ఏఐ, ఆటోమేషన్‌పై పట్టు పెంచుకోవాలి | PM Modi urges increased focus on AI and automation | Sakshi
Sakshi News home page

ఏఐ, ఆటోమేషన్‌పై పట్టు పెంచుకోవాలి

Mar 10 2026 3:43 AM | Updated on Mar 10 2026 3:43 AM

PM Modi urges increased focus on AI and automation

యువతకు మోదీ సూచన 

న్యూఢిల్లీ: దేశ విద్యా రంగాన్ని వాస్తవిక ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను మరింత వేగవంతంచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), ఆటోమేషన్, డిజిటల్‌ ఎకానమీ వంటి సబ్జెక్టులపై మరింత దృష్టిపెట్టడం ద్వారా అనుసంధానం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పోస్ట్‌–బడ్జెట్‌ వెబినార్‌లో మోదీ మాట్లాడారు. ‘‘విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సాంస్కృతిక రంగాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమాలు. సంస్థలు, పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యారంగం మారాలి.

అందుకే మార్కెట్‌ అవసరాలు, వాస్తవిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చాం’’ అని అన్నారు. ‘‘యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్‌ (ఏవీజీసీ) రంగం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. ఆవిష్కరణల ఆధారిత ఆర్థికవ్యవస్థకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధనశాలలతో విద్యాలయాలు అనుసంధానం కావాలి. పారిశ్రామిక సౌజన్యం, పరిశోధనల ఆధారిత అభ్యసనలకు కేంద్రాలుగా రూపాంతరం చెందాలి.

అప్పుడు విద్యార్థులు విద్యాలయాల్లో పారిశ్రామికావసరాలకు తగ్గ పరిశోధనలు చేసి సఫలీకృతులవుతారు’’ అని మోదీ అన్నారు. ‘‘స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్‌) కోర్సులపై అమ్మాయిలు ఆసక్తిచూపడం శుభసూచకం. భావి సాంకేతికతల గురించి మాట్లాడుకునే వేళ దేశంలో ఏ అమ్మాయీ అవకాశాల కొరతతో వెనుకబడొద్దు’’ అన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల అధికారులు, నిపుణులు, ప్రైవేట్‌ రంగ భాగస్వాములతో పాటు పలువురు ప్రముఖులు వెబినార్‌లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement