సాక్షి, నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో సమర్థవంతమైన అధికారులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారిని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వేధించడానికి 'ప్రైవేటు సైన్యం'లా వాడుకుంటోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హోంమంత్రి నియోజకవర్గాల్లో హత్యలు, అత్యాచారాలు, గంజాయి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా 'పొలిటికల్ గవర్నెన్స్'(రాజకీయ పాలన) నడుస్తోందని, శిలాఫలకాలను పగలగొట్టడం నుంచి భౌతిక దాడుల వరకు విధ్వంసమే ధ్యేయంగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలోనే ఏపీ అట్టడుగు స్థానంలో నిలిచిందని మనోహర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయని మండిపడ్డారు.
మాజీ మంత్రి కాకాణిపై 20కి పైగా అక్రమ కేసులు బనాయించిన కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. చివరకు ప్రెస్ మీట్లు పెడితే వాటిపైనా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. "సూపర్ సిక్స్ హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి పేరును డిజిటల్ డెయిరీలో నమోదు చేసి.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత చట్టపరమైన శిక్షలు తప్పవు" అని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఆపి, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని.. లేనిపక్షంలో న్యాయస్థానాల ద్వారా గట్టి పోరాటం చేస్తామని మనోహర రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..
భక్తులకు సైతం రక్షణ లేని దుస్థితి:
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో అట్టడుగు స్ధానంలో నిల్చింది. చిట్టచివరి స్ధానంలో ఉన్నప్పటికీ శాంతిభద్రతలు మెరుగుపర్చడానికి కానీ, హత్యలు, అత్యాచారాలు, గంజాయి అమ్మకాలు నియంత్రణలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి నియోజకవర్గాల్లో ఇవే సంఘటనలు జరుగుతున్నా చీమకుట్టినట్లైనా లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత సమర్థవంతంగా శాంతిభద్రతలు నిర్వహణ ఉండేది. ఇవాళ గుడికి వెళ్తున్న భక్తులకు సైతం రక్షణ లేకుండా పోయింది.
అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు..
పోలీసులు అధికార పార్టీ నేతలకు సలామ్ కొడుతూ వారి ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. పోలీస్ స్టేషన్ పైకి వెళ్లి దాడి చేసిన ఘటనలు గతంలో ఎప్పుడూ లేవు. కూటమి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైన దుస్థితి. నెల్లూరు జిల్లాలో వైయస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెద్ద సంఖ్యలో అక్రమ కేసులు బనాయించారు.
మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేసి... దాడికి పాల్పడిన వారిని వదిలేసి, తిరిగి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి, హత్యాయత్నం చేస్తే, వారిపై బెయిలబుల్ సెక్షన్లు కింది అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దాడికి గురైన అంబటి రాంబాబు గారిపై నాన్ బెయిల బుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.
కాకాణిపై కక్ష సాధింపు..
కాకాణి గోవర్ధన్ రెడ్డి పై 20 కు పైగా అక్రమ కేసులు బనాయించింది. చివరకు గతంలో ఛార్జిషీట్ ఫైల్ చేసిన కేసుల్లో ముద్దాయి కాకపోయినప్పటికీ.. ఎవరో ఒక నిందితుడో లేక సాక్షిగా ఉన్న వ్యక్తో వాంగ్మూలం ఇచ్చారని... నాలుగైదు సంవత్సరాలు తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. మరికొన్ని కేసుల్లో 2019లో ఎవరో మద్యం పంచారని, ఎవరినో తీసుకొచ్చి బెదిరించి, బలవంతం సాక్ష్యం ఇప్పించి.. అందులో గోవర్థన్‌రెడ్డి ప్రమేయం ఉందని కేసు నమోదు చేస్తున్నారు.
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరులుతో ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేస్తున్నారు. విలేకరిని బెదిరించిన విషయంపై ప్రశ్నిస్తే.. దాని మీద కేసు నమోదు చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ.. ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు.. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకొండి, టీడీపీ నేతలకు ఇప్పటికైనా బుద్ధి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలకు పిలుపునిస్తూ.. ఆ కార్యక్రమం గురించి మీడియాతో మాట్లాడితే దానిపైనా కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాకు సంబంధించి కూడా దాదాపు 8 కేసులు నమోదు చేశారు. ఇటీవల కొవూరులో బాధిత బాలికను పరామర్శించి ప్రెస్ మీట్ పెడుతూ.. శాంతిభద్రతలు కాపాడ్డంలో పోలీసులు విఫలమయ్యారు, పోలీసులు తమ పనితీరు మార్చుకోవాలని మాట్లాడితే దానిపైనా కేసు నమోదు చేశారు. అది కూడా పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూటమి పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే మరో కేసు నమోదు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.3 లక్షలు తీసుకొంటున్నారంటూ బీజేపీ నేత శేషాచలం వాట్సప్‌లో వీడియో పెడితే.. దాన్ని ఫార్వార్డ్ చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మరో కేసు పెట్టారు.
చరిత్రలో ప్రెస్ మీట్ పెడితే కేసు నమోదు చేయడం ఇంతవరకు లేదు. తెలంగాణా హైకోర్టు ఇటీవల నల్లబాలు కేసులో రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు జాగ్రత్తగా పరిశీలించి.. నిరాధారంగా కేసులు పెట్టడానికి వీల్లేదని చెప్పింది. ప్రజాస్వామ్యంలో కనీస భావప్రకటనా స్వేచ్చే లేకపోతే ఎలా అని తీర్పునిస్తే.. సుప్రీం కోర్టు దాన్ని యథాతథంగా అమలు చేయమని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పింది. అదే విధంగా బాధితులే కేసు పెట్టాలని స్పష్టం చేసింది.
కానీ ఈ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన ఇంటిపై దాడి చేయడమే కాకుండా.. ఒక ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదు చేసింది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఇదే తరహా కక్ష సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. చివరకు విలేకరులు, న్యాయవాదులపైనా కేసులు నమోదు చేస్తున్నారు.
న్యాయవాదులపైనా అక్రమ కేసులు..
కడప జిల్లా లీగల్ సెల్ ప్రతినిధి నాగిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నేతల తరపున కేసులు టేకప్ చేస్తున్నాడని భయపెట్టడానికి ఆయన మీదే కేసు పెట్టారు. చివరకు నా మీద కూడా కేసు నమోదు చేశారు. దానిపై హైకోర్టు తీవ్రంగా మందలించింది. సాక్షిలో వార్తలు రాస్తున్నారని కేసులు పెడుతున్నారు. అదే టీవీ5, ఈటీవీలో ఎంత అసభ్యకరవార్తలు రాసినా, ప్రచారం చేసినా వారిపై ఏ కేసులు ఉండవు. కూటమి ప్రభుత్వంపై వార్తలు రాస్తే మాత్రం... సాక్షితో పాటు యూట్యూబర్స్ పైనా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తరహా విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైంది.
అందుకే దేశంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో అట్టడుగ స్ధానానికి దిగజారింది. ఈ నేపధ్యంలో ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. పోలీసుల తల ఉన్నది టోపీ పెట్టుకోవడానికే తప్ప ఆలోచించడానికి కాదన్న ఓ కవి మాటలను పోలీసులు నిజం చేస్తున్నట్టే కనిపిస్తోంది. సూపర్ సిక్సి హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలా అక్రమ కేసులు నమోదు చేయడం. .వాటిపై మీడియాలో చర్చలు పెడుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు తమ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిస్తున్నాం. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై ఇదే తరహాలో వ్యవహరిస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత వీరి పరిస్థితి ఏంటన్నది ఆలోచన చేసుకోవాలి. అలా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులందరి పేర్లను డిజిటల్ డెయిరీలో నమోదు చేస్తున్నాం. ఇలాంటి అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే... వీరందరినీ భవిష్యత్తులో చట్టపరంగా శిక్షించడం ఖాయమని మనోహర్‌రెడ్డి హెచ్చరించారు.


