విజయవాడ: కులమతాలను రెచ్చగొట్టేలా సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్పీలు డిమాండ్ చేశారు. అన్ని మతాలను గౌరవించాలని రాజ్యాంగం చెబుతుంటే, అచ్చెన్నాయుడు మాత్రం కులమతలాను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) శాసనమండలి సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు.
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ‘ అచ్చెన్నాయుడితో మాట్లాడిస్తున్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. రేపు వ్యవసాయం పై జరగాల్సిన చర్చను డైవర్ట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. బీఆర్ నాయుడిని తొలగిస్తారా లేదా?’ అని ప్రశ్నించారు.
మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. కులమత రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటు. మమ్మల్ని కాదు.. చంద్రబాబుని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించాలి. వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎందుకు వాడారో చంద్రబాబుని అడగాలి.
ఇందాపూర్ కు ఎందుకు నెయ్యి టెండర్లు ఇచ్చారో చంద్రబాబుని అడగాలి. దేవుడి సొమ్మును ఎందుకు పక్కదారి పట్టించారని అడగాలి’ అని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ తిరుపతి లడ్డూ పై అపవిత్రమైన మాటలు మాట్లాడింది చంద్రబాబు. లడ్డు పై మా ప్రశ్నలకు దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. కల్తీ జరిగింది మీ హయాంలోనే. వెనక్కి పంపిన నెయ్యి ట్యాంకర్లు వాడింది మీ హయాంలోనే. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ కు దోచిపెట్టడానికే నెయ్యి ధరలు పెంచారు. దీని వెనుక పెద్ద ఆర్ధిక దోపిడీ కుట్ర ఉంది’ అని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ లడ్డు పై చర్చను పూర్తిగా కొనసాగనివ్వలేదు. లడ్డు పై మా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ కల్తీ నెయ్యి తిరుమలకు వెళ్తోంది. తమ బండారం బయటపడుతుందని వాస్తవాలను రానివ్వడం లేదు. తిరుమల దర్శనం చేసిన తర్వాతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా దేవదేవుడిని దర్శించుకున్నారు’ అని స్పష్టం చేశారు.


