తమిళనాడులో బీజేపీ బిహార్‌ ఫార్ములా..: స్టాలిన్‌ | Tamil Nadu CM Stalin Accuses BJP Of Trying Bihar Model Politics Before 2026 Elections, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

తమిళనాడులో బీజేపీ బిహార్‌ ఫార్ములా..: స్టాలిన్‌

Mar 9 2026 9:27 PM | Updated on Mar 16 2026 5:10 PM

'BJP trying to replicate Bihar formula in TN,' claims CM Stalin.

చెన్నై: తమిళనాడులో మరో 2 నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ బీజేపీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్‌ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను కూడా ఆయన గుర్తు చేశారు.

తమిళనాడులోని సిరుగనూరులో స్టాలిన్‌ మాట్లాడుతూ.. ‘తమిళనాడులో గెలవడానికి అన్నాడీఎంకేను బీజేపీ క్రమంగా నాశనం చేస్తోంది. తమిళనాడులో బీజేపీ బిహార్‌ ఫార్ములాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ను పక్కనపెట్టేసి తమ పార్టీకి చెందిన నేతను సీఎం చేయడానికి ఏర్పాటు చేసుకుంది. 

బిహార్‌లో ఎప్పుడూ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి లేరు. నితీశ్‌ను ముందు నిలబెట్టి చూపిస్తూ ఎన్నికలు గెలిచిన తరువాత ఇప్పుడు ఆయనను పక్కకు నెట్టారు. ముఖ్యమంత్రి కావాలన‍్న స్వార్థంతో పళనిస్వామి బీజేపీకి బానిసగా మారారు.

ఈ ఎన్నికలు తమిళనాడుకు, ఎన్డీఏకు మధ్య జరుగుతున్నాయి. ఢిల్లీ టీమ్‌ గెలుస్తుందా? తమిళనాడు టీమ్‌ గెలుస్తుందా? అన్న అంశంపై ఆధారపడే 2026 ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ కుతంత్రాలు తమిళనాడులో పనిచేయవు. ఇక్కడ మేమే ఉంటాం, మా నేలపై గెలుపు మాదే, గెలిచేది మేమే. 

మీరు పల్టీలు కొట్టినా, ఏ ముసుగు వేసినా, ఏ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించినా, తమిళనాడు ఎప్పటికీ మీకు లొంగదు. నేను ఉన్నంత కాలం, నా పార్టీ పనిచేస్తున్నంత కాలం బీజేపీ తమిళనాడులో అధికారంలోకి రావడం అసాధ్యం’ అని స్టాలిన్‌ తెలిపారు. 

ఇదీ చదవండి: ‘మోదీ ఒక్క ఫోన్‌ చేస్తే యుద్ధం మొత్తం‘

Advertisement
 
Advertisement
Advertisement