‘కోటి మంది భారతీయుల క్షేమమే మా ప్రాధాన్యత’ | India Raises Alarm West Asia Conflict Threatens Energy Security Expat Lives | Sakshi
Sakshi News home page

‘కోటి మంది భారతీయుల క్షేమమే మా ప్రాధాన్యత’

Mar 9 2026 5:36 PM | Updated on Mar 9 2026 5:41 PM

India Raises Alarm West Asia Conflict Threatens Energy Security Expat Lives

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతకంతకూ క్షీణిస్తున్న భద్రతా వాతావరణంపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా, భారత ఇంధన భద్రత, కోటి మంది ప్రవాస భారతీయుల జీవనానికి ముప్పుగా పరిణమించిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత తొలి రోజైన సోమవారం ఆయన రాజ్యసభలో పశ్చిమాసియా పరిణామాలపై మాట్లాడారు.

క్షీణించిన భద్రత.. ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థ

పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు దిగజారాయని మంత్రి పేర్కొన్నారు. ‘మేము అక్కడి పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. ఈ సంఘర్షణ ఆ ప్రాంతంలో సాధారణ జనజీవనాన్ని, ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇది ఇప్పటికే పొరుగు దేశాలకు వ్యాపించి విధ్వంసానికి దారితీస్తోంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సభ తరఫున ఆయన సంతాపం ప్రకటించారు.

సరఫరా గొలుసుపై ప్రభావం

భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం ప్రధానంగా మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతంపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలు ఇంధన భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని జైశంకర్ అన్నారు. ముడిచమురుకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత, సరఫరాలో అంతరాయాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు ఈ ప్రాంతంలోనే ఉండటంతో సరఫరా గొలుసు దెబ్బతినడం భారత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతుందని పేర్కొన్నారు.

కోటి మంది భారతీయుల భద్రత

పశ్చిమాసియాలో సుమారు కోటి మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారని, వారి శ్రేయస్సు అత్యంత ప్రధానమైన అంశమని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇరాన్‌లో వేలాది మంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని, వారి భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భారతీయుల రక్షణే తమ మొదటి ప్రాధాన్యతని పునరుద్ఘాటించారు.

ఇరాన్ నౌకల అభ్యర్థనపై స్పష్టత

సముద్ర లాజిస్టిక్స్ విషయంలో ఇరాన్ ఇటీవల భారతదేశాన్ని సంప్రదించిందని జైశంకర్ వెల్లడించారు. భారత తీరాల్లో మూడు ఇరాన్ నౌకలు లంగరు వేయడానికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. అయితే, ఈ అభ్యర్థనను భారత ప్రభుత్వం తన జాతీయ ప్రయోజనాలను, అంతర్జాతీయ నిబంధనలను బేరీజు వేసుకుంటూ నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.

చర్చలు ముఖ్యం

‘ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదు. చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచీ నమ్ముతోంది. ఇటీవల కూడా మేము ఇదే విషయాన్ని చెప్పాం’ అని జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడం భారతదేశ ఆర్థిక పురోగతికి, ప్రాంతీయ భద్రతకు అత్యవసరమని సభకు వివరించారు.

ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!

Advertisement
 
Advertisement
Advertisement