నన్ను చంపేస్తారేమో! | Thiruvur TDP MLA Kolikapudi Srinivasa Rao shocking comments | Sakshi
Sakshi News home page

నన్ను చంపేస్తారేమో!

Mar 6 2026 6:00 AM | Updated on Mar 6 2026 6:00 AM

Thiruvur TDP MLA Kolikapudi Srinivasa Rao shocking comments

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి షాకింగ్‌ కామెంట్స్‌ 

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు అధికమయ్యాయి 

రౌడీయిజం, పేకాట క్లబ్బులు, రేషన్‌ మాఫియా పెచ్చరిల్లుతున్నాయి 

అలాంటి వ్యవహారాలను వ్యతిరేకించినందుకే నాపై దాడి 

ఎంపీ కేశినేని చిన్ని తీరుపై ఆగ్రహం

తిరువూరు: ‘టీడీపీ ఎమ్మెల్యేనే అయినా నన్ను చంపేస్తారేమో. నన్ను భూమి మీద లేకుండా చేయాలని ఏ.కొండూరు మండల టీడీపీ అధ్యక్షుడు పీక్లా నాయక్‌ అన్నారంటే.. నన్ను చంపడానికే టీడీపీలోని ఒక వర్గం ప్రయత్నిస్తోందని అర్థమవుతోంది. వీళ్లంతా నన్ను చంపడానికి చూస్తున్నారు’ అంటూ ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరువూరులో మీడియాతో కొలికపూడి మాట్లాడుతూ..  ‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు అధికమయ్యాయి. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం, పేకాట క్లబ్బులు, రేషన్‌ మాఫియా ఆగడాలు పెచ్చుమీరిపోయాయి.

వీటిని వ్యతిరేకించినందుకే నాపైనా దాడి జరిగింది. నన్ను ధైర్యంగా ఎదుర్కోలేనివారే దొంగచాటు వ్యవహారాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలపై అక్రమ కేసులు బనాయించి వేధించాలని ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం నుంచి పోలీసులకు ఒత్తిడి వస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. గంపలగూడెం మండలం పెదకొమెర, తిరువూరు మండలం గానుగపాడు గ్రామాల్లో దళితులపై కేసులు నమోదు చేయడం తగదని తాను విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను కలిసి చెప్పానన్నారు. ఇకనైనా అక్రమ కేసులను ఆపకపోతే బాధితులతో కలిసి ఆందోళన చేస్తానని హెచ్చరించానని ఎమ్మెల్యే వెల్లడించారు.  

దాడి సమాచారం తెలిసినా రక్షణ కల్పించరా?
నెమలి శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి కల్యాణోత్సవ సమయంలో తనపై కొందరు దాడిచేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం వచ్చినా రక్షణ కల్పించలేదని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. గంపలగూడెం మండలం కొణిజర్ల, ఊటుకూరు గ్రామాల్లో ఎంపీ అనుచరులు తనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో తనకున్న చట్టపరమైన హక్కులను ఎవరైనా బలవంతంగా లాక్కుంటే సహించబోనని స్పష్టం చేశారు. ఎంపీ కార్యాలయం నుంచి తనపై దాడికి ముందస్తు ఆదేశాలు వెళ్లాయని, జనసమీకరణ చేయాలని స్థానిక నేతలకు సమాచారం వెళ్లిందని ఎమ్మెల్యే తెలిపారు.

తనను జాగ్రత్తగా ఉండాలని నిఘా భద్రతా వర్గాలు తన గన్‌మెన్‌ ద్వారా సూచించినా పోలీసులు ఒక్క కానిస్టేబుల్‌నూ ఇవ్వలేదన్నారు. నెమలి కల్యాణం జరిగేటప్పుడు కరెంటు సరఫరా నిలిపివేసి తనపై దాడి చేయాలని పథకం వేస్తే పోలీసులు అంగీకరించలేదని కూడా ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన కారు అద్దాలు పగులగొట్టి, టైర్లలో గాలి తీసివేసి దాడి చేయాలని చూశారని.. వీటికి తన వద్ద స్పష్టమైన సమాచారం ఉందన్నారు. తిరువూరు నియోజకవర్గానికి సంబంధం లేని బాలకోటయ్య విమర్శలు చేయడం హేయమన్నారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన నేతలు.. మిగిలిన నియోజకవర్గాల్లో ఆ విధంగా ఎమ్మెల్యేలు లేకుండా ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.

రౌడీయిజం చేసినందునే ఆర్యవైశ్యులు తిరువూరులో టీడీపీకి 20 ఏళ్లపాటు ఓట్లు వేయలేదని, తాను వచ్చాక మార్పు తెచ్చానన్నారు. తన గురించి చిట్టా ఉందనేవారు వాటిని బయట పెట్టాలని అన్నారు. అరవ శ్రీధర్, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వంటి వారి వీడియోలు బయటకు వచ్చాయని, తన ఫొటో మార్ఫింగ్‌ చేసి పెట్టిన వారి ఫొటో కూడా తాను పెట్టానన్నారు. తనపై ఎంపీ అనుచరులు చేస్తున్న ఆరోపణలు రుజువు చేయాలని సవాల్‌ చేశారు. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానని, తనను భూమిపై లేకుండా చేస్తానన్న కుట్రలపై హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్‌ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా.. ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన వారు గురువారం మధ్యాహ్నం తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్‌లో ఎమ్మెల్యేపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించగా, సాయంత్రం ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement