అటవీ సంపదకు చెదలు | loss of precious forest wealth: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అటవీ సంపదకు చెదలు

Mar 6 2026 5:28 AM | Updated on Mar 6 2026 5:28 AM

loss of precious forest wealth: Andhra Pradesh

వెదురునగరం డిపోలో పాడై పోతున్న కలప

రూ. 2 కోట్ల విలువైన మారుజాతి కలప మట్టిపాలు!

అటవీ శాఖ వర్సెస్‌ వ్యాపారులు 

పాడవుతున్న కలప సంపద 

నిబంధనల ఉచ్చులో నీరుగారుతున్న ఆదాయం

అటవీ శాఖ మొండితనం, వ్యాపారుల పట్టుదల వెరసి..రూ.కోట్ల విలువైన ప్రభుత్వ సంపద పనికిరాకుండా పోతోంది. నిబంధనల సాకుతో అటవీ శాఖ అధికారులు, నాణ్యత లేదంటూ వ్యాపారులు బేరసారాలకు దిగడంతో మూడేళ్లుగా సుమారు రూ.2 కోట్ల విలువైన మారుజాతి కలప డిపోల్లోనే మట్టిపాలవుతోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సేకరించిన ఈ కలప, అధికారుల మధ్య సమన్వయ లోపం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం అటవీశాఖ ఆదాయంపై ప్రభావం చూపనుంది.

కొయ్యూరు: అటు అటవీ శాఖకు, ఇటు వ్యాపారులకు మధ్య మూడేళ్లుగా సాగుతున్న ధరల బేరం కొలిక్కి రాకపోవడంతో దాదాపు రూ. 2 కోట్ల విలువైన ‘మారుజాతి’ కలప మట్టిలో కలిసిపోతోంది. తాము నిర్ణయించిన ధరకు ఇవ్వాల్సిందేనని వ్యాపారులు, నిబంధనల ప్రకారం తగ్గించేది లేదని అటవీ శాఖ పట్టుబట్టడంతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయం గంగలో కలిసే పరిస్థితి ఏర్పడింది. 

వివాదానికి కారణం.. : 
జాతీయ రహదారి 516ఈ విస్తరణలో భాగంగా చింతాలమ్మ, రంపుల ఘాట్‌ ప్రాంతాల్లోని రిజర్వ్‌ ఫారె­స్ట్‌ చెట్లను తొలగించారు. ఈ కలపను కాకరపాడు, లోతుగెడ్డ, వెదురునగరం డిపోలకు తరలించారు. ఇందులో ఎక్కువగా సంపెంగ, తినంగి, తంగేడు వంటి మారుజాతి రకాలు ఉన్నాయి. 

ధరల వ్యత్యాసం.. 
అటవీ శాఖ అడుగుకు రూ. 550 ధర నిర్ణయించగా, నాణ్యత లేని ఈ కలపకు రూ. 250 కంటే ఎక్కువ ఇవ్వలేమని వ్యాపారులు చెబుతున్నారు. 

పరిమితి అధికారాల వల్లే..
స్థానిక డీఎఫ్‌వోకు ధరకు కేవలం పది వరకు మాత్రమే తగ్గించే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ తగ్గించాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. 

క్షేత్రస్థాయిలో.. 
    కాకరపాడు, వెదురునగరం, లోతుగెడ్డ డిపోల్లో సుమారు 1,500 క్యూబిక్‌ మీటర్ల  కలప నిల్వ ఉంది. దీనిపై ఏడాది క్రితమే పరిస్థితిని వివరిస్తూ పీసీసీఎఫ్‌కు చింతపల్లి డీఎఫ్‌వో లేఖ రాశారు. అయినా నేటికీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎండకు ఎండి, వానకు తడిసి కలప పటుత్వం కోల్పోతోంది. ఇప్పటికే చాలా వరకు కలపకు చెదలు పట్టడంతో వ్యాపారులు అసలు కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. బంగారు, వేగిస వంటి నా ణ్యమైన కలప అమ్ముడవుతున్నా, మారుజాతి కలప మాత్రం పేరుకుపోయి స్థలాన్ని ఆక్రమిస్తోంది. 

వెదురునగరం వంటి డిపోల్లో వెదురు, టేకు తప్ప ఇతర రకాల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక ధర తగ్గింపు ఉత్తర్వులు ఇవ్వకపోతే, రూ. 2 కోట్ల విలువైన సంపద పూర్తిగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. మొండితనం వీడి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణ యం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పరిస్థితి నివేదించాం
కలప పాడైపోతుందని ఇక్కడ పరిస్థితిని పీసీసీఎప్‌కు వివరిస్తూ లేఖ రాశం. వ్యాపారులు తగ్గించమన్నంత తగ్గించే అవకాశం లేకపోయినా కొంత వరకు తగ్గుతుంది. దీనిపై ఉన్నతా«ధికారుల  నుంచి ఆదేశాలు రావాలి. తమ పరిధిలో పది శాతంకు మించి తగ్గించే అవకాశం లేదు. మరోసారి ఇక్కడ మారుజాతి కలప విక్రయం కాని వైనాన్ని వివరిస్తూ లేఖ రాస్తాం – వైవీ నర్సింగరావు,  డీఎఫ్‌వో, చింతపల్లి 

Advertisement
 
Advertisement
Advertisement