గ్రామ సచివాలయానికి జనసేన సర్పంచ్‌ తాళం | Jana Sena sarpanch locks village secretariat | Sakshi
Sakshi News home page

గ్రామ సచివాలయానికి జనసేన సర్పంచ్‌ తాళం

Mar 6 2026 5:33 AM | Updated on Mar 6 2026 5:33 AM

Jana Sena sarpanch locks village secretariat

చంద్రబాబు ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమంటూ సచివాలయం వద్దే బైఠాయించి నిరసన  

నరసాపురం రూరల్‌: చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమంటూ జనసేన పార్టీ కి చెందిన సర్పంచ్‌ గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన చేపట్టిన ఉదంతం సంచలనం కలిగించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పసలదీవిలో గురువారం ఈ ఘటన జరిగింది. పసలదీవి సర్పంచ్‌ కొట్టు రామాంజనేయులు, పదిమంది వార్డుసభ్యులు, ఎంపీటీసీ సభ్యుడు జనసేన పార్టీ కే చెందినవారు. అయినప్పటికీ తమ గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని, అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ సర్పంచ్‌ రామాంజనేయులు సచివాలయానికి తాళం వేసి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. 

ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు పంచాయతీరాజ్‌శాఖ కేటాయించడంతో తమ గ్రామం అభివృద్ధిలో ముందుంటుందని అప్పట్లో ఆశపడినట్లు సర్పంచ్‌ చెప్పారు. తమ పదవీకాలం పూర్తయిందిగానీ.. అభివృద్ధి మాత్రం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు సొంత నిధులతో గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. వీటికి బిల్లుల చెల్లింపులో గ్రామ కార్యదర్శి తనకు, పంచాయతీ పాలకవర్గానికి కనీస విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

సచివాలయానికి తాళం వేయడంతో కొంతమంది ఉన్నతాధికారులు తనతో మాట్లాడారని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీ కి చెందిన సర్పంచ్‌ ఈ తీరుగా నిరసన చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ కి చెందిన ప్రభుత్వ విప్‌ బొమ్మిడి నాయకర్‌ నరసాపురం ఎమ్మెల్యే కావడటంతో ఈ సంఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement