పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థలో మరింత అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తమ సభ్యులకు, నివాసితులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
మెనూ నుంచి చపాతీ, దోశ అవుట్?
గ్యాస్ కొరత దృష్ట్యా హాస్టల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ఒక నోటీసును విడుదల చేసింది. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే అల్పాహారాలను ప్రస్తుతానికి నిలిపివేయాలని హాస్టల్ యజమానులను కోరింది. చపాతీ, దోశ, పూరీ వంటి ఎక్కువ సమయం తీసుకునే వంటకాలకు స్వస్తి పలకాలని సూచించింది. పరిస్థితి మెరుగుపడే వరకు కేవలం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం మాత్రమే అందించే అవకాశం ఉంది. లభ్యతను బట్టి అదనపు కూరలు, స్నాక్స్‌ను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.
‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసితులు హాస్టళ్ల యాజమాన్యానికి సహకరించాలి. వంటకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని హాస్టల్ యజమానులను కోరుతున్నాం’ అని నోటీసులో పేర్కొన్నారు.
హోటల్ పరిశ్రమలోనూ ఆందోళన
హాస్టళ్లు మాత్రమే కాకుండా నగరంలోని హోటళ్లు కూడా వాణిజ్య సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రబ్బానీ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
25 రోజుల వెయిటింగ్ పీరియడ్
మరోవైపు, తెలంగాణలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలను అధికారులు పాక్షికంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2.3 లక్షల సిలిండర్ల సరఫరా స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే, ప్రజలు భయంతో సిలిండర్లను నిల్వ చేయకుండా చూసేందుకు ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త గ్యాస్ బుకింగ్‌ల కోసం 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ అమలులోకి వచ్చింది. సరఫరా క్రమబద్ధీకరణ కోసమే ఈ నిబంధన విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్‌కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు?


