పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు దక్షిణ ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన బంగ్లాదేశ్ తన అవసరాల కోసం ఇప్పుడు పూర్తిగా భారత్ వైపు చూస్తోంది. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడంతో తలెత్తిన కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి అత్యవసరంగా డీజిల్ దిగుమతులను వేగవంతం చేసింది.
బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) ఛైర్మన్ ముహమ్మద్ రెజానుర్ రెహ్మాన్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్‌తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా 5,000 టన్నుల డీజిల్ సరుకు బంగ్లాదేశ్‌కు చేరుతోంది. భారత్ నుంచి ఏటా 1.8 లక్షల టన్నుల డీజిల్‌ను పైప్‌లైన్ ద్వారా దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఆరు నెలల్లో కనీసం 90 వేల టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అందుతున్న 5,000 టన్నులతో పాటు రాబోయే రెండు నెలల్లో ఆరు నెలలకు సరిపడా కోటాను పూర్తిగా భారత్ నుంచి దిగుమతి చేస్తామని రెహమాన్ తెలిపారు.
మూతపడుతున్న యూనివర్సిటీలు
బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ధరలు ఆకాశాన్ని తాకడం, సరఫరా నిలిచిపోవడంతో దేశంలో ఇంధన పరిమితులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేసింది. ల్యాబ్‌లు, ఏసీలు, హాళ్లలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండటమే దీనికి కారణం. ప్రజలు ఇంధనాన్ని నిల్వ చేయకుండా ఉండేందుకు రోజువారీ విక్రయాలపై పరిమితులు విధించారు. స్పాట్ మార్కెట్ నుంచి అత్యధిక ధరలకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్‌ఎన్‌జీ) కొనుగోలు చేస్తోంది.
భారత్ పాత్ర కీలకం
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మండుతున్న వేళ పొరుగు దేశానికి భారత్ అందిస్తున్న ఈ సహకారం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘వినియోగాన్ని తగ్గించడానికి, ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మరింత కాలం కొనసాగితే బంగ్లాదేశ్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు భారత్ వంటి దేశాలు భరోసాగా నిలిచే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు


