ట్రంప్ మరో సంచలన నిర్ణయం | US Launches Global Trade Probe Targeting India And 15 Other Economies Amid Concerns Over Unfair Practices | Sakshi
Sakshi News home page

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

Mar 12 2026 7:15 AM | Updated on Mar 12 2026 2:11 PM

Trump administration opens probe into unfair trade

వాషింగ్టన్: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరతీశారు. విదేశీ తయారీ రంగంలో అనుసరిస్తున్న ‘అనుచిత వాణిజ్య విధానాలపై’ విచారణ చేపట్టాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ జాబితాలో భారత్ సహా ప్రపంచంలోని 16 ప్రధాన ఆర్థిక వ్యవస్థలను చేర్చడం గమనార్హం. అమెరికా పారిశ్రామిక రంగాన్ని కాపాడుకునేందుకు, విదేశాల నుంచి వస్తున్న మిగులు ఉత్పత్తిని అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.

అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ట్రంప్ విధించిన సుంకాలను నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఈ కొత్త విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్‌) జామీసన్ గ్రీర్ బుధవారం ఈ విచారణలపై అధికారిక ప్రకటన చేశారు. 1974 వాణిజ్య చట్టంలోని ‘సెక్షన్ 301’ కింద ఈ విచారణలు ప్రారంభించనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో భారత్ వంటి దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై భారీగా పన్నులు మోపే అవకాశం ఉంది.

అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలను ఈ విచారణలో ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. వీటితో పాటు స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, కంబోడియా, వియత్నాం, బంగ్లాదేశ్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ‘చాలా దేశాలు తమ దేశీయ అవసరాలకు మించి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ మిగులు ఉత్పత్తిని అమెరికాపైకి నెట్టడం వల్ల మా దేశీయ తయారీ రంగం దెబ్బతింటోంది. అమెరికా పారిశ్రామిక పునాదిని ఇకపై బలి చేయబోము’ అని జామీసన్ గ్రీర్ పేర్కొన్నారు.

ఇటీవలే భారత్-అమెరికా మధ్య ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందన్న హామీతో, అమెరికా తన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. గతంలో ట్రంప్ చేపట్టిన ‘లిబరేషన్ డే’ విన్యాసాల తర్వాత భారత్‌పై 25 శాతం సుంకాలు ఉండగా, రష్యా చమురు కొనుగోలు నెపంతో మరో 25 శాతం పెనాల్టీ విధించారు. తాజా విచారణతో ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం పడుతున్నదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు?
 

Advertisement
 
Advertisement
Advertisement