మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి కోరమీసాల మల్లన్న కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
క్షేత్రంలోని తోట బావి వద్ద సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక మండపంలో మల్లన్న స్వామి.. మేడలాదేవి, కేతమ్మలను సరిగ్గా మధ్యాహ్నం 12.01గంటలకు వివాహమాడారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితులు కల్యాణ క్రతువును కనుల పండువగా నిర్వహించారు.
కల్యాణ వేడుకను వీక్షించేందుకు రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆలయ గర్భగుడిలో ఉదయం 9 గంటలకు మూల విరాట్‌కు కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి. అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీలో ఊరేగింపుగా మేళాతాళలతో తోటబావి వద్ద గల మల్లన్న కళ్యాణవేదికకు చేర్చి కల్యాణ క్రతువు చేపట్టారు.


