సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదు | Sakshi statement does not fall under violation of parliamentary rights | Sakshi
Sakshi News home page

సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదు

Mar 6 2026 4:48 AM | Updated on Mar 6 2026 4:48 AM

Sakshi statement does not fall under violation of parliamentary rights

కేవలం ప్రజాధనం వృథా పైనే కథనం ప్రచురించింది

ఆ కథనం హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందో.. రాదో.. ముందు తేల్చాలి

ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్నా అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పట్టించుకోవడం లేదు 

పదేపదే నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు 

సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ప్రాథమిక ఆధారాల్లేవు  

అయినా నోటీసులిస్తున్నారు.. హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది శ్రీరాం  

తదుపరి విచారణ వరకు నోటీసులు జారీ చేయబోమన్న ఏజీ  

ఆ వివరాలను రికార్డ్‌ చేసిన ధర్మాసనం.. విచారణ 19కి వాయిదా

సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడంపై ‘సాక్షి’ ప్రచురించిన వార్తాకథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు రాదని సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం గురువారం హైకోర్టుకు నివేదించారు. సభ లోపల జరిగిన వ్యవహారాలపై రాసిన కథనాలకే సభాహక్కుల ఉల్లంఘన వర్తిస్తుందని చెప్పారు. సభ వ్యవహారాలతో సంబంధంలేని అంశాలపై వార్తా కథనం ప్రచురించడం తప్పు కాదన్నారు. సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పారు. 

ప్రాథమిక ఆధారాలు లేకుండానే సభా హక్కుల ఉల్లంఘనపై ముందే ఓ నిర్ణయానికి వచ్చి, అందుకనుగుణంగా శాసనసభ సెక్రటరీ జనరల్‌ నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆ కథనం కేవలం పరిపాలనపరమైన అంశానికి సంబంధించింది మాత్రమేనన్నారు. అసలు ఆ కథనం సభా హక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్న విషయాన్ని ముందు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవానికి ఏది సభాహక్కుల పరిధిలోకి వస్తుంది, ఏది రాదు అన్న విషయంపై ఎక్కడా నిర్దిష్టమైన నిర్వచనం లేదని తెలిపారు. 

తమ కథనం సభాహక్కుల పరిధిలోకి వస్తుందా.. రాదా.. అన్నదానిపై ఓ వైపు న్యాయస్థానం విచారణ జరుపుతుండగానే, ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన ఆధారాలతో తమ ముందు హాజరుకావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ తాజాగా మరో నోటీసు ఇచ్చారని చెప్పారు. ఆ నోటీసుకు తాము సమాధానం కూడా ఇచ్చామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో ముందుకెళ్లకుండా ప్రివిలేజ్‌ కమిటీని, అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 

ఈ సమయంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు అవసరం లేదని, తదుపరి విచారణ వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వబోమని చెప్పారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

సభా హక్కుల కమిటీకి నివేదించిన స్పీకర్‌  
సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దాన్ని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య గత ఏడాది ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్‌ను కోరుతూ నోటీసు ఇచ్చారు. దీంతో స్పీకర్‌ ఈ వ్యవహారాన్ని సభాహక్కుల కమిటీకి నివేదించారు. ఈ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ‘సాక్షి’కి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. 

ఎమ్మెల్యే నోటీసుతోపాటు సెక్రటరీ జనరల్‌ ఇచ్చిన షోకాజ్‌ నోటీసును సవాలు చేస్తూ సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డి, చీఫ్‌ రిపోర్టర్‌ ఫణికుమార్‌ గత ఏడాది జూన్‌లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. ఇచ్చింది షోకాజ్‌ నోటీసు మాత్రమేనని, దీని తరువాత చాలా ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవంటూ వాటిని కొట్టేశారు.  

ధర్మాసనం ముందు అప్పీళ్లు  
ఈ తీర్పును సవాలు చేస్తూ ధనంజయరెడ్డి, ఫణికుమార్‌ వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరాం, వేలూరు మహేశ్వర్‌రెడ్డి, అనూప్‌ కౌషిక్‌ వాదనలు వినిపించారు. 

శాసనసభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నప్పుడు, వాటిని అడ్డుకున్నప్పుడే సభా­హ­క్కుల ఉల్లంఘన అవుతుందని శ్రీరాం వివరించారు. సాక్షి కథనం ఎక్కడా సభ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం వల్ల ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని మాత్రమే ఎత్తి చూపిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉదహరించారు.   

రూ.కోట్ల ప్రజాధనం వృథాపై సాక్షి కథనం  
ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల నిర్వహణ విషయంలో సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవడంతో కోట్ల రూపాయల మేర ప్రజాధనం వృథా అయింది. ఎమ్మెల్యేలకు రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలకు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. 

అయితే లోక్‌సభ స్పీకర్‌ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై సాక్షి గత ఏడాది ఫిబ్రవరి 22న ‘కోట్లు ఖర్చు.. శిక్షణ తుస్సు’ శీర్షికన వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్తా కథనంతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు సాక్షిపై కక్షసాధింపు చర్యలు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement