శివనామస్మరణతో 1,500 అడుగుల
ఎత్తున్న కొండెక్కిన వృద్ధులు, మహిళలు
కొండపై మైనింగ్ ఆగాలని, వర్షాలు కురవాలని పూజలు
కొండ పైనే రాత్రి బస చేసిన 84 ఏళ్ల సుధాహరరెడ్డి
సాక్షి, మదనపల్లె: మల్లన్న కొలువైన అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలో ఉన్న మల్లయ్యకొండ సముదాయంలోని సాధుకొండను మైనింగ్ పేరుతో నాశనం చేయకుండా కాపాడాలని కోరుతూ భక్తులు, వృద్ధులు, మహిళలు కొండపైకెక్కి శివయ్యకు పూజలు చేశారు. భక్తుల శివనామ స్మరణతో సాధు కొండ మార్మోగింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక కొండను మైనింగ్‌కు ఇవ్వడంపై వృద్ధులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ ఆగాలని, వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం భక్తుల విశ్వాసాలు, మనోభావాలను పట్టించుకోకుండా సాధుకొండలో మైనింగ్‌కు ఏపీఎండీసీకి కాంపోజిట్ లైసెన్స్ కట్టబెట్టింది. దీన్ని నిరసిస్తూ భక్తులు ఇప్పటికే పలు రకాలుగా నిరసనలు తెలిపారు.
కొండపై మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మల్లికార్జున స్వామి అన్నదాన ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో సమీపంలోని బోరెడ్డివారికోట నుంచి మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో 1,500 అడుగుల ఎత్తున్న సాధుకొండ ఎక్కారు. దారిలేని కొండపైకి బండరాళ్లు, చెట్ల మధ్య అనేక ఇబ్బందులు పడి పైకి చేరుకున్నారు. వారిలో వందమంది వరకు అక్కడే రాత్రి బస చేస్తున్నారు. వీరిలో పెద్దమండ్యం సింగిల్ విండో మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత, 84 ఏళ్ల వయసున్న కడప సుధాహర రెడ్డి ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు దేవరింటి రామకృష్ణారెడ్డి (పెదబాబు), దేవరింటి రవిశంకర్‌రెడ్డి కూడా అక్కడే బసచేశారు.


