కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ఆయా జిల్లాల్లో పొలాల్లోనే నేలకొరిగిన వరి
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలపై అధిక ప్రభావం
పత్తి అధికంగా పండించే ఆదిలాబాద్‌లో వర్ష ప్రభావం తక్కువ ఉండడంతో తగ్గిన నష్టం
నష్టాన్ని అంచనా వేసే పనిలో వ్యవసాయశాఖ
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తూ వచ్చిన వర్షాలు ‘మోంథా’తుపానుతో రైతుల నడ్డి విరిచాయి. గత సెప్టెంబర్ నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో పత్తి పంట ఇప్పటికే చాలా వరకు దెబ్బతింది. చేలల్లో నీరు నిలిచి పత్తి గింజలు బలహీనంగా ఎదిగాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మొదటి విడత పత్తి ఏరడం పూర్తయ్యింది. రెండోదశ పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న చేలకు ‘మోంథా’తుపాను తీవ్ర నష్టం కలిగించింది. పత్తి గింజలు విచ్చుకుంటున్న సమయంలో కురిసిన వర్షాలతో పత్తి మరింత దెబ్బతింది.
పత్తి అధికంగా సాగయ్యే ఆదిలాబాద్‌లో వర్ష ప్రభావం అధికంగా లేకపోవడంతో ఇక్కడ నష్టం కొంత తక్కువగానే ఉంది. వరి పంట చేతికి వస్తున్న సమయంలో కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతలు పూర్తయిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోయగా, చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయింది. ఇక కోతకు వచ్చిన వరి వర్షాలకు చాలా జిల్లాల్లో నేలకొరిగింది. పొట్టకొచ్చిన వరి నేలరాలడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఏపీ సరిహద్దు జిల్లాల్లో అధిక నష్టం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న జిల్లాల్లో మోంథా తుపానుతో నష్టం ఎక్కువగా ఉంది. నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పత్తి పంట నష్టం అధికంగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కూడా పత్తి దెబ్బతింది.
వరంగల్ ప్రధాన వ్యవసాయ మార్కెట్‌లో వడ్లు, మక్కలు వర్షం నీటిలో నానిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు నివేదికలు ఇచ్చినట్టు సమాచారం.
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం
మహబూబాబాద్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 2,15,723 ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. ఈ వర్షాల కారణంగా 50 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న 62,751 ఎకరాల్లో సాగు చేసి, కంకులను కోసి రైతులు విక్రయించేందుకు కల్లాలు, అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఆరబోసుకు న్నారు.
మొక్కజొన్నలకు 70 నుంచి 80 శాతానికిపైగా నష్టం వాటిల్లింది. పత్తి 86,224 ఎకరాల్లో సాగు కాగా, పంట కోతదశకు చేరుకున్న సందర్భంలో 60 శాతానికి పైగా నష్టం చేకూర్చనుంది. మిర్చి 38,289 ఎకరాల్లో సాగు చేయగా, పూత 40% వరకు రాలిపోతున్నట్టు ప్రాథమికంగా అంచనా.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో...
ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఈసారి అత్యధికంగా 6,85,262 ఎకరాల్లో పత్తి సాగైంది.భారీ వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడి సగానికి పడిపోవడం, ప్రస్తుత తుపాను కారణంగా పంట మరింత దెబ్బతినడంతో ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు
చేతికంది వచ్చిన పంట ఆగమైంది
రెండున్నర ఎకరాల్లో వరిసాగు చేయగా రూ.లక్షకుపైగా ఖర్చు అయ్యింది. ప్రస్తుతం వరి పొట్టదశకు చేరుకుంది. కొద్దిరోజుల్లో వరి కోతలు అనుకున్నాం. అంతలోనే తుపాను కారణంగా చేతికి అంది వచ్చిన పంటకు నష్టం వాటిల్లింది. –భూక్యా శాంతి, సోమ్ల తండా మహబూబాబాద్
పత్తి ఏరకుండా వదిలేశాను
నాకున్న 3 ఎకరాల్లో పత్తి పంట వేశా. ఇప్పటివరకు ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చు అయ్యింది. ఈసారి భారీ వర్షాలకు పత్తి దిగుబడి సగానికి తగ్గింది. కూలీలతో పత్తి ఏరేందుకు సిద్ధమవుతున్న సమయంలో తుపాను కారణంగా పంట మరింత దెబ్బతింది. కూలీల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం పత్తి తీయడం మానేశాను. – లాల్యా, పోచమ్మతండా, వెల్దండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా)
రైతులు అప్రమత్తంగా ఉండాలి
మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఆరెంజ్ హెచ్చరిక జారీ అయ్యింది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. కోసిన వరి, మొక్కజొన్న, పత్తిని సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలి. వరి, మొక్కజొన్నను తుపాను ప్రభావం తగ్గిన తర్వాత కోయాలి. పత్తి ఏరవద్దు. తొందరపడి కోస్తే తడిసే అవకాశం ఉంది.అధిక నీటి నిల్వతో ఎండుతెగులుతో పాటు ఇతర చీడపీడలు సోకే అవకాశాలు ఉన్నందున పలు జాగ్రత్తలు పాటించాలి. – శ్రీనివాస్, డీఏవో పెద్దపల్లి


