వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరోపియన్ అనుసరిస్తున్న విధానాలు విపత్తులను సృష్టించేవిగా ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. ‘పొలిటికో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన ఈ విమర్శలు ఇప్పుడు అమెరికా, దాని కీలక మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.
నాటో కూటమిపై కూడా ట్రంప్ దృష్టి సారించారు. ఈ కూటమి తనను డాడీ అని పిలుస్తుందని పేర్కొంటూనే, రక్షణ వ్యయంపై యూరోపియన్ దేశాలు ఏవోవో మాట్లాడతాయి తప్ప, యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అవసరమైన సహాయాన్ని అందించవని ట్రంప్ ఆరోపించారు. రష్యాకు కైవ్ భూభాగాన్ని అప్పగించాల్సి వస్తుందని, యూరప్‌లోని చాలా మంది భయపడుతున్న నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించాలనే యూఎస్ ప్రణాళికపై పెరుగుతున్న విభేదాల సమయంలో ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుపై యూరోపియన్ నేతలు ట్రంప్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ విమర్శలు వెలువడ్డాయి.
ఈ సందర్భంలోనే ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మార్షల్ లా కారణంగా ఎన్నికలు వాయిదా పడటం వల్ల దేశం ‘ఇకపై ప్రజాస్వామ్యం కాదు’ అనే స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు. అందుకే రష్యా పైచేయి సాధిస్తోందని ఆయన వాదించారు. యుద్ధాన్ని ముగించడానికి తాను రూపొందించిన ప్రణాళికను గ్రహించి, యుద్ధంలో మరణాలను ఆపడానికి చర్యలు తీసుకోవాలని ఆయన జెలెన్స్కీకి ట్రంప్ సలహా ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, జెలెన్స్కీ మాట్లాడుతూ భద్రతను నిర్ధారించగలిగితే తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వలసల అంశంపై ట్రంప్ చేసిన విమర్శలు ఇటీవల విడుదల చేసిన అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలోని అంశాలను బలపరుస్తున్నాయి. వలసల కారణంగా బ్రిటన్, ఫ్రాన్స్ , జర్మనీ తదితర దేశాలు నాశనం అవుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. యూరప్‌లోని నేతలు వలసల ప్రభావాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమయ్యారని ట్రంప్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Israel: యుద్ధ విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న గణాంకాలు


