సాక్షి, కర్నూలు: కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి పోలీసులు హైడ్రామాకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2.45 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్ డిస్కులను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అయితే, టీడీపీ నాయకుడు నాగరాజు వైఎస్సార్‌సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోనలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరుపాక్షిపై సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం, ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన విరూపాక్షి, చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.


