సాక్షి ప్రతినిధి, కడప: మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి బీజేపీలో చేరికకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. తెలుగుదేశం, బీజేపీలోని ఒక సెక్షన్ నేతలు వీరశివా బీజేపీ చేరికకు మోకాలొడ్డారు. ఎట్టకేలకు అడ్డంకులన్నీ అధిగమించి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మరోమారు పార్టీ ఫిరాయింపునకు తెర లేపారు. బీజేపీలో చేరిక వ్యవహారం గత కొంత కాలంగా ఊగిసలాటలో ఉండిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మొగ్గు చూపగా, తెలుగుదేశం, బీజేపీ నేతలు కొంతమంది ఇప్పుడు ఆయన అవసరం ఏమిటంటూ అడ్డుతగిలారు. అధికారం కోసమే బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. అన్నీ అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
పుత్తాకు పక్కలో బల్లెం...
కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పక్కలో బల్లెం కానున్నారా...అంటే విశ్లేషకులు అవును అని వెల్లడిస్తున్నారు. బీజేపీలో చేరకముండే కమలాపురం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా వ్యవహారంపై స్పందించారు. కోట్లాది రూపాయాల దోపిడీ వ్యవహారం బహిర్గతం చేశారు. పుత్తా కుటుంబానికి నిత్యం రూ.30లక్షలు అక్రమ ఆదాయం లభిస్తోందని మీడియా సమావేశాలల్లో వ్యాఖ్యనించారు. అదే విషయమై చట్ట పరమైన చర్యలకు సిద్ధమైయ్యారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు అన్నీ రకాల ఎత్తుగడలు అవలంభిస్తున్నారు. ఈపరిస్థితులల్లో బీజేపీలో చేరిన తర్వాత మరింత దూకుడు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనుచరగణాన్ని సమీకరించుకున్న తర్వాత వేగంగా రాజకీయ పావులు కదపనున్నట్లు సమాచారం.


