సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలపై కేంద్రం ఎన్నో గొప్పలు చెబుతుందని.. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తానేమి తప్పుగా.. నిరాధార ఆరోపణలు చేయడం లేదని, స్పష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతున్నానని అన్నారాయన.
మంగళవారం ఎస్‌ఐఆర్‌పై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ అనేది ఎన్నికల వ్యవస్థతో పాటు సీబీఐ, ఈడీ సంస్థలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందన్నారు. సీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదని అడిగారు. కేంద్రం విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసిందని మెరిట్‌తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారని ప్రశ్నించారు.
ఈసీలను రక్షించడానికి ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఏంటని కేంద్రాన్ని రాహుల్ ప‍్రశ్నించారు. ఎలక్షన్ కమిషనర్‌లకు ఇంత పెద్ద గిప్ట్ ఏ ప్రధాని, హోంమంత్రి ఇవ్వలేదన్నారు. 45 రోజుల్లో సీసీటీవీ పుటేజ్ ధ్వంసం చేసే నిబంధన ఎందుకని?.. ఇది డేటా సంరక్షణ కాదు డేటా చోరీ అని రాహుల్ విమర్శించారు.
ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఓటు చోరి జరిగిందన్నారు. ఫేక్ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని ప్రభుత్వం టార్టెట్ చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో ఉంచడానికి ప్రయత్నిస్తుందని రాహుల్ అన్నారు. ఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉందని విమర్శించారు.
ఎస్ఐఆర్ చర్చలో రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పేరెత్తడంతో బీజేపీ సభ్యలు తీవ్ర అభ్యంతంరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు స్పందిస్తూ రాహుల్ పార్లమెంట్‌లో అనవసరంగా రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్ టాపిక్ తీస్తున్నారన్నారు. ఆ సమయంలో బీజేపీ-విపక్ష ఎంపీల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు.దీంతో లోక్ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో స్పీకర్ ఓం బిర్లా విపక్షాలను సున్నితంగా మందలించారు.


