తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. తీవ్ర తుపానుగా మోంథా
ఆగ్నేయ బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా క్రమక్రమంగా బలపడుతోంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి ఆ తరవాత తుఫాన్ గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే.. బంగాళాఖాతంలో 27 నాటికి తీవ్ర తుఫాన్ మోంథాగా రూపాంతరం చెందనుంది. ఈ ప్రభావంతో గరిష్టంగా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. మోంథా ప్రభావంతో.. ఏపీ తీరానికి తీవ్ర తుపాను ఉండే అవకాశం ఉందని, ఈనెల 28న కాకినాడ దగ్గర తీరం దాటుందని తెలిపింది. ప్రస్తుతం.. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 420 కి.మీ., విశాఖపట్నంకి పశ్చిమ-నైరుతి దిశలో 990 కి.మీ., చెన్నైకి తూర్పు-ఆగ్నేయంలో 990 కి.మీ., కాకినాడకి ఆగ్నేయంగా 1000 కి.మీ,. గోపాల్పూర్ దక్షిణ-ఆగ్నేయంలో 1040 కి.మీ. కొనసాగుతూ వాయుగుండంగా బలపడుతోంది. ఎల్లుండి ఉదయం నాటికి (27వ తేదీ) నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ తుపానుకు థాయ్‌లాండ్ సూచన మేరకు మోంథాగా(Cyclone Montha) నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణాల్లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు అప్రమత్తం అవుతున్నాయి. ఉద్యోగులకు సెలవులు రద్దుమోంథా తుఫాన్ హెచ్చరికలతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే మూడు రోజులు ఎంతో కీలకమని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని.. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. వేటపై నిషేధం విధిస్తూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికీ సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘‘చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలి. విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలి.జనరేటర్లు,డీజిల్ అందుబాటు లో సిద్ధం గా ఉంచుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచాలి’’ అని అన్నారు. తుఫాను వల్ల భారీ వర్షాలు , పెనుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున.. తీర ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పల్లపు ప్రాంతాల ప్రజలు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.