చిన్నాన్న ఇంట్లో తమ్ముడు బందీ..? | Elder Brother Emotional Plea, Seeks Help To Reunite With Younger Sibling Who Is At Uncle's House In Palakollu | Sakshi
Sakshi News home page

చిన్నాన్న ఇంట్లో తమ్ముడు బందీ..?

Mar 5 2026 11:34 AM | Updated on Mar 5 2026 11:55 AM

palakollu brother seeks help younger sibling held by uncle

చిన్నాన్న ఇంట్లో అన్నదమ్ముల నిర్బంధం 

మేనమామ ఫిర్యాదుతో కదిలిన చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు 

అన్నను తీసుకువచ్చి అప్పగించిన వైనం 

తమ్ముడినీ విడిపించాలని వేడుకోలు

పశ్చిమగోదావరి : ‘మా తమ్ముడిని నన్నూ కలపండి.. చిన్నాన్న ఇంటి వద్ద తమ్ముడు బందీగా ఉన్నాడు’ అంటూ పాలకొల్లులో మేనమామ వద్ద ఉంటున్న అన్న కోటి శ్రీహర్ష ఆవేదన చెందుతున్నాడు. మేనమామ నరేష్‌ బాధిత బాలుడు హర్ష తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మర్రి నాగేంద్రబాబు, నాగమల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కోటి శ్రీహర్ష 10వ తరగతి, చిన్న కుమారుడు తులసి విశ్వాంత్‌ 9వ తరగతి చదువుతున్నాడు. నాగేంద్రబాబు విద్యుత్‌ లైన్‌మెన్‌గా పనిచేశారు. 2023లో నాగమల్లేశ్వరి కేన్సర్‌తో, 2025లో నాగేంద్రబాబు అనారోగ్యంతో మరణించారు. దీంతో పాలకొల్లుకు చెందిన మేనమామ కొమిరిశెట్టి నరేష్‌ పిల్లలిద్దరినీ పాలకొల్లు తీసుకువచ్చి చదివిస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో పిల్లల చిన్నాన్న రఘునాథ్‌ పాలకొల్లు వచ్చి నాగేంద్రబాబు కార్యక్రమం చేయాలని చెప్పి శ్రీహర్ష, విశ్వాంత్‌ను వినుకొండ తీసుకువెళ్లాడు. నెల రోజులు గడిచినా పిల్లలను పంపకపోవడంతో నరేష్‌ నిలదీశాడు. దీంతో రఘునాథ్‌ అసలు స్వరూపం బయటపడింది. పిల్లల తండ్రి నాగేంద్రబాబు చాలా అప్పులు చేశాడని, ఆ బాకీలు ఎవడు తీరుస్తాడని అంటూ.. పిల్లలు కావాలంటే రెండు చెక్కులు, రెండు నోట్లు ఇవ్వాలని అన్నాడు. తెలివితేటలు చూపిస్తే అంతుచూస్తానని బెదిరించాడు. దీంతో నరేష్‌ గత నెల 12న పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు రంగంలోకి దిగారు. పల్నాడు జిల్లా అధికారులకు సమాచారం అందించగా.. అక్కడి అధికారులు రఘునాథ్‌ ఇంటికి వెళ్లి విచారించి శ్రీహర్షను మాత్రమే విడిపించి పాలకొల్లు పంపించారు. విశ్వాంత్‌ను అక్కడే ఉంచడంపై చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులను అడగ్గా.. బాబాయి ఇంటి వద్ద బాగానే ఉందని చెప్పాడని, దీంతో అక్కడే ఉంచేసినట్టు సమాచారం ఇచ్చారు. 

తాళం వేసి ఇంట్లో ఉంచేవారు 
తాను పాలకొల్లు వచ్చి పది రోజులు కావస్తుందని, తమ్ముడు ఒక్కసారి మాత్రమే ఫోన్‌ చేశాడని శ్రీహర్ష అన్నాడు. తమ్ముడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడని, తనను పంపడం లేదని అన్నాడని కన్నీటి పర్యంతమయ్యాడు. మా నాన్న చేసిన అప్పుల కోసం మమ్మల్ని నిలదీస్తున్నారని, దయచేసి తమ్ముడినీ నన్నూ కలపండని వేడుకుంటున్నాడు. ఈనెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నాయని, తమ్ముడిపై బెంగతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. వినుకొండలో తమను తాళం వేసి ఇంట్లోనే ఉంచేవారని, కనీసం టాయిలెట్‌కు వెళ్లాలన్నా వాళ్లకు చెప్పాల్సి వచ్చేదని అంటున్నాడు. ఇదిలా ఉండగా శ్రీహర్షను మాత్రమే విడిపించి విశ్వాంత్‌ను అక్కడే ఉంచిన చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారుల తీరుపై అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.    

Advertisement
 
Advertisement
Advertisement