తృణమూల్‌ను ప్రజలు క్షమించరు | PM Modi targets Trinamool over Murmu row says Bengal will not forgive insult to President | Sakshi
Sakshi News home page

తృణమూల్‌ను ప్రజలు క్షమించరు

Mar 9 2026 5:12 AM | Updated on Mar 9 2026 5:12 AM

PM Modi targets Trinamool over Murmu row says Bengal will not forgive insult to President

ముర్ము ప్రొటోకాల్‌ వివాదంపై మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్మును ఘోరంగా అవమానించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఒక దళితురాలిని అవమానించిన ఆ పార్టీని బెంగాల్‌ ప్రజలు క్షమించబోరని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో పర్యటించారు. ‘వికసిత్‌ ఢిల్లీ’ నిర్మాణంలో భాగంగా రెండు మెట్రో కారిడార్లు సహా దాదాపు రూ.33,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. బెంగాల్‌లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న సంతాల్‌ గిరిజన సదస్సును తృణమూల్‌ బహిష్కరించిందని ఆరోపించారు.

ఇది రాజ్యాంగానికి, దేశ ఆడబిడ్డలకు జరిగిన ఘోర అవమానమన్నారు. తృణమూల్‌ ను దేశ ప్రజలు, గిరిజన సమాజం, మహిళలు ఏనాటికీ క్షమించరన్నారు. అహంకారపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి ఒక నగరానికి పరిమితం కాదని, దేశ ప్రతిష్టతో ముడిపడి ఉందని మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను రికార్డు స్థాయిలో 375 కిలోమీటర్లకు విస్తరిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత నారీ శక్తిని ప్రధాని మోదీ ప్రశంసించారు. రాజకీయాలు, సైన్స్, క్రీడలు తదితర రంగాల్లో మహిళలు నూతన శక్తితో ముందుకు సాగుతున్నారని మోదీ కొనియాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement