గాజాలో యుద్ధ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అనుగుణంగా పరిస్థితులు మారుతాయని భావించిన వేళ.. గాజాపై వరుసగా జరుగుతున్న వైమానిక దాడులు మరోసారి ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.
పాలస్తీనా ఆరోగ్య అధికారుల ప్రకారం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజా సిటీ, మధ్య గాజాలోని దెయిర్ అల్-బలాహ్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. దెయిర్ అల్-బలాహ్‌లోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో ఓ వ్యక్తి, అతని భార్య మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. గాజా సిటీలో జరిగిన మరో దాడిలో ఇద్దరు మరణించగా, వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గాజా యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ నేతృత్వంలో అమెరికా దౌత్య ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హమాస్ ఆయుధాలను వదులుకునేందుకు అంగీకరించిందని ట్రంప్ ప్రకటించినప్పటికీ.. ఆ ప్రతిపాదన అమలు దశకు చేరుకోవడంలో ఇజ్రాయెల్ వైఖరి కీలక అడ్డంకిగా మారిందని పరిస్థితులు సూచిస్తున్నాయి. ట్రంప్‌కు చెందిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ విడుదల చేసిన 15 అంశాల రోడ్‌మ్యాప్‌లో కాల్పుల విరమణ, భద్రతా ఏర్పాట్లు, యుద్ధం ముగింపు దిశగా చర్యలు ప్రతిపాదించారు. అయితే, హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ వంటి అంశాలపై ఇరు వర్గాలు తమ వైఖరుల నుంచి వెనక్కి తగ్గడం లేదు.
హమాస్ మాత్రం ఇజ్రాయెల్ దాడులను నిలిపివేసి, సైన్యాన్ని వెనక్కి తీసుకున్న తర్వాతే ఆయుధాల అంశంపై చర్చకు సిద్ధమని చెబుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం హమాస్ పూర్తిగా ఆయుధాలను వదిలేసిందనే స్పష్టమైన ఆధారాలు కనిపించే వరకు సైనిక చర్యలను ఆపబోమని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలతో ట్రంప్ శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ వైఖరి పెద్ద సవాల్‌గా మారింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రతిపాదనపై బహిరంగంగా స్పందించకపోయినా, ఆయన ప్రభుత్వంలోని కొందరు మంత్రులు మాత్రం శాంతి ఒప్పందంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ హమాస్‌పై సైనిక చర్యలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇక దౌత్య ప్రయత్నాల్లో భాగంగా మాజీ ఫతా నేత మహ్మద్ దహ్లాన్ మాట్లాడుతూ.. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇజ్రాయెల్‌తో గాజాపై దాడులు నిలిపివేయడానికి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అయితే ఒప్పందం విజయవంతం కావాలంటే ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడి, అంతర్జాతీయ పిలుపులు ఉన్నప్పటికీ గాజాలో దాడులు కొనసాగుతుండటం ట్రంప్ దౌత్య ప్రయత్నాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కాల్పుల విరమణకు మార్గం సుగమం కావాలంటే హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ భద్రతా హామీలు, గాజా భవిష్యత్ పాలనపై ఇరు వర్గాల మధ్య రాజీ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం గాజాలో పరిస్థితి చూస్తే.. వాషింగ్టన్ నుంచి వస్తున్న శాంతి పిలుపులకు మించిన ప్రాధాన్యతను ఇజ్రాయెల్ తన భద్రతా లక్ష్యాలకు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.


