టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ భద్రతకు ఆ దేశ అధికారులు ఒక ఎలైట్ కౌంటర్‌టెర్రరిజం యూనిట్‌ను నియమించినట్లు సమాచారం. మొజ‍్తాబా తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో హతమైన విషయం తలిసిందే. ఆ తర్వాత ఎవరైనా సుప్రీం లీడర్ పదవిలో నియమితమైతే వారిని కూడా ఖతం చేస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో మొజ్తాబా భద్రత విషయంలో ఇరాన్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది.
కొత్త సుప్రీం లీడర్ భద్రతకు ‘నోపో’
అమెరికా మీడియా నివేదికల ప్రకారం.. బ్లాక్ దుస్తులు ధరించే కౌంటర్‌టెర్రరిజం స్పెషల్ ఫోర్స్ ‘నోపో‘ను మొజ్తబా భద్రత కోసం నియమించారు. “అలీ ఖమేనీ లేరు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మొజ్తబా ఖమేనీ రక్షణ బాధ్యతలను నోపో చేపడుతుంది” అని అమెరికా మీడియా తెలిపింది. పారిస్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ విదేశాంగ కమిటీ అధికారి అలీ సఫావీ వ్యాఖ్యలను కూడా ఆ నివేదికలో పేర్కొంది.
నోపో అంటే?
నోపో అనేది ఫార్సీ సంక్షిప్త రూపం “నిరూయె విజెహ్ పాస్దారాన్ వెలాయత్”. దీని అర్థం “సుప్రీం లీడర్ రక్షణ ప్రత్యేక దళం”. ఇరాన్‌లో నోపో ఫోర్స్ 1991లో ఏర్పడింది. ఇది స్పెషల్ యూనిట్స్ కమాండ్ అధీనంలో పనిచేసే ఇరానీ ఎలైట్ రయట్ పోలీస్ యూనిట్. ఇరాన్ పోలీసింగ్ వ్యవస్థలో అత్యుత్తమ ప్రత్యేక దళంగా భావిస్తారు.
బాగా శిక్షణ పొందిన దళంగా దీనికి గుర్తింపు ఉంది. 1999లో విద్యార్థుల నిరసనలు, 2019లో అల్లర్లు, మహ్సా అమినీ నిరసనల సమయంలో వాటిని బలవంతంగా అణచివేయడంలో నోపో కీలక పాత్ర పోషించిందని ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు కూడా వచ్చాయి.
కాలక్రమంలో ఈ దళం మరింత ప్రత్యేక శిక్షణ పొందిన యూనిట్‌గా నోపో మారింది. ఇది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ దళంలో కాకుండా వేరుగా పనిచేస్తుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ రక్షణకు ఏర్పాటు చేసిన సైనిక దళం. నోపోలో మొత్తం 6 బ్రిగేడ్లు ఉన్నాయి. వాటిలో 4 టెహ్రాన్‌లో, ఒకటి మష్హద్‌లో, ఒకటి ఇస్ఫహాన్‌లో ఉన్నాయి.
ఈ దళం ఐఆర్‌జీసీ కంటే మరింత బాగా పనిచేస్తుంది. ఖమేనీ రక్షణకు ఈ దళాన్ని వాడుతున్నారు. ఇతర భద్రతా దళాలపై ఆయనకు నమ్మకం లేదని అమెరికా మీడియా పేర్కొంటోంది. అలీ ఖమేనీ హత్య సమయంలో నోపో సభ్యుల్లో కొందరు మరణించి ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఆ దళం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. సంక్షోభ సమయంలో, జనవరి తిరుగుబాటు సమయంలో నిరసనకారులపై కాల్పులు జరిపిన దళం ఇదే.


