లోక్‌సభలో మళ్లీ అవే దృశ్యాలు
తొలి రోజే విపక్షాల నిరసనలు
పశ్చిమాసియాపై చర్చకు పట్టు
నేటికి వాయిదా పడ్డ సభ
న్యూఢిల్లీ: పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజైన సోమవారం కూడా లోక్‌సభలో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. విపక్ష సభ్యులు పదేపదే కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటన చేయబోతుండగా అడ్డుకున్నారు. ఆ సంక్షోభంపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టారు. తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో తాము లేవనెత్తిన పలు ఇతర అంశాలకు సంబంధించి ప్లకార్డులు ప్రదర్శించారు. వాటన్నింటికీ ప్రభుత్వం అప్పుడే వివరంగా బదులిచ్చిందని సభాపతి స్థానంలో ఉన్న జగదంబికా పాల్ గుర్తు చేశారు. పశ్చిమాసియాపై చర్చకు వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.
‘‘స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానం ఇప్పటికే ఈ రోజు ఎజెండాలో ఉంది. ఒకే రోజు రెండు అంశాలపై చర్చ ఎలా సాధ్యం? పశ్చిమాసియాపై చర్చ కావాలంటే సభా వ్యవహారాల కమిటీని సంప్రదించండి’’అని సూచించారు. వారు పట్టువీడకపోవడంతో ఆగ్రహించారు. ‘‘విపక్ష సభ్యులు పరిణతి లేకుండా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయ ఎజెండా ప్రకారం వ్యవహరిస్తున్నారు’’అంటూ మందలించారు. వారు సభా మర్యాద పాటించడం లేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆక్షేపించారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభ పదేపదే వాయిదా పడింది. మధ్యాహ్నం మూడింటికి సమావేశమయ్యాక కూడా అవే పరిస్థితులు కొనసాగాయి. బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపడదామని విపక్ష సభ్యులకు పాల్ విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. దాంతో ఆ అంశాన్ని చర్చకు చేపట్టకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది.
పశ్చిమాసియాపై చర్చ ఉండబోదు: కేంద్రం
పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ చేపట్టాలన్న విపక్షాల డిమాండ్లకు కేంద్రం అంగీకరించే అవకాశం లేదని సమాచారం. దీనిపై విదేశాంగ మంత్రి ఉభయ సభల్లో ఇప్పటికే ప్రకటన చేసినందున ఇక చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
మోదీ బండారం బయటపడుతుందనే!
⇒ పశ్చిమాసియాపై చర్చకు వెనుకంజ: రాహుల్
⇒ పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియా కల్లోలంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన అనంతరం పార్లమెంట్ మకరద్వారం వద్ద విపక్ష ఎంపీలు ధర్నాకు దిగారు. ఈ సంక్షోభానికి సంబంధించిన కీలకాంశాలపై మోదీ సర్కారు మౌనం పాటిస్తోందని ఆరోపించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాం«దీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ , తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియా విషయంలో అమెరికా బ్లాక్‌మెయిలింగ్‌కు మోదీ లొంగిపోయారని రాహుల్ ఆరోపించారు. ‘‘ఈ అంశంపై పార్లమెంటులో చర్చ చేపడితే అవన్నీ బయటపడతాయని కేంద్రం భయపడుతోంది. అందుకే చర్చకు వెనకాడుతోంది’’అని ఆరోపించారు.
‘అవిశ్వాసం’పై నేడు చర్చ?
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభ మంగళవారం చర్చకు చేపట్టే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తదితరులు చర్చలో పాల్గొంటారు. అనంతరం చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బదులిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తీర్మానాన్ని వీలైనంత త్వరగా చర్చకు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్టు వెల్లడించాయి.
స్పీకర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ 118 మంది విపక్ష ఎంపీలు తొలి విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయనపై అవిశ్వాస తీర్మానానికి నోటీసివ్వడం తెలిసిందే. నాటినుంచీ లోక్‌సభ సమావేశాలకు బిర్లా సారథ్యం వహించడం లేదు. అవిశ్వాస తీర్మానంపై సభ నిర్ణయం వెలువడేదాకా స్పీకర్ విధులకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంగళవారం ఆయన సాధారణ ఎంపీగా చర్చలో పాల్గొనే అవకాశముందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. గతంలో మూడుసార్లు స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలిచ్చినా ఒక్కటి కూడా నెగ్గలేదు.


