న్యూఢిల్లీ: పాఠ్యపుస్తకాల్లో న్యాయవ్యవస్థ ప్రతిష్టను భంగపరిచేలా అభ్యంతరకర అంశాలను పొందుపరిచిన వ్యవహారంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) దిగివచ్చింది. ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మంగళవారం ‘బేషరతుగా, నిష్పాక్షికంగా’ క్షమాపణలు ప్రకటించింది. సదరు పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది.
ఇటీవల ప్రచురించిన "ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్" (Exploring Society: India and Beyond) అనే ఎనిమిదో తరగతి పుస్తకంలోని నాలుగో అధ్యాయం ‘మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర’ (The Role of Judiciary in our Society) తీవ్ర దుమారం రేపింది. భారత న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందని, కేసుల పెండింగ్‌కు జడ్జీల కొరతే ప్రధాన కారణమని పేర్కొంటూ వ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ugra
గత నెలలో ఈ అంశంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆ పుస్తక ప్రచురణ, పంపిణీ, డిజిటల్ ప్రసారాలపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధం విధించింది. న్యాయవ్యవస్థను కించపరచడం వెనుక లోతైన కుట్ర దాగి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ అప్రమత్తమైంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ పుస్తకాన్ని తొలగించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసింది. మరోవైపు ఈ వివాదాస్పద పాఠ్యాంశాన్ని రూపొందించిన ఇద్దరు వ్యక్తులను మంత్రిత్వ శాఖ విధులకు దూరం పెట్టినట్లు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.
ఇది కూడా చదవండి: పొద్దున్నే రెండు ఘోరాలు.. గాలిలో 14 నిండు ప్రాణాలు..


