సాక్షి, విశాఖ: ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేయడం చంద్రబాబుకు అలవాటే అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. భోగాపురం ఎయిర్‌పోర్టుపై క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు.. కుప్పం ఎయిర్‌పోర్టు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకే అబద్దాలు చెప్తే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలి. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో జీఎంఆర్‌తో ఎందుకు మాట్లాడించలేదు అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కీలకం. నిర్మాణం చేసిన జీఎంఆర్ సంస్థకు కూడా అభినందనలు. దేశ ప్రధాని ముందే సీఎం, డిప్యూటీ సీఎం.. వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడమేంటి?. ప్రధాని ముందే అబద్దాలు చెప్పారు. ప్రధానికే అబద్దాలు చెప్తే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కష్టం ఎవరిది అనేది అందరికీ తెలుసు. కొబ్బరికాయ కొట్టి.. గుమ్మడికాయ కట్టింది మాత్రమే బాబు.. ఎయిర్‌పోర్ట్ కట్టింది మాత్రం వైఎస్ జగన్.
2019లో బాబు ఎయిర్‌పోర్టుకి శంకుస్థాపన చేసినప్పటికి కేవలం 270 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఉమ్మడి ఏపీలో బాబు వేసిన శిలాఫలకాలు వందల్లో ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాక 2020లో జీఎంఆర్‌తో ఎయిర్‌పోర్ట్ ఇన్ కార్పొరేషన్ అయ్యింది. వైఎస్సార్‌సీపీ హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగంగా జరిగాయి. 150కి పైగా న్యాయ వివాదాలు పరిష్కరించి ఎయిర్‌పోర్టు నిర్మాణం చేశాం. వైఎస్సార్‌సీపీ హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం 2700 ఎకరాల భూసేకరణ చేశాం. అన్ని అనుమతులు వచ్చాకనే వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రోజు 2026లో ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తామని వైఎస్ జగన్ చెప్పారు.
ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో జీఎంఆర్‌తో ఎందుకు మాట్లాడించలేదు. ప్రారంభోత్సవంలో జీఎంఆర్ మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయని మాట్లాడించలేదు. భోగాపురం ఎయిర్‌పోర్టులో క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. కుప్పం ఎయిర్‌పోర్టు ఏమైందో చెప్పాలి. 2017లోనే చంద్రబాబు కుప్పం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు.. దాని సంగతేంటి?. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఏంటి?. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. వైఎస్సార్‌సీపీ హయంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. చంద్రబాబు ఓటు బ్యాంకుగా ఉత్తరాంధ్రను వాడుకున్నారు. అబద్దాలు చెప్పే నాయకుడి కోటాలో బాబుకి గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి. రాష్ట్రంలో అయితే రెడ్ బుక్ లేకపోతే గిన్నిస్ బుక్ నడుస్తుంది. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం వదిలేసింది. ఈ రెండున్నర సంవత్సరాల్లో రెడ్ బుక్, గిన్నిస్ బుక్, బాబు ఫేస్ బుక్ తప్ప ఏమీ లేదు. ఎవరికో పుట్టిన బిడ్డకి బాబు ఘనంగా బారసాల చేసినట్టు ఉంది.


