనున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం మన్యం 11, కాకినాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోను, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాలో రెండు చొప్పున 24 మండలాల్లోనూ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
విస్తరిస్తున్న ‘నైరుతి’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల విస్తరణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రం, మాల్దీవులు, కొమరిన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇవి రానున్న రెండు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, కొమరిన్, అండమాన్, నికోబార్ దీవుల్లోని మిగిలిన భాగాలకు విస్తరించనున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి, నైరుతి దిశగా వంగి ఉంది.అలాగే దక్షిణ కోస్తా తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్నాటక వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఉంది. మరోపక్క రాష్ట్రంపైకి ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ప్రధానంగా మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో, బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను వర్షాలు కురవవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.అదే సమయంలో అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు మంగళవారం 28 మండలాల్లో వడగాడ్పలు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాల్లో, విజయనగరం 6, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఓబులదేవర చెరువు (శ్రీసత్యసాయి) వద్ద 5.5 సెంటీమీటర్లు, వెదురుకుప్పం (చిత్తూరు) 3.8, మండపేట (కోనసీమ) 3.3, కొత్తవలస (విజయనగరం) 3, పులివెందుల (వైఎస్సార్) 2.9, నిడదవోలు (తూర్పు గోదావరి), అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు)ల్లో 2.8, చింతలపూడి (ఏలూరు), నర్సీపట్నం (అనకాపల్లి)ల్లో 2.6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. 22న అల్పపీడనం ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 24వ తేదీకి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది.