ఇరాన్ యుద్ధం.. ఆ దేశం కోరుకున్నది కాదు.. అమెరికా-ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై యుద్ధానికి కాలు దువ్వితే, దానికి ఆ దేశం అంతే ధీటుగా బదులిస్తోంది. తమ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనిని కోల్పోయి తీవ్ర వేధనను భరిస్తూనే అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు అదే స్పీడ్‌లో ప్రతిదాడులు చేస్తోంది ఇరాన్. ఖమేనీ హత్య తరువాత ఇరాన్ పరిస్థితి ఇక ముగిసినట్లే అనుకున్నవారికి ఆ వాదన తప్పు అని నిరూపిస్తూ ఇరాన్ వరుస దాడులతో చెలరేగిపోతోంది. ‘నిండా మునిగిన వాడికి చలేమిటి’ అన్నట్లు ఇరాన్ యుద్ధం చేసే తీరును గమిస్తేనే అర్థమవుతోంది.
అటు చేతలతోనూ, ఇటు మాటలతోనూ అమెరికాకు గుబెల్ పుట్టిస్తోంది. ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బకొట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట రాగానే, అంతే వేగంగా స్పందించింది ఇరాన్. తమను తక్కువ అంచనా వేయొద్దని అమెరికా--ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించింది. యుద్ధాన్ని ముగించేది మీరు కాదు.. మేం అంటూ ట్రంప్‌కు కౌంటరిచ్చింది.
తాము చేసే యుద్ధం ఒక నెల, రెండు నెలలు కాదు.. ఆరు నెలలైనా కంటిన్యూగా చేస్తామని రెండు రోజుల క్రితం చెప్పిన ఇరాన్.. ఇప్పుడు పదేళ్లు అయినా యుద్ధం చేస్తూనే ఉంటామని, ఆ రెండు దేశాలే తమ శత్రువులని, వారికి నేరుగా మద్దతిచ్చే వారు కూడా తమ శత్రువులేననే చెబుతోంది. ఈ యుద్ధంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తున్నామని, తమకు ఎవరి సహాయం అవసరం లేదని కూడా అంటోంది.
ట్రంప్‌లో భయం మొదలైందా..?
ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ట్రంప్ ఒక్కసారిగా హుకుం జారీ చేశారు. ఇరాన్ చమురు నిల్వలు మన టార్గెట్ కాదని, వాటిపై దాడులు వద్దంటూ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. దాంతో అమెరికా-ఇజ్రాయెల్‌లో భిన్న వైఖరి కనిపించింది. ఇక ‘ మీ పని అయిపోయింది’ అంటూ ఇరాన్ స్వయంగా లొంగిపోవాలంటూ బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్న ట్రంప్‌కు ఎక్కడో భయం ఉన్నట్లే కనిపిస్తోంది. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు చేసే సమయంలో అది ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని, వాటిని వద్దని ట్రంప్ ఖండించారు. అయితే ఇక్కడ ట్రంప్‌లో ఉన్నది ఒక్కటే భయం ఉండి ఉండవచ్చు. చమురు సంక్షోభం ఏర్పడితే మొత్తం ప్రపంచదేశాల ట్రంప్ ముఖాన్ని చీదిరించుకుంటారనే ఉద్దేశంతోనే ఇరాన్ చమురు నిల్వలపై దాడిని ఆపి ఉండవచ్చనేది విశ్లేషకులు అభిప్రాయం. మరొకవైపు అమెరికా నిఘా వర్గాల సమాచారం కూడా ట్రంప్‌లో అలజడి రేపుతున్నట్లే కనబడుతోందని అంటున్నారు.
ఇరాన్‌ను తక్కువగా చూడొద్దు: అమెరికా నిఘా వర్గాలు
మరొకటి ఏమిటంటే ఇరాన్ అణుబాంబును తయారు చేసే శక్తిని దాదాపు క్రోడీకరించుకుందనే అనుమానం కూడా ట్రంప్‌లో ఉంది. అమెరికా నిఘా వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. తాము ధ్వంసం చేశామనే ఇరాన్ అణు కేంద్రాలను ఆ దేశం తిరిగి పునరుద్ధరించే పనిలో ఉందని అమెరికా నిఘా వర్గాలే చెప్పాయి. అయితే దానిపైనే ప్రస్తుతం తమ ఫోకస్ ఉందని, వాటిని వారు ఎక్కడికి తరలిస్తారు.. ఎలా పునరుద్ధరిస్తారు అనే దానిపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాయి.
అంటే ఇరాన్ అణు ఆయుధాల అవసరమైన స్థాయిలో యురేనియంను శుద్ధిచేస్తోందనే విషయం అమెరికా చెప్పకనే చెప్పేసింది. అంటే అణు ఆయుధాలు ఇరాన్ నుంచి తయారైతే అదే తమకు ముప్పని అమెరికాకు బాగా తెలుసు. దాంతోనే అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లు కనబడుతుండగా, ఇరాన్ మాత్రం యుద్ధాన్ని ఘనంగా ముగిస్తామని అంటోంది. అది అమెరికా-ఇజ్రాయెల్‌కు బుద్ధిచెప్పిన తర్వాతే తమ యుద్ధం ఆగుతుందని.. అంత వరకూ యుద్ధంలో వెనకడుగేసి ప్రసక్తే లేదని అంటోంది.
పుతిన్‌కు ట్రంప్ ఎందుకు ఫోన్ చేసినట్లు?
ఇక్కడ మరొక విషయం ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేయడం. ఇరాన్‌పై దాడిని తొలుత ఖండించిన వారిలో పుతినే ఉన్నారు. మరి అటువంటి పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌కు రష్యా, చైనాలు ఆయుధాలను సప్లై చేస్తున్నాయి ఆరోపించిన అమెరికా.. ఒక్కసారిగా రూట్ మార్చిందా అనేది కూడా అనుమానంగా ఉంది.
అసలు ఇరాన్ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఫోన్ చేశారా.. లేక యుద్ధాన్ని ఇక్కడితో ఆపేద్దాం అని ఇరాన్‌తో మధ్యవర్తిత్వం కోసం ఫోన్ చేశారా? అనే దానిపైనే చర్చ నడుస్తోంది. ఇరాన్‌కు రష్యా సపోర్ట్ చేస్తుందని ఆరోపించిన అమెరికా.. ఇప్పుడు ఆ ధేశ అధ్యక్షుడికే ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అనేది మరొక ప్రశ్న. తాడోపేడో తేల్చుకుందామని స్థితిలో ఉన్న ఇరాన్.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ట్రంప్‌కు ఏదో రకంగా చెప్పి యుద్ధాన్ని ఆపొచ్చు.. కానీ ఇరాన్ ఎవరు చెబితే వింటుంది అనేది మాత్రం ప్రపంచ నాయకులకు సవాల్‌గా మారింది. ఒకవేళ అమెరికా అనుమానపడుతున్నట్లే అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేసే పనిలో ఉంటే మాత్రం అది ప్రపంచానికి ముప్పుగానే చెప్పొచ్చు.


