యువతను దారుణంగా మోసం చేసిన ప్రభుత్వమిది
శాసనమండలిలో బాబు సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: అధికారం కోసం కూటమి ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన హామీలపై శాసనమండలి అట్టుడికింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, సభలో ఒకలెక్క, మండలిలో మరో లెక్క చెబుతున్నారని, అబద్ధాలు చెబుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం శాసనమండలిలో ఈ అంశంపై వాడీవేడీగా చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు రాజగొల్ల రమేష్‌యాదవ్, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, డాక్టర్ పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు నిరుద్యోగ సమస్యపై మంత్రిని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందా?, ఉంటే నివారణకు తీసుకున్న చర్యలు, నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఆర్థిక సాయం వివరాలు వెల్లడించాలని ప్రశ్నించారు. దీనికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమాధానమిస్తూ నిరుద్యోగ భృతి చెల్లించడం లేదని, దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వంలో 5,72,280 ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వాస్తవాలు చెప్పాలని నిలదీశారు.
నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారు
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రభుత్వం వచ్చాక మోసం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రాజగొల్ల రమేష్ యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తప్పుడు సమాచారం ఇస్తూ నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో ఎంత శాతం నిరుద్యోగం ఉంది, ప్రభుత్వం ఏమైనా నివారణ చర్యలు తీసుకున్నారా? అని అడిగితే, పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి 15 వేల ఉద్యోగాలు డీఎస్సీ ద్వారా ఇచ్చి భారీ బహిరంగ సభలు పెట్టిన వారు 5,72,280 ఉద్యోగాలు ఇస్తే అసలు ఆగుతారా అంటూ ప్రశ్నించారు. ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడిచ్చారో ప్రజలకు తెలియాలని పట్టబట్టారు. ‘‘గడిచిన 20 నెలల్లో రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులున్నారో లెక్క ఏమైనా ఉందా? దీనిపై ఏమెనా కమిటీ వేశారా? శాసనసభ సాక్షిగా సీఎం 6,28,320 ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు, ఇప్పుడు మంత్రి 5,72,280 ఉద్యోగాలు అంటున్నారు.
ఇద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నారు? డిసెంబర్‌లో రాజ్యసభకు ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం 5.2 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 8.2 శాతం ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం సమాధానం చెబుతుంది? ఎన్నికల్లో మొదటి హామీగా 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ప్రకటించారు. ఇప్పటి దాకా జాబ్ కేలండర్ ఇచ్చిన పాపాన పోలేదు. దీనిపై మంత్రి సమాధానం చెప్పాలి’’ అంటూ నిలదీశారు.
దేశంలో అత్యధిక నిరుద్యోగం ఏపీలోనే
ఎకనమిక్స్ సర్వే 2025–26 నివేదిక ప్రకారం ఏపీలో నిరుద్యోగం 8.2 శాతం ఉందని, ఇది దేశంలోనే అత్యధికమని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్సు సర్వేలో కూడా 8.2 శాతం నిరుద్యోగంతో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం నిరుద్యోగ శాతం 8.2 శాతంతో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉన్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు.
దీన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారన్నారు. ‘కేంద్రం చెబుతున్న గణాంకాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవిస్తే నిరుద్యోగ నివారణకు తీసుకున్న చర్యలేంటి? ఉద్యోగాల కల్పనలో అసెంబ్లీలో సీఎం ఒక నంబర్, మండలిలో మంత్రి చెబుతున్న నంబర్‌లలో ఏది కరెక్టు? మీరు చెబుతున్న 5,72,280 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో జిల్లాల వారీగా, వారికి చెల్లిస్తున్న వేతనాలతో సమగ్రంగా రాతపూర్వకంగా ఇవ్వాలి’ అని పట్టుబట్టారు.
జగన్ 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చారు, మీరేమిచ్చారు?
నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించేందుకు ఎలాంటి పథకం అమలు చేయడం లేదని సభలో మంత్రి చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ పెనుమత్స వరాహæ వెంకట సూర్యనారాయణరాజు అన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి, జాబ్ కేలండర్ ఇస్తామని యువతకు హామీ ఇచ్చారని, ఇప్పుడు జాబ్‌లెస్ కేలండర్‌గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి దాకా జాబ్ కేలండర్‌నే అమలు చేయలేదు. వైఎస్ జగన్ 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. మీ ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఎంత మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చారు, వారిలో ఎంత మందికి ఉద్యోగాలు లభించాయో జిల్లాల వారీగా నివేదిక ఇవ్వాలి. యువతకు స్వయం ఉపాధికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాల’ని డిమాండ్ చేశారు.
ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అని చెప్పాం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్
అనంతరం మంత్రి రాంప్రసాద్ సమాధానమిస్తూ తాము ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల్లో చెప్పింది సరిగా అర్ధం చేసుకోలేదన్నారు. తాము ‘‘20 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ భృతి’’ ఇస్తామన్నామన్నారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తున్నామని, అవి వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు.
ఆ లెక్కలు అప్పటివి.. ఈ లెక్కలు ఇప్పటివి: మంత్రి అచ్చెన్న
నిరుద్యోగంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో సీఎం, మండలిలో మంత్రి తప్పుడు లెక్కలు చెబున్నారని, వీరిద్దరిలో ఎవరు చెప్పింది నిజమో చెప్పాలని నిలదీశారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకున్నారు. ‘‘నిన్న సభలో సీఎం చెప్పిన ఫిగరు 6,28,320 ఉద్యోగాల కల్పన పాతది. మండలిలో మంత్రి చెప్పిన 5,72,280 ఉద్యోగాలు ఇప్పటివి.. ఇది తెలుసుకోవాలి’’ అనగానే వైఎస్సార్‌సీపీ సభ్యులతో పాటు సభలోని చాలామంది సభ్యులు నవ్వుకున్నారు. ఒక్కరోజులోనే లక్ష ఉద్యోగాలు ఎలా తగ్గిపోతాయని ప్రశ్నించారు.
టీటీడీ చైర్మన్‌ను తొలగించాలి
మండలిలో వైఎస్సార్‌సీపీ డిమాండ్
సాక్షి, అమరావతి: కళంకిత ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ గురువారం మండలిలో డిమాండ్ చేసింది. గురువారం ఈ అంశంపై అత్యవసర చర్చ కోరుతూ ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వరుదు కళ్యాణి, భరత్ మండలి చైర్మన్ మోషేన్‌రాజుకు వాయిదా తీర్మానం అందజేశారు. కాగా, సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్‌రాజు వైఎస్సార్‌సీపీ సభ్యులు ఇచ్చిన ఆ వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు.
దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ‘టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి’ అని నినాదాలు చేస్తూ పోడియం వద్ద నిలబడి ఆందోళన కొనసాగించారు. చైర్మన్ మోషేన్ రాజు వారించినప్పటికీ శాంతించని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు కొందరు పోడియం పైకి వెళ్లి నినాదాలు కొనసాగించారు. దీంతో, సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. వాయిదా అనంతరం దాదాపు అరగంట తర్వాత సభ ప్రారంభం కాగా, ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది.


