సాక్షి, విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ కీలక ప్రకటన చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏ4గా ఉన్న సురేష్ పరారీలో ఉన్నట్లు సిట్ వెల్లడించింది. సురేష్ పరారీలో ఉన్నట్టు ఆచూకీ తెలపాలని సిట్ ప్రకటన విడుదల చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత సెటిల్‌మెంట్ చేసేందుకు సురేష్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లాకప్ డెత్ కేసులో అరెస్టయిన సీఐ నాగరాజుకు సురేష్ స్నేహితుడు.
సిట్ ఎదుట విచారణకు హాజరైన తరువాత కేసు నమోదు కాగానే సురేష్ పరారయ్యాడు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరుగురిపై కేసు నమోదు కాగా.. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ పరారీలో ఉన్నాడని ఇప్పటికే ఏపీ హైకోర్టుకు సిట్ నివేదించింది.
కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును మూడో రోజు శనివారం సిట్ విచారించింది. సుమారు 8 గంటల పాటు ఈ విచారణ సాగింది. ఆర్‌ఎంపీతో ట్రీట్‌మెంట్ చేయించారా? మృతదేహం వివరాలు స్వర్గపురి రికార్డుల్లో రాయకుండా ఎందుకు ఒత్తిడి చేశారు? సాయికృష్ణ తల్లిని బెదిరించారా? నీ కొడుకు చనిపోయాడు.. ఫొటోకు దండవేసుకో.. అని అన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ మాజీ సీఐ నాగరాజు నుంచి మౌనమే సమాధానమైంది.
సిట్ అధికారులు ఏ ప్రశ్న అడిగినా నాగరాజు తనకేమీ తెలియదని, సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు, నాగరాజు అనుచరుడు, ఆర్‌ఎంపీని విచారించి వివరాలు రాబట్టారు. ఆ వివరాల ఆధారంగా నాగరాజును సిట్ ప్రశ్నిస్తోంది. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రక్తపు మరకలు లేకుండా చేయడంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.
సాయికృష్ణను ఎవరి ఆదేశాలతో స్టేషన్‌కు తీసుకు వచ్చారని ప్రశ్నించగా, తనకేమీ సంబంధం లేదని నాగరాజు చెప్పినట్లు తెలిసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అవేమీ తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరా పుటేజీ ఎందుకు డిలీట్ అయిందని ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. మరికొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది.


