టెహ్రాన్: ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చింది. శత్రుదేశాలకు మద్దతు ఇస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. దేశంలోని వారి ఆస్తులన్నీ జప్తు చేస్తామని హెచ్చరించింది.
ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఇరాన్ ప్రభుత్వ నియంత్రణలో నడిచే ఐఆర్ఐబీ వార్తా సంస్థ కూడా ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపింది. విదేశాల్లో నివసిస్తూ సొంత దేశానికి శత్రువుల‍్లా పనిచేస్తున్న వారి ఆస్తులు స్వాధీనం చేయాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉందని ఇరాన్ న్యాయ వ్యవస్థ సైతం స్పష్టం చేసింది.
ఈ ప్రకటన న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వార్తా సంస్థలో కూడా ప్రచురితమైంది. విదేశాల్లో ఇజ్రాయెల్ లేదా అమెరికా ప్రభుత్వాల కోసం జరిగే ఏదైనా ఇంటెలిజెన్స్ లేదా ఎస్పియోనాజ్ కార్యకలాపాలు జరిగితే ఆయా పౌరుల ఆస్తులు స్వాధీనం చేయడం పాటు మరణదండన కూడా విధించవచ్చని హెచ్చరించింది.
ఇరాన్‌కు వ్యతిరేకంగా తప్పులు చేసినట్లు నిర్ధారణ అయితే వదిలేది లేదని ఇరాన్ చెప్పింది. గత అక్టోబర్‌లో అమలు చేసిన చట్టం గురించి ప్రస్తావించింది. ఆ చట్టం ప్రకారం.. ఇజ్రాయెల్, అమెరికా లేదా ఇతర శత్రు దేశాలు లేదా సంస్థలకు అనుకూలంగా తమ పౌరులు పనిచేస్తే చేస్తే ఆస్తుల స్వాధీనంతో పాటు ఇస్లామిక్ పీనల్ కోడ్ ప్రకారం ఇతర చట్టపర శిక్షలు వర్తిస్తాయని తెలిపింది.
పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఆ రోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ నగరాలపై సైనిక దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి.. విదేశాల్లో ఉంటున్న తమ దేశ పౌరులపై కూడా ఇరాన్ దృష్టి పెట్టింది.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా 1,200 మందికి పైగా ప్రజలు మరణించారు. 10,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు.


