ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాపై తీవ్రంగా పడింది. నిన్న బెంగళూరు, విశాఖ, ముంబై నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడగా.. ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు సిలిండర్ బండలతో రోడ్డెక్కారు. కొన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితులు నెలకొన్నాయి.
దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా కష్టాలు మొదలయ్యాయి. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పాటు.. బిహార్‌లో పోలీసుల బందోబస్తు నడుమ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కీలక నగరాల్లో ఒకట్రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్‌లో ఎల్‌పీజీ బ్లాక్ మార్కెటింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై దృష్టి సారించాయి.
రోజురోజుకీ పరిస్థితి తీవ్రం
ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మధ్యప్రదేశ్‌లో ఆ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే వారం రోజుల్లో ఒక్క భోపాల్‌లోనే వెయ్యికి పైగా పెళ్లిళ్లు షెడ్యూల్ అయినట్లుగా తెలుస్తోంది. గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం ఉండడంతో.. పెళ్లింట భోజనాలు ఉంటాయా? అనే ఆందోళనలు వధువు, వరుడి తరఫు వారిలో నెలకొంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు, హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు పెళ్లిళ్ల సీజన్ దాటిపోతోందని, అడ్వాన్సులు తీసుకున్న తమకు నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవిధంగా ఇది అత్యయిక స్థితిని తలపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
యూపీలో పోలీసుల బందోబస్తు నడుమ..
యూపీలో గడిచిన నాలుగైదు రోజులుగా ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లు పెరిగాయి. బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్ అనే నిబంధన కొనసాగుతున్నప్పటికీ.. అసాధారణంగా బుకింగ్‌లు పెరుగుతున్నాయని ఎల్‌పీజీ డీలర్లు చెబుతున్నారు. గోరఖ్‌పూర్, సిద్ధార్థనగర్ ప్రాంతాల్లో పౌరులు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు క్యూకట్టారు.
సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరినట్లు ఇప్పుడు యూపీలో ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఏజెన్సీల వద్ద క్యూకట్టారు. అయితే.. వారందరికీ సిలిండర్లు సర్దుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, టోకెన్లు ఇచ్చి, రాబోయే రోజుల్లో పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు దుర్గా..
బిహార్‌లో బుకింగ్‌ల నిలిపివేత?
రెండ్రోజులుగా బిహార్‌లో కమర్షియల్ సిలిండర్ల బుకింగ్‌లను చమురు సంస్థలు నిలిపివేశాయి. దీంతో.. బెంగళూరు మాదిరిగానే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు బంద్‌కు సిద్ధమవుతున్నారు. డొమెస్టిక్ బుకింగ్‌లు కొనసాగుతున్నప్పటికీ.. బ్లాక్‌మార్కెటింగ్ భయాలు ఉండడంతో ప్రజలే ఏజెన్సీల వద్దకు ఖాళీ సిలిండర్లతో చేరుకుంటున్నారు. దీంతో.. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా గోపాల్ గంజ్, ఖగారియా, ఔరంగాబాద్, పట్నా నగరాల్లో తెల్లవారుజాము నుంచే ప్రజలు సిలిండర్ బండ కోసం క్యూలైన్లలో నిలబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే.. డీలర్లు తమపై దాడులు జరిగే ప్రమాదాలున్నాయనే భావనతో ఏజెన్సీలను తెరవడం లేదు.
రాజస్థాన్‌లో బ్లాక్ మార్కెటింగ్?
కమర్షియల్ సిలిండర్ ధర 19 వందల రూపాయలదాకా ఉండగా.. ఇప్పుడు రాజస్థాన్‌లో బ్లాక్ మార్కెటర్లు దాన్ని 2,500 నుంచి మూడువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, అక్రమార్కుల దందాను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించారు. లూథియానా, ఫరీద్‌కోట్, హోషియార్‌పూర్, పటియాలా ప్రాంతాల్లో చమురు సంస్థల వెబ్‌సైట్లు డౌన్ కావడంతో.. కొత్త బుకింగ్‌లు జరగడం లేదని తెలుస్తోంది దుర్గా..
కేంద్ర ప్రభుత్వం చర్యలు
పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిన్ననే ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో చమురు కంపెనీల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే నిబంధనను నిక్కచ్చిగా అమలు చేస్తోంది. గ్యాస్ డెలివరీ బాయ్స్ దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీని అమలు చేస్తోంది. మరోవైపు ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. - సాక్షి వెబ్‌డెస్క్


