సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. తీవ్రవాయుగుండంగా కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో వాయుగుండం కదిలింది. రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని.. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 610 కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్నంకి 850 కి.మీ, కాకినాడకి 840 కి.మీ, గోపాల్‌పూర్ కి 950 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని.. రేపు, ఎల్లుండి(సోమ, మంగళ కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

మోంథా తుఫాన్.. కాకినాడ వైపు దూసుకొస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. తుపాన్‌ను ఎదుర్కోనేందుకు సన్నద్ధమయ్యారు. కాకినాడ- ఉప్పాడ రోడ్డులో ఈనెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. హోప్ ఐలాండ్‌లో నివాసం ఉంటున్న మత్స్యకారులను తీరానికి తరలిస్తున్నారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అధికారులు, సిబ్బందికి సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. తుపాను సహయక చర్యల కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా: తుపాను ప్రభావంతో పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాగులు వద్దకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూయించివేసిన పోలీసులు.. సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశారు.
విజయవాడ: భారీవర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 27, 28 ,29వ తేదీల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు రేపు సాయంత్రంలోగా (ఈనెల 26) ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశాలిచ్చారు.



